హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు శాసనసభ, శాసనమండలిలో ఆ పార్టీ పక్ష డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లను ఆదేశించారు. అంశాలవారీగా లోతుగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్, అలసత్వంపై ఆధారాలతో నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. శాసనసభలో, మండలిలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లుగా తమకు అవకాశం కల్పించిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మండలిలో పార్టీ విప్‌గా అవకాశమిచ్చినందుకు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నదీ జలాలు, ఉద్యోగ నