కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఉద్యమంలో జై తెలంగాణ అన్నోళ్ల మీద తుపాకీ ఎక్కుపెట్టిన నీ (రేవంత్‌రెడ్డి) మరక నిన్ను వెంటాడుతది.. రాజీనామా చేయకుండా వెన్ను చూపిన నీ మరక నిన్ను వెంటాడుతది.. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ పేరు నిలిచి ఉంటది.. రాష్ర్టాన్ని కాపాడుకునే క్రమంలో ఆ రోజు కొందరు వచ్చి చేరిండ్రు.. ఇప్పుడు పాలేవో నీళ్లేవో తెలిసింది. ఆ దొంగలను మళ్లీ రానిచ్చే ప్రసక్తే లేదు.
– హరీశ్‌రావు
Harish Rao | సిద్దిపేట,నవంబర్ 29(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కేసీఆర్ నిబద్ధత, చిత్తశుద్ధి వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలే శ్వాసగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమించి రాష్ర్టాన్ని సాధించారని పేర్కొన్నారు. ‘కేసీఆర్ దీక్ష స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్‌ను గద్దె దించేదాకా అందరం ఒక్కటై కొట్లాడుదామని సంకల్పం తీసుకుందాం.. లగచర్లలో కొట్లాడింది బీఆర్ఎస్.. హైడ్రాకు వ్యతిరేకంగా కొట్లాడింది బీఆర్ఎస్.. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతన్నది బీఆర్ఎస్.. నాటి ఉద్యమ స్ఫూర్తితో ముందుకుసాగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం’ అని పిలుపునిచ్చారు.
దీక్షా దీవస్‌ను పురస్కరించుకొని ముందుగా సిద్దిపేటలోని ప్రశాంత్‌నగర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, సీనియర్ నాయకులు వంటేరు ప్రతాప్‌రెడ్డి, వేలేటి రాధాకృష్ణ శర్మ, రాజనర్సు, సంపత్‌రెడ్డి, వేలాది మంది నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేశారు. అనంతరం రంగధాంపల్లి వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను తిలకించారు. ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పార్టీ జెండాను అవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడుతూ.. 1956లో తెలంగాణను ఆంధ్రలో కలపడంతోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందని గుర్తుచేశారు.
1969 ఉద్యమంలో 369 మంది చనిపోయారని, ప్రొఫెసర్ జయశంకర్ జీవితమంతా తెలంగాణ కోసం అంకితం చేశారని చెప్పారు. కేసీఆర్ లాంటి నాయకుడు రాకపోతాడా? అని జయశంకర్ సార్ తపించారని, అదే సమయంలో కరెంట్ బిల్లులు పెరగడంతో నాడు రైతుల కోసం జై తెలంగాణ అని కేసీఆర్ బయల్దేరారని, 2001 ఏప్రిల్ 27న జల దృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారని గుర్తుచేశారు. పార్టీ ఏర్పడిన తొలినాళ్లలోనే కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్తులను గెలుపొందామని, 2004లో తెలంగాణ ఇస్తామని ఒప్పుకుంటేనే కాంగ్రెస్‌తో కేసీఆర్ పొత్తు పెట్టుకున్నారని తెలిపారు.
దాదాపు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారని, యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తాను మంత్రి పదవి కోసం ఢిల్లీకి రాలేదని.. తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమని కేసీఆర్ చెప్పారని, నాడు పట్టుబట్టి కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో తెలంగాణను పొందుపరిచేలా కేసీఆర్ ఒత్తిడి తెచ్చారని వివరించారు. నాటి రాష్ట్రపతి ఉభయ పార్లమెంట్ సభల్లో తెలంగాణ ఏర్పాటు గురించి చెప్పారని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన పుస్తకంలో రాశారని గుర్తుచేశారు. ‘కేసీఆర్‌లో ఆ నిబద్ధత, నిజాయితీ చూశానని పుస్తకంలో ప్రణబ్ ముఖర్జీ రాసిండ్రు. కేసీఆర్ గురించి ఈరోజు చాలా మంది ఏదేదో మాట్లాడుతున్నరు.. నాడు కేసీఆర్ మంత్రి పదవి గురించి ఆలోచించి ఉంటే నేడు తెలంగాణ వచ్చేదే కాదు’ అని స్పష్టంచేశారు.
కేసీఆర్ ఆనవాళ్లు తీసేస్తా అంటున్నవ్.. ఏ ఆనవాళ్లు తీసేస్తావ్ రేవంత్‌రెడ్డీ.. అల్గునూర్‌లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసిన ఆనవాళ్లను తీసేస్తవా? ఖమ్మం జైలులో కేసీఆర్‌ను పెట్టిన ఆనవాళ్లు లేకుండ చేస్తవా? రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తెచ్చిన డిసెంబర్ 9 ఆనవాళ్లు లేకుండా చేస్తవా? 2014, జూన్ 2న ప్రమాణస్వీకారం చేసిన చరిత్రను తీసేస్తవా?
