రాజకీయాల కోసం రైతులపై కాంగ్రెస్ పగ తీర్చుకుంటున్నది. కాళేశ్వరం నీళ్లను సముద్రం లోకి వదులుతున్నది. ఎల్లంపల్లిలో 62 వేల క్యూసెక్కులు, కడెంకు 1.5 లక్షల క్యూసెక్కులు వరద వస్తున్నది. నందిమేడారంలో కట్క ఒత్తితే రోజుకు 2 టీఎంసీల నీళ్లు మిడ్‌మానేరులో పడ్తయ్. కావాలనే చేస్తలేదు!
– హరీశ్‌రావు
సిద్దిపేట, ఆగస్టు 17( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న గోబెల్స్ ప్రచారాన్ని నిజం చేసేందుకే ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం నీళ్లు వస్తే వారు చెప్పినవి అబద్ధాలని ప్రజలకు అర్థమవుతుందని, కాబట్టి కావాలనే మోటర్లు ఆన్ చేయడం లేదని విమర్శించారు. మోటర్లను పూర్తిగా ఆన్ చేయకుండా ఆన్, ఆఫ్ చేస్తున్నారని, మోటర్లను ఇలా పదేపదే ఆన్ఆఫ్ చేయడం వల్ల వాటి బేరింగ్లు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా వాటిని దెబ్బతీసి ఆ నెపాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇవి సాధారణంగా ఇంట్లో వాడే వన్ హెచ్‌పీ మోటర్లు కావని, ఒక మోటరు నడవాలంటే ఒక జిల్లా ప్రజలు వాడేంత కరెంటు అవసరమవుతుందని చెప్పారు. కాబట్టి వాటిని ఆన్ఆఫ్ చేయడం వల్ల బేరింగ్లు దెబ్బతింటాయని, వేలకోట్ల నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
బీహెచ్ఈఎల్ కూడా ఇదే విషయమై ప్రభుత్వాన్ని హెచ్చరించిందని గుర్తుచేశారు. చొప్పదండిలో రేషన్‌కార్డులు పంచేందుకు వచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై జనాలు తిరిగబడి మోటర్లు ఆన్ చేయాలని డిమాండ్ చేశారని, దీంతో వాటిని ఆన్‌చేసి ఆయన వెళ్లిపోగానే ఆఫ్ చేశారని తెలిపారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కేసీఆర్‌పైనా, హరీశ్‌రావుపైనా కోపం ఉంటే తమకు శిక్ష వేయాలి కానీ రైతులకు వేయడం సరికాదని పేర్కొన్నారు. మోటర్లను ఆన్ చేయకుండా నీళ్లను సముద్రంపాలు చేస్తారా? అని ప్రశ్నించారు. రిజర్వాయర్లను నీటితో నింపేందుకు ఏం అడ్డం వచ్చిందని నిలదీశారు. మోటర్లు ఆన్ చేయడం చేతకాకపోతే లక్షల మంది రైతులను తీసుకెళ్లి మోటర్లు ఆన్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రైతులపై పగ తీర్చుకుంటున్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతులపై పగ తీర్చుకుంటున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యిలాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే, ఈ ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టును పడావు పెట్టిందని మండిపడ్డారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 62 వేల క్యూసెక్కుల వరద వస్తున్నదని, మధ్యాహ్నం తర్వాత కడెం ప్రాజెక్టుకు 1.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నదని పేర్కొన్నారు. నందిమేడారంలో కట్క ఒత్తితే రోజుకు రెండు టీఎంసీల నీళ్లు వచ్చి మిడ్ మానేరులో పడతాయని వివరించారు. అన్నపూర్ణ రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, వెంటనే మోటర్లు ఆన్ చేయాలని వారం రోజుల క్రితమే ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశానని తెలిపారు. అయినప్పటికీ ఆన్ చేయలేదని, ఇది ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమని మండిపడ్డారు. ఈ కారణంగానే గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని డ్యాము లు ఖాళీగా ఉన్నాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. నీళ్ల విలువ ఉత్తమ్, రేవంత్‌కు తెలియదని విమర్శించారు.
ముఖ్యమంత్రికి సోయి ఉందా?
రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకు మంత్రి ఉన్నాడా? ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 30 టీఎంసీల మిడ్‌మానేరులో ఉన్నది కేవలం పది టీఎంసీలేనని, ఎల్ఎండీలో 24 టీఎంసీల్లో 7 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి ఈ ప్రభుత్వాన్ని నడపడం చేతనవడం లేదని విమర్శించారు. ఈ రిజర్వాయర్లు అన్నింటినీ నింపితే యాసంగిలో లక్షల ఎకరాల్లో పంట పండుతుందని పేర్కొన్నారు. ఎల్లంపల్లిలో ఏడు మోటర్లు నడిపితే 22,000 క్యూసెకులు మిడ్ మానేరుకు వస్తాయని, మూడు మోటర్లే ఎందుకు నడుపుతున్నారని నిలదీశారు. కాళేశ్వరం మోటర్లను ఆన్‌చేసి రిజర్వాయర్లను, చెరువులను నింపాలని డిమాండ్ చేశారు.
రైతులను గోస పెడుతున్నది
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గోసపుచ్చుకుంటున్నదని, ఎరువుల కోసం, పంట బీమా కోసం, కరెంటు కోసం, చివరికి నీళ్లు ఇచ్చేందుకు కూడా గోసపెడుతున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు రెండు టీఎంసీలు తెచ్చే వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టిందని చెప్పారు. ఎరువుల బస్తాల కోసం రైతులు గత పదేండ్లలో ఎన్నడూ అరుగుల మీద పడుకోలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదేనని మండిపడ్డారు. చెప్పులను లైన్లో పెట్టి అరుగుల మీద పడుకునే రోజులు మళ్లీ వచ్చాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు.
పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నా
నీటి పారుదలశాఖ మాజీ మంత్రిగా రైతుల పక్షాన తాను పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నానని హరీశ్‌రావు పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు మాని వరద నీటిని ఒడిసి పట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటు పడాలని ప్రభుత్వానికి సూచించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారని, కానీ మోటర్లను మాత్రం ఆన్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్వకుర్తిలో మూడు మోటర్లకు బదులు ఒక్క మోటర్ మాత్రమే నడుపుతున్నారని పేర్కొన్నారు. మూడు మోటర్లు నడిపి రోజుకు 2,400 క్యూసెక్కులు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం 800 క్యూసెక్కులు మాత్రమే తీసుకుంటున్నారని తెలిపారు.
దేవాదుల విషయంలోనూ ఇలాగే చేశారని విమర్శించారు. దేవాదుల ఫేజ్-3 మోటర్లు ఇప్పటికీ నడవడం లేదని ప్రశ్నించారు. దీనివల్ల వరంగల్ జిల్లాకు నష్టం జరుగుతున్నదని, కాళేశ్వరం మోటర్ ఆన్ చేయకుంటే కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు నష్టం జరుగుతుందని వివరించారు. ఇవన్నీ పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదని, వాటాలు పంచుకునేందుకు, ఢిల్లీకి తిరగడానికి, మంత్రుల మధ్య కొట్లాటలకే వారి సమయం సరిపోతున్నదని ఎద్దేవా చేశారు. మీడియా సమావేశంలో వేలేటి రాధాకృష్ణశర్మ, రాజనర్సు, మాణిక్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, భూపేశ్, కిషన్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, సోంరెడ్డి, ఎల్లారెడ్డి, రమేశ్, శ్రీహరి తదితర నాయకులు ఉన్నారు.