హైదరాబాద్, జూలై17(నమస్తే తెలంగాణ): సీఎంల భేటీలో బనకచర్ల అంశం ఎజెండాలో ఉన్నదా? లేదా? బనకచర్ల కమిటీ పడిందా? లేదా? ఆంధ్రా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పింది నిజమా? కాదా? కమిటీ వేసినట్టు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నిజమా? అబద్ధమా? చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ బనకచర్ల మీద జరిగిన చర్చ అబద్ధమే అయితే ఆల్ ఇండియా రేడియో మీద, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి రామానాయుడు మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియతో హరీశ్‌రావు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు, బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు మీద ఒక్క నెలలో రిపోర్టు వస్తుందని, దానిని తాను ఒప్పుకుంటానని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను బాబుకు అప్పగిస్తూ రేవంత్‌రెడ్డి పట్టపగలు నగ్నంగా దొరికిపోయారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చీకటి బాగోతాన్ని కప్పిపుచుకోవటానికి, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సబ్జెక్టు లేక దొరికిపోయి.. డ్రగ్స్, గంజాయి అని సీఎం చెత్త మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
బనకచర్ల మీద కమిటీ వేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రేవంత్ సమావేశంలో పాల్గొనడాన్ని తాము తప్పుబట్టడం లేదని, బనకచర్ల మీద చర్చ జరగలేదని బుకాయించడాన్ని తప్పు పడుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు వత్తాసు పలకడాన్ని, గోదావరి- బనకచర్లకు ఒప్పుకోవడాన్ని తప్పు పడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ మీడియా ఆల్ ఇండియా రేడియో కూడా గోదావరి-బనకచర్ల మీద కమిటీ వేసినట్టు చెప్పిందని, ఈవార్త విన్నాక రేవంత్‌రెడ్డి ముఖం ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్‌రెడ్డి కంపల్సివ్ లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధ పడుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఒకవైపు చర్చ జరిగిందని ఆంధ్రా మంత్రి, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఎజెండా చెప్తుంటే రేవంత్ మాత్రం చర్చ జరగలేదని చెప్పడం అంటే కంపల్సివ్ లైయింగ్ సిండ్రోమ్ వ్యాధి లక్షణమేనని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మహిళలకు లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు అని బహిరంగ సభలో అబద్ధమాడి, తీరా వాళ్లకు ఇస్తున్నది రూ. 5 లక్షలు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఢిల్లీ పర్యటనకు ముందు ఆంధ్రాకు షాక్ అని లీక్ ఇచ్చి, మధ్యాహ్నం బనకచర్ల ఉంటే బాయ్‌కాట్ అని చెప్పి, రాత్రికల్లా పరుగు పరుగున ఢిల్లీకి వెళ్లారని హరీశ్‌రావు చెప్పారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాకైనా జై తెలంగాణ అంటాడేమో అనుకున్నాం కానీ, ఇప్పటి వరకు ఆయన నోటి నుంచి జై తెలంగాణ అనే మాట రాలేదన్నారు. చివరకు రాహుల్‌గాంధీ, ఖర్గే తెలంగాణకు వచ్చినప్పుడు జై తెలంగాణ అన్నారని, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య జై కర్ణాటక, మహారాష్ట్ర నాయకులు జై మహారాష్ట్ర అనలేదా? అని గుర్తు చేశారు. జై తెలంగాణ అంటే చంద్రబాబుకు కోపం వస్తుందని భయపడుతున్నావా అని రేవంత్‌ను హరీశ్‌రావు నిలదీశారు.
నీటి వినియోగానికి, నీటి పంపకాలకు మధ్య తేడా తెలియని అజ్ఞానంతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. 299, 512 అనేది తాత్కాలిక నీటి వినియోగ ఒప్పందమని చెప్పారు. నీటి వినియోగం బోర్డు చేస్తుందని, నీటి పంపకం ట్రిబ్యునల్ చేస్తుందని తెలిపారు. తాత్కాలిక నీటి ఒప్పందం చేసుకొని కేసీఆర్ ట్రిబ్యునల్ సాధించారని చేశారు. ఒక వేళ “299, 512 పర్మనెంట్ ఒప్పందం అయితే మళ్లీ ట్రిబ్యునల్‌కు ఎందుకు వెళ్లారు? కామన్సెన్స్ కదా? నీకు జ్ఞానం లేకుండానైనా ఉండాలి, లేదా నీకు కంపల్సివ్ లైయింగ్ సిండ్రోమ్ అయినా ఉండాలి” అని రేవంత్‌కు చురకలు వేశారు.
“కేటీఆర్ ఈ రాష్ట్ర గౌరవాన్ని, ఈ దేశ ప్రతిష్ఠను జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద నిలబెట్టిండు. ఆయన విదేశాల్లో చదువుకొని విజ్ఞానం పొందిన నేత. అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడగలరు. నువ్వేమో ఆత్మన్యూనతతో బాధపడుతున్నావు. కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని కూల్చడానికి బాబు ఇచ్చిన బ్యాగులు మోసినోడివి నువ్వు. ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నవు. మీదంతా బ్యాగుల బ్యాచ్. నువ్వు నీ చుట్టు ఉన్నవాళ్లంతా బ్యాగుల బ్యాచ్. పరిపాలన చేయడం అంటే బ్యాగులు మోసుడు కాదు రేవంత్‌రెడ్డీ. కేసీఆర్ తరహాలో రాష్ర్టాన్ని తీర్చిదిద్దడం. కేసీఆర్ ఎక్కడ కూర్చున్నా ఈ రాష్ర్టాన్ని దేశానికి దిక్చూచిగా నిలిపారు. నీ పాలనలో ఏం జరుగుతున్నది.