– హరీశ్‌రావు
2004 నుంచి 2009 వరకు ఎన్నిసార్లు తెలంగాణ గురించి అడిగినా నాటి యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీశ్ తెలిపారు. తమను అసెంబ్లీలో నాటి సీఎం రాజశేఖర్‌రెడ్డి ఎంతో అవహేళన చేశారని వాపోయారు. ‘ఇవ్వడానికి తెలంగాణ ఏమైనా సిగరెట్టా.. బీడీనా అని హేళనగా మాట్లాడిండ్రు.. హైదరాబాద్ వెళ్లాలంటే పాస్‌పోర్ట్, వీసా అవసరం ఉంటదని ఆంధ్రవాళ్లను కావాలని రెచ్చగొట్టిండ్రు. తెలంగాణ ఇవ్వకుండా అటు రాయలసీమ వాళ్లను రెచ్చగొట్టిండ్రు..నాడే టీఆర్ఎస్ను అంతం చేయాలని చూసి ఎమ్మెల్యేలను తీసుకున్నరు.. అయినా ఆగకుండా పోరాటం చేసినం’ అని గుర్తుచేశారు.
2008లో ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామా చేసింది టీఆర్ఎస్ పార్టీ అని, ఎన్నోసార్లు రాజీనామా చేసి ఉద్యమాలు చేశామని, టీడీపీతో కూడా జై తెలంగాణ అనిపించిన ఘనత కేసీఆర్‌దేనని స్పష్టంచేశారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ర్టాలు అని చెప్పి మోసం చేసిందని, అన్ని పార్టీలు తెలంగాణను వాడుకొని మోసం చేశాయని, అప్పుడే హైదరాబాద్ ఫ్రీ జోన్ అని ఆంధ్రా పాలకులు కుట్రలు చేస్తుంటే తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు దొరకయన్న ఆవేదనతో ఉద్యమానికి, ఆ సమయంలోనే సిద్దిపేటలో ‘ఉద్యోగ గర్జన’కు కేసీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.
‘2009, అక్టోబర్ 12న సిద్దిపేట అంబేద్కర్ భవన్లో ఉద్యోగ గర్జన సభ సన్నాహక సమావేశం జరుగుతున్న సమయంలో అవసరమైతే తెలంగాణ కోసం ఆమరణ దీక్షకు దిగుతానని కేసీఆర్ చెప్పారు.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అన్న నినాదాన్ని నాడే ఇచ్చారు. 2009, అక్టోబర్ 21న సిద్దిపేటలో టీఎన్జీవో అధ్యక్షుడు స్వామిగౌడ్, టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవీప్రసాద్ ఆధ్వర్యంలో లక్షలాది మంది ఉద్యోగులతో అద్భుతమైన ఉద్యోగ గర్జన సభ జరిగింది.
తర్వాత కేసీఆర్ సిద్దిపేట వేదికగా నవంబర్ 29న ఆమరణ దీక్షకు పూనుకున్నరు.. ఆ క్రమంలో అల్గునూరు వద్ద కేసీఆర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఖమ్మం జైలుకు తరలించిండ్రు’ అని హరీశ్ గుర్తుచేశారు. కేసీఆర్‌ను ఖమ్మం తరలిస్తే ఉద్యమం చల్లారుతుందని నాటి సీఎం రోశయ్య అనుకున్నారని, కానీ ఖమ్మం జైలు వద్దకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, లాయర్లు, విద్యార్థులు, నాయకులు తరలివచ్చారని చెప్పారు.
ఖమ్మం జైలులో కేసీఆర్‌తో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, నాయిని నరసింహారెడ్డి, రాజయ్య యాదవ్ లాంటి వాళ్లను కూడా నిర్బంధించారని, అప్పుడు తాము రంగధాంపల్లిలో దీక్షకు పూనుకుంటే అందర్నీ అరెస్ట్ చేసి వివిధ జైళ్లకు తరలించారని చెప్పారు. నాడు సిద్దిపేటలో ఎటు చూసినా పోలీసులే ఉన్నారని, అయినా కొన్ని వేల మంది దీక్షాస్థలికి వచ్చారని, ఎన్ని కేసులు పెట్టినా పోరాటం కొనసాగించామని గుర్తుచేశారు. డిసెంబర్ 3న ఖమ్మం నుంచి నిమ్స్‌కు కేసీఆర్‌ను తరలించారని చెప్పారు.
తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో అనే నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ తెగించిండ్రు.. ‘ది కోయిలేషన్ ఈయర్స్ : 1996-2012’ పుస్తకంలో కేసీఆర్ నిబద్ధత గురించి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రస్తావించిండ్రు.. కేంద్రంలో ఏ శాఖ కావాలని కేసీఆర్‌ను అడిగితే.. ప్రణబ్‌జీ నా లక్ష్యం మీకు తెలుసు.. మీరు నాకు ఏశాఖను కేటాయించారనేది ముఖ్యంకాదు.. నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అని కేసీఆర్ చెప్పారని ప్రణభ్ తన పుస్తకంలో రాసుకున్నరు.. ఇదీ కేసీఆర్ కమిట్మెంట్కు నిదర్శనం
– హరీశ్‌రావు
రాజకీయ ప్రక్రియతో రాష్ర్టాన్ని సాధిద్దామని కేసీఆర్ అనుకుంటే తమతో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ తెలంగాణను మోసం చేశాయని, అప్పుడు గాంధీ అనుసరించిన మార్గంలో నడవాలని తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని హరీశ్ చెప్పారు. నాటి కేసీఆర్ దీక్ష సబ్బండ వర్గాలను ఏకం చేసిందని, పార్టీలకతీతంగా ప్రజలు ఏకమై ఉద్యమించారని తెలిపారు. 10 రోజుల దీక్ష తర్వాత ప్రతి ఒక్కరూ కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందారని, కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ జైత్రయాత్రా?.. కేసీఆర్ శవయాత్రా? అని పట్టుబట్టి దీక్ష కొనసాగించారని వివరించారు.
కేసీఆర్‌కు ఏమైనా జరిగితే తెలంగాణ అగ్నిగుండమైతదని కేంద్ర ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి చిదంబరం జయశంకర్ సార్‌తో ఫోన్లో మాట్లాడారని, అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రకటన చేసిందని చెప్పారు. దీక్షా దివస్ వెనుక ఇంత పోరాటం ఉన్నదని, నాటి కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని స్పష్టంచేశారు. ‘అప్పుడు తెలంగాణ అంతా పండుగలు చేసుకుంటుంటే.. ఆంధ్రా నాయకులు ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు ఉండనీయకుండా చేసిండ్రు.
వాళ్లు రాజీనామాలు చేస్తే డిసెంబర్ 23న ఇచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్నది. అప్పుడు తెలంగాణ సమాజం తెలంగాణ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలంటే ఒక్క గులాబీ సైనికులు తప్ప ఏ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చేయలేదని తెలిపారు. బీజేపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే నేటి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని రాజీనామా చేయిమంటే చేయకుండా ఢిల్లీకి వెళ్లలేదని, ఇప్పుటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా నాడు రాజీనామా చేయిమంటే కానీసం జిరాక్స్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నడా?.. తెలంగాణ కోసం ఎప్పుడైనా రాజీనామా చేసిండా? కనీసం అమరులకు ఒక పువ్వయినా పెట్టి నివాళి అర్పించిండా?’ అని నిలదీశారు. ‘మాపై 350కి పైగా కేసులున్నయి.. రేవంత్ మీద ఒక్క ఉద్యమ కేసైనా ఉన్నదా? ఓటుకు నోటు కేసు మాత్రం ఉన్నది’ అని దుయ్యబట్టారు.
‘తెలంగాణ ఉద్యమానికి గొప్ప చరిత్ర ఉన్నది.. నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటే తెలంగాణ సాధనలో నేను సైతం అనే తృప్తి కంటే ఇంకేమి గొప్పది ఉండదు’ అని తెలిపారు. ‘గాంధీ నాయకత్వం లో నడిచిన స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల్లా.. కేసీఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమంలో మనందరిదీ అంత గొ ప్ప అనుభూతి.. అలాంటి తెలంగాణను సాధిం చి రాష్ర్టాన్ని కేసీఆర్ ఎంత గొప్పగా తీర్చిదిద్దారో గుర్తుచేసుకోవాలి’ అని సూచించారు.
తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని, తలసరి ఆదాయంలో, ధాన్యం పండించడంలో, జీఎస్డీపీలో, తాగునీటి సరఫరాలో, నిరంతర విద్యుత్తులో దేశానికి దిక్సూచిగా నిలిపారని హరీశ్ గుర్తుచేశారు. కాంగ్రెస్ వచ్చాక రైతుబంధు, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ఇలా అన్నీ బంద్ అయ్యాయని వాపోయారు. తెలంగాణ రాష్ట్రంపై కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు ఉన్నంత ప్రేమ ఏ పార్టీకీ ఉండదని స్పష్టంచేశారు.