సిద్దిపేట, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : లాఠీలు, ఇనుప కంచెలు, ఇనుప బూట్లు, అక్రమ కేసులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నమ్ముకున్నాడని, వీటితోనే విద్యార్థులను అణచివేయాలని చూస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘విద్యార్థులను అణచివేస్తామంటే ఉద్యమం మరింత ఉధృతమవుతుంది.. తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరించారు. శనివారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడుతూ గ్రూప్-1 అభ్యర్థులు, నిరుద్యోగుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు పెట్టి, భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని తెగేచిచెప్పారు.
గ్రూప్, 1,2,3,4, ఇతర పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకొని పిల్లలు చదువుతారని దాన్ని కూడా మార్చేసి వికీపిడియా, ఇంటర్నెట్ విషయాలను ప్రామాణికంగా తీసుకోవలంటున్నారని ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. విద్యార్థులు ఏది ప్రామాణికంగా తీసుకోవాలో ప్రభుత్వం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదని, ఇంత అయోమయం నడుమ పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ‘సమీక్ష చేయండి.. విద్యార్థులతో చర్చిచండి..విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం కాదు.. అమానుషంగా విద్యార్థుల మీద దాడి చేయడం కాదు.. ఆ విద్యార్థులను పిలిచి మాట్లాడండి’ అని సూచించారు.
తమ హక్కులు కాపాడాలని, న్యాయం చేయాలని అశోక్‌నగర్‌లో పిల్లలు రోడ్ల మీదికి వస్తే వారిని ఇష్టవచ్చినట్టు లాఠీలతో కొడుతున్నారని, ఇనుప బూట్లతో తొక్కుతున్నారని, రాజ్యంగ స్ఫూర్తిని కాపాడాలని పిల్లలు కోరుతుంటే దొంగలను, టెర్రరిస్టులను కొట్టినట్టు కొడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ‘విద్యార్థుల వీపులు పగిలేలా శరీరం కమిలిపోయేలా కొడుతున్నారు. పొత్తి కడుపులో పిడిగద్దులు గుద్దుతున్నారు. ఆడపిల్లలను అర్ధరాత్రి పోలీస్ జీపులో తీస్కపోయి భయభ్రాంతుకుల గురి చేస్తున్నారు. విద్యార్థుల పట్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తున్నది’ అని మండిపడ్డారు. ఈ వైఖరిని ఖండిస్తున్నట్టు చెప్పారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల అమలులో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. రాహుల్ గాంధీ పొద్దున లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతారని, రాజ్యాంగాన్ని కాపాడాలని దేశమంతా తిరిగి సదస్సులు పెడుతుంటారని, అదే రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్‌రెడ్డి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎస్టీలకు 10 శాతం, ఎస్సీలకు 16 శాతం, బీసీలకు, ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, ఓపెన్ కాంపిటేషన్‌లో వచ్చినదాన్ని కన్సిడర్ చేయకూడదని చెప్పారు. ఓపెన్‌లో ఎవరైనా రావచ్చు అని చెప్పారు. ఓపెన్ కాంపిటీషన్ అయ్యాక మిగతా 50 శాతంలో రాజ్యంగం ఇచ్చిన రిజర్వేషన్‌ను అమలు చేసే పద్ధతిని కేసీఆర్ జీవో 55 ఆధారంగా పదేండ్లు అమలు చేశారని గుర్తుచేశారు. ఇవ్వాళ ఎందుకు జీవో 55ని రద్దు చేసి జీవో 29ని తెచ్చారని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలకు అన్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ వర్గం నుంచి ఉండి కనీసం స్పందించడం లేదని, గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఈ విషయంపై భట్టిని అడిగామని చెప్పారు.దానికి ఆయన పరిశీలిస్తానని చెప్పారని, ఇప్పటికీ పట్టించుకోవడం లేదని తెలిపారు. దళిత, గిరిజన, బలహీన, మైనార్టీ వర్గాల శాసనసభ్యులు, మంత్రులు సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీయాలని హరీశ్ పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగం వల్లే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినయ్.
ఇవ్వాళ మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలవడానికి అవకాశం ఇచ్చింది. ఆయా వర్గాల హక్కులను కాపాడే బాధ్యత మీపై ఉన్నది. దయచేసి స్పందించండి’ అని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎమ్మెల్యేలను కోరారు. దేశంలో అతిపెద్ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని,గతంలో జీవో 55 ఎట్లయితే అమలు చేసామో యూపీఎస్సీలోనూ అదే తరహా రిజర్వేషన్ అమలువుతున్నదని చెప్పారు.
అందులో రిజర్వేషన్ ఎట్ల అమలవుతది? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎందుకు కాదు? అని ప్రశ్నించారు. యూపీఎస్సీలో మొదటి 50 శాతం ఓపెన్ కాంపిటీషన్‌గా తర్వాత 50 శాతం రిజర్వ్ క్యాటరిరీ చేస్తున్నారని, అదే మోడల్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం జీవో 55 రూపంలో అమలు చేసిందని గుర్తుచేశారు. ఓపెన్ కాంపిటీషన్ లేదా అన్ రిజర్వ్డు క్యాటగిరీలో ఎస్సీ , ఎస్టీ , బీసీ మైనార్టీ, ఈ డబ్య్లూఎస్లకు ప్రవేశం లేనట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా జీవో 29ని తెచ్చిందని మండిపడ్డారు.
