సిద్ధిపేట : ఉత్తరప్రదేశ్ ఎన్నికలు పూర్తి కాగానే డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతారని.. సబ్సిడీల్లో కోత.. ధరల పెంపు.. వివక్ష తప్పా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు చేసేందేమీ లేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులు ఇచ్చి, తెలంగాణకు మొండిచేయి చూపిస్తుందన్నారు.
కేంద్రం విద్యుత్ ఉత్పత్తి అయ్యే బొగ్గుపై విపరీతంగా సెస్ పెంచి భారం వేసిందని తెలిపారు. ఉచితంగా వచ్చే లోయర్, సీలేరు పవర్ ప్లాంట్ ఆంధ్రాకు అప్పగించిందని.. లోయర్ సీలేరు ఉంటే పది పైసలకే విద్యుత్ వచ్చేదని, బీజేపీ రాగానే లాక్కుందని.. ఇలా అన్ని రంగాల్లోనూ తెలంగాణను వివక్ష చూపుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక విధానాలు అవలంభించడం ద్వారా కేంద్రం ఆదుకోకపోయినా.. వివక్ష చూపినా అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందన్నారు.
రాష్ట్ర ప్రజానీకానికి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, ప్రతీ ఏటా పెట్టుబడి సాయం కింద రైతుబంధు, అలాగే రైతుబీమా.. ఇలా దేశంలో ఏ సీఎం, ఏ రాష్ట్రాలైనా ఇస్తున్నాయా? అన్నారు. బట్టేబాజ్, జూటే బాజ్ పార్టీ బీజేపీ అని, గ్రామ క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు యువత నిజాన్ని, వాస్తవాన్ని గ్రహించి బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే, బీజేపీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.