నీ పాలన అయితే జూబ్లీహిల్స్ ప్యాలెస్, లేదంటే పోలీసు వలయం మధ్యన కమాండ్ కంట్రోల్ రూం. ఇదీ నీ పాలన. రోజూ ప్రజలను కలుస్తా, ప్రజా దర్బార్ పెడుతా అని గప్పాలు కొట్టినవ్. ప్రజలను కలుస్తున్నవా? అసలు సచివాలయానికి ఎందుకు పోవడం లేదు రేవంత్‌రెడ్డీ నువ్వు? రోజుకొక హాస్టల్లో విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారు. మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో జనం దవాఖానల చుట్టూ తిరుగుతున్నరు. గ్రామాల్లో పాలన పడకేసింది. కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే కేసీఆర్ పాలనలో తెలంగాణ పల్లెలు, పట్టణాలకు అవార్డులు వచ్చాయి. నువ్వొచ్చినంక అవార్డులు వచ్చినయా రేవంత్‌రెడ్డి?” అని హరీశ్‌రావు నిలదీశారు.
“రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా విఫలమయ్యారు. మాట్లాడితే పగ, ప్రతీకారం, అక్రమ కేసులు, దాడులతో బయపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు కూడా కనీస రక్షణ లేదు. బాల్కొండలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. దాడి చేస్తామని చెప్పి, ఇంటి మీదికి వచ్చిండ్రంటే ఇది పోలీసు వైఫల్యం కాదా? అంతకుమందు పాడి కౌశిక్‌రెడ్డి ఇంటి మీద దాడి, సిద్దిపేటలో నా క్యాంపు ఆఫీసు మీద దాడి, సిరిసిల్లలో కేటీఆర్ క్యాంపు ఆఫీసు మీద దాడి. ఖమ్మంలో మా కాన్వాయ్ మీద దాడి. పోలీసులు ఏం చేస్తున్నట్టు? ఇది విష సంస్కృతి. రాష్ట్రంలో గన్‌కల్చర్ పెరిగింది. దోపిడీలు, దొంగతనాలు పెరిగినయి” అని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో నిప్పులుచెరిగారు.
‘ఢిల్లీ వేదికగా బనకచర్లపై చంద్రబాబు, రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందాన్ని మొన్న ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. నిన్న ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతి బట్టబయలు చేసింది’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టుపెడుతూ ద్రోహం చేస్తున్న రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హరీశ్‌రావు హెచ్చరించారు.
“కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మధ్య ఉన్న ఫెవికాల్ బంధం ఏమిటి? ఓటుకు నోటు కేసులో పట్టపగలు పట్టుబడిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఆయన్ను ఇప్పటి వరకు అరెస్టు చేయకుండా ఎందుకు కాపాడుతున్నారు? రేవంత్‌రెడ్డి అరెస్టుకు కిషన్‌రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? అని హరీశ్‌రావు నిలదీశారు. మా ఇండ్ల మీద నిఘాలు పెట్టి, ప్రత్యేక బృందాలను పెట్టి బూతద్దంలో చూస్తూ మా వెంట పడుతున్నరు. మా అందరి ఫోన్లు రోజూ ట్యాప్ అవుతున్నాయి. ఈయన రోజూ హరీశ్‌రావుతో మాట్లాడుతున్నడని నిన్న ఢిల్లీలో ఓ విలేకరిని బెదిరించిండు. ఆ విలేకరి రోజూ నాతో మాట్లాడుతున్నడు అని మీకెట్లా తెలిసింది. అయితే నా ఫోన్ ట్యాప్ చేయాలి. లేదంటే ఆ విలేకరి ఫోన్ అయినా ట్యాప్ చేసి ఉండాలి. ట్యాప్ చేస్తేనే కదా తెలిసేది’ అని హారీశ్‌రావు పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డిలో విషం తప్ప విషయం లేదని, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలతో తమను బంధిస్తామనే భ్రమలో ఉన్నారని హరీశ్‌రావు విమర్శించారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే, ఆయనతో మాకేం సంబంధం? రిపోర్టులు తెచ్చిన అంటున్నావు. ఏం చేసుకుంటావు? అని హరీశ్‌రావు నిలదీశారు. తప్పుడు ఆరోపణలతో చిల్లర రాజకీయాలు చేసున్న రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌పై చేసిన ఆరోపణలకు రుజువులు ఉంటే చూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ రెండూ కాకుంటే చిల్లర మాటలు కట్టిపెట్టి న్యాయపరమైన విచారణకు సిద్ధంగా ఉండాలని హరీశ్‌రావు సూచించారు. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా వేధించినా రాష్ట్ర ప్రజల శేయస్సు కోసం వెనక్కి తగ్గే ప్రసక్తి లేనేలేదని స్పష్టంచేశారు.