Harish Rao | బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రాకుండా చేసి, ప్రజా సమస్యలు సభలో చర్చకు రాకుండా చేయడమే మీ కుట్రా అని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలు, సెక్షన్ 22A భూముల వ్యవహారం, భూ కుంభకోణాలపై చర్చకు భయపడుతున్నారా అని నిలదీశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, రైతు సమస్యలు, సభలో చర్చకు వస్తాయనే భయంతోనే ఈ అరెస్టులా అని మండిపడ్డారు. మహిళా శాసనసభ్యుల చీరలు లాగారని.. గొంతు పిసికారని తెలిపారు. ఈ వికృత చేష్టలకు పాల్పడిన వారిపై చర్యలకు తీసుకోరా అని ప్రశ్నించారు. ఉల్టా మాపైనే కేసులు పెట్టి అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు.
మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై దాడి జరిగిందని హరీశ్‌రావు తెలిపారు. సబితా ఇంద్రారెడ్డిపై మగ పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సునీతమ్మ చీర లాగారన్నారు. దీనిపై హైదరాబాద్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే చర్యలు లేవని తెలిపారు. ఉల్టా సబితమ్మ, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న మహిళా ఎమ్మెల్యేలపై అసెంబ్లీ ఎదుట జరిగిన దాడి.. రాష్ట్రంలోని మహిళలందరిపై జరిగిన దాడిగా హరీశ్‌రావు అభివర్ణించారు. ఇది కౌరవ సభ.. రేవంత్ రెడ్డి కలియుగ దుశ్వాసనుడు అని విమర్శించారు. కౌరవులకు పట్టిన గతే కాంగ్రెసోళ్లకు పడుతుందని అన్నారు. శ్రీధర్ బాబుకు కూడా అక్కాచెల్లెళ్లు ఉన్నారని హరీశ్‌రావు అన్నారు. మహిళా సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు క్షమాపణ చెబుతారని అనుకున్నామని తెలిపారు. కానీ మా ఎమ్మెల్సీలను అరెస్టు చేసి, జైలుకు పంపించారని అన్నారు. అధికారం మీ చేతిలో ఉంది.. మీ ఇష్టమని వ్యాఖ్యానించారు.
స్పీకర్ అంటే తమకు అత్యున్నత గౌరవం ఉందని హరీశ్‌రావు స్పష్టం చేశారు. స్పీకర్‌తో ఇదే సభలో కలిసి పనిచేశామని తెలిపారు. స్పీకర్‌ను ఉద్దేశించి అనలేదని మా ఎమ్మెల్సీ తాతా మధు మీడియా ముఖంగా చెప్పారని అన్నారు. ఒకవేళ స్పీకర్ భావించి ఉంటే విత్‌డ్రా చేసుకుంటానని చెప్పారని తెలిపారు. స్పీకర్ బాధపడి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని కూడా చెప్పారని పేర్కొన్నారు. స్పీకర్ బాధపడి ఉంటే మేమందరం కూడా విచారిస్తు్న్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితులపై గౌరవం ఉంటే.. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు అవమానించారని ప్రశ్నించారు. భారీ అంబేద్కర్ విగ్రహానికి కనీసం ఒక పూలదండ అయినా వేశారా అని నిలదీశారు.
మా పార్టీ మహిళా సభ్యులకు జరిగిన అవమానంపై చర్యలేవి అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మా మీద దాడి చేయించింది రేవంత్ రెడ్డినే అని స్పష్టం చేశారు.