Harish Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులకు 33 శాతం బోనస్ ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు బోగస్ మాటలు చెప్పిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో సీఎం కోత విధించారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే మొత్తం రూ.4,701 కోట్లల్లో కార్మికులకు 33 శాతం బోనస్ ప్రకటించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపికబురు అని చెప్పి సీఎం చేదు నిజాన్ని దాచారని ధ్వజమెత్తారు. సింగరేణి సంస్థ లాభాల వాటాలో 50 శాతం కోత విధించడడాన్ని ఆయన ఖండించారు. నెత్తురును చెమటగా చేసిన కార్మికుల ఆశలను రేవంత్ సర్కార్ అడియాశలు చేసిందని మండిపడ్డారు. 2008-09 నుంచి 2010-11 వరకు సమైక్య రాష్ట్రంలో సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇచ్చిన వాటా కేవలం 16 శాతమేనని, ఆ చరిత్రను సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి గుర్తుచేశారని పేర్కొన్నారు.
స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమం వెంట నడిచిన సింగరేణి కార్మికుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని స్వరాష్ట్రంలో నాటి సీఎం కేసీఆర్ ఎంతో ఉదారతతో వ్యవహరించారని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది (2014-15)లోనే సింగరేణి లాభాల నుంచి కార్మికులకు 21 శాతం వాటాను ప్రకటించారని తెలిపారు. నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థను లాభాల బటాలో పట్టించి కార్మికుల కష్టానికి గుర్తింపుగా ఆర్జించిన నికర లాభాల నుంచి కార్మికులకు ప్రతి ఏడాది వాటాను ఇస్తూ సింగరేణి కార్మికుల చెమటకు సెల్యూట్ చేసిన ఘనత బీఆర్ఎస్ సర్కార్‌దేనని తేల్చిచెప్పారు. 2022-23లో రూ.2,222 కోట్ల లాభాలు వస్తే కార్మికులకు ఏకంగా 32 శాతం (దాదాపు రూ.710 కోట్ల) వాటాను ప్రకటించిన కేసీఆర్ కార్మికుల కష్టానికి గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చారని తెలిపారు.
కార్మికులకు 1,550 కోట్లు దక్కాలి
2023-24లో వచ్చిన సింగరేణి సంస్థ లాభాలు రూ.4,701 కోట్లని హరీశ్‌రావు పేర్కొన్నారు. అందులో 33 శాతం లాభాలు పంచితే ఆ మొత్తం రూ.1,550 కోట్లు కార్మికులకు దక్కాల్సి ఉన్నదని తెలిపారు. కానీ కార్మికులకు ప్రకటించింది కేవలం రూ.796 కోట్లేనని, ఈ లెక్కన 16.9 శాతం మాత్రమే బోనస్‌గా ఇచ్చినట్టవుతుందని పేర్కొన్నారు. కార్మికులకు హకుగా రావాల్సిన మిగతా వాటా రూ.754 కోట్లు ఏమైనట్టు? అని ప్రశ్నించారు. ఆల్ టైం రికార్డు ఉత్పత్తిని సాధించినా గతం కంటే ఒకో కార్మికుడికి అదనంగా ఇచ్చేది రూ.20 వేలేనా? అని సర్కార్‌ను నిలదీశారు.
లాభాలు తెచ్చిన కార్మికులకు చీకట్లా?
అందరికీ వెలుగులు అందించే సింగరేణి కార్మికుల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి నింపే ప్రయత్నం చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో కార్మికులకు జరిగిన అన్యాయం కంటే స్వరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నదని పేర్కొన్నారు. బోనస్ విషయంలో కార్మికులకే కాకుండా కాంట్రాక్ట్ కార్మికులకూ అన్యాయమే చేసిందని, ఉద్యోగుల సంఖ్యను కుదించి రూ.5 వేల బోనస్‌ను కొందరికే పరిమితం చేసిందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర ప్రగతిలో ఎంతో కీలకంగా ఉన్న సింగరేణి కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు. పదేండ్లలో సింగరేణి సంస్థ లాభాలు, కార్మికులకు ఇచ్చిన బోనస్, వాటా వివరాల జాబితాను హరీశ్‌రావు విడుదల చేశారు.