కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశానికే రోల్‌మాడల్‌గా నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నది. 134 రకాల రోగనిర్ధారణ పరీక్షలను పేద ప్రజలకు ఉచితంగా అందించేందుకు
టీ- డయాగ్నోస్టిక్ సెంటర్లను గత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. నాడు అద్భుతంగా పని చేసిన పల్లె, బస్తీ దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నేడు ప్రజాదరణ కోల్పోతున్నాయి.
– హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): పేదలకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఏం చేస్తున్నట్టు? హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానల పనితీరు దుర్భరంగా ఉన్నా ప్రభుత్వం ఎం దుకు పట్టించుకోవడం లేదు? పల్లె, బస్తీ దవాఖానల్లో ఎందుకు ఓపీ పడిపోయింది?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
పల్లె, బస్తీ దవాఖానలు ప్రారంభించి ప్రజల సుస్తీని బీఆర్ఎస్ ప్రభుత్వం పోగొడితే, వాటికి సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దకుతుందని ఎద్దేవా చేశారు. పట్టణ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన దవాఖానలు కాంగ్రెస్ ప్రభుత్వంలో దికుమొకు లేక మూతబడటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రేటర్ సహా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం 500 బస్తీ దవాఖానలతోపాటు గ్రామాల్లో పల్లె దవాఖానలు ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. 15వ ఆర్థిక సంఘం ప్రశంసలను సైతం మన బస్తీ దవాఖానలు అందుకున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 14 నెలలు గడుస్తున్నా వైద్యారోగ్య శాఖ ఒకసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడం, వైద్యాధికారుల అలసత్వం పేద ప్రజలకు శాపంగా మారిందని హరీశ్‌రావు ఆరోపించారు. పేదలు ప్రైవేటు దవాఖానలకు, డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్లి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. బస్తీ దవాఖానల్లో వైద్య సిబ్బంది ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. కొన్నిచోట్ల వారానికి ఒకసారే వైద్యుడు వస్తుండటంతో ఓపీ గణనీయంగా పడిపోయిందని పేర్కొన్నారు.
ఆదివారం బస్తీ దవాఖానలు సేవలు అందించాల్సి ఉన్నా వైద్య సిబ్బంది రాక దవాఖానలు తాళం వేసి ఉంటున్నాయని విమర్శించారు. టీ-డయాగ్నోస్టిక్ ద్వారా బస్తీ దవాఖానకు వచ్చే రోగులకు టెస్టులు నిర్వహించడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బస్తీ దవాఖానల్లో మందులు కొరత వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బీపీ, డయాబెటిస్, థైరాయిడ్ మందులు సరఫరా కావటం లేదని ఆరోపించారు. సమస్యల వలయంలో బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కొట్టుమిట్టాడుతుంటే, ప్రభుత్వానికి చీమ కుట్టినైట్టెనా లేకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఇప్పటికైనా పల్లె, బస్తీ దవాఖాన, డయాగ్నోస్టిక్స్ సమస్యలను పరిషరించి, పేద ప్రజలకు వైద్యం అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలందించాల్సిన బస్తీ దవాఖానలు మధ్యాహ్నం వరకే మూతబడుతున్నాయి. వైద్యులు సమయానికి రాకపోవడంతో బస్తీ దవాఖానకు వచ్చే రోగులు తిరిగి వెళ్లిపోతున్నారు.
– హరీశ్‌రావు