పిల్లల శరీరాలు కమిలిపోయేలా కొడుతుంటే రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని హరీశ్ ప్రశ్నించారు. ‘నిరుద్యోగ యువతను కర్కశంగా అణచివేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే దళిత బలహీన వర్గాల మంత్రులు కనీసం స్పందించరా? రేవంత్‌రెడ్డిని ప్రశ్నించరా? పిల్లల పక్షాన మీరు నిలబడరా? కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం లేదా? అని ప్రశ్నించారు. దీనిపై రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ఓట్ల కోసం గల్లీగల్లీలో తిరిగిన రాహుల్‌గాంధీ గడ్డకు ఎక్కిన తర్వాత ఎందుకు తెలంగాణవైపు చూడడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారని, వాటిలో ఒక్కటైనా అమలు చేశారా? అని హరీశ్ ప్రశ్నించారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 1:50కి బదులు, 1:100 అవకాశం ఇస్తామని ఆరోజు మాట్లాడి ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 నెలలు గడిచిందని, ఇంకా నెల పది రోజల సమయమే ఉన్నదని, ఈ లోగా రెండు లక్షల ఉద్యోగాలు నింపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు రేవంత్‌రెడ్డి ఇచ్చినట్టు చెప్పుకొంటున్నారని మండిపడ్డారు.
‘నిరుద్యోగులఎజెండానే నా ఎజెండా అంటివి.. కోదండరాం.. మీ గొంతుకు ఎందుకు మూగబోయింది? ఎందుకు మాట్లాడుతలేవు?’ అని హరీశ్ నిలదీశారు. కోదండరాం, రియాజ్, చింతపండు నవీన్, ఆకునూరి మురళి వీరికి ఉగ్యోగాలు వచ్చాయి తప్ప నిరుద్యోగ యువతకు రాలేదని, నిరుద్యోగులను మోసం చేసి ఉద్యోగాలు పొందిన వీళ్లంతా ఇప్పుడు ఒక్క మాట మాట్లాడడం లేదని మండిపడ్డారు. ‘ఆరోజు వీరే కదా చెప్పింది.. మీ గొంతుక అవుతాం, మీ సమస్యలు పరిష్కరిస్తామని.. మీరంతా ఇప్పడు అశోక్‌నగర్‌కు వెళ్లండి..ఆరోజు అశోక్‌నగర్ గల్లీగల్లీలో తిరిగారు. ప్రతి కోచింగ్ సెంటర్‌కు తిరిగితిరి కదా? ఇప్పుడెందుకు వెళ్లడం లేదు?’ అని ప్రశ్నించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, రాష్ట్ర నాయకులు వేలేటి రాధాకృష్ణ శర్మ, కడవేర్గు రాజనర్సు, పాల సాయిరాం, మెర్గు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆర్తనాదాలతో అశోక్‌నగర్ మర్మోగుతున్నా కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో చలనం లేదు. విద్యార్థులేమైనా హంతకులా? టెర్రరిస్టులా? నక్సలైట్లా? వాళ్లు ఏం తప్పుచేసిండ్రని గొడ్లను కొట్టినట్టు కొడుతున్నరు? ఒక్కపూట అన్నం తిన్నా తినకున్నా ఉద్యోగం సంపాదించాలని రాత్రింబవళ్లు కష్టపడి చదువుకునే విద్యార్థులను లాఠీలతో కొట్టి ఇనుపబూట్లతో తొక్కుతున్నరు. ఆడపిల్లలని కూడా చూడకుండా అర్ధరాత్రి పోలీస్ జీపులో తీస్కపోయి భయపెడుతున్నరు.
-హరీశ్‌రావు
ఎన్నికలప్పుడు, ఓట్లప్పుడు పోవుడు కాదు, రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా అశోక్‌నగర్ వెళ్లు. సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులతో కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కరించు. ఎన్నికలప్పుడు పోతవు.. విద్యార్థులను రెచ్చగొడుతవ్.. మా మీద బురద జల్లుతవ్.. యువతను వాడుకుంటవ్, ఇవ్వాళ గద్దెనెక్కగానే వాళ్లను వదిలేస్తావా?
-హరీశ్‌రావు
రాష్ర్టానికి పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ జీవో 55 ఆధారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలు చేసిండ్రు. రేవంత్‌రెడ్డి వచ్చాక జీవో 55ను రద్దు చేసి కొత్తగా జీవో 29ని తెచ్చిండ్రు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మీరు చెప్పేది ఒకటి చేసేది మరోటా?
-హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం మరోసారి బయటపడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. గ్రూప్-1 మెయిన్ అభ్యర్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్ సహా ఇతర నాయకులను అరెస్టు చేశారని, బండి సంజయ్, బీజేపీ నేతలకు మాత్రం నిరసన తెలిపే అవకాశం కల్పించారని, దీనిద్వారా ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం మరోసారి తేటతెల్లమైందని హరీశ్ విమర్శించారు. బీజేపీకి ఒక న్యాయం.. బీఆర్ఎస్కు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. గంటల తరబడి నిరసన తెలిపినా బండి అండ్ కోను అడ్డుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలను మాత్రం అరెస్టు చేసిందని మండిపడ్డారు. నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా జీవో 29ని రద్దు చేసి, గ్రూప్స్ మెయిన్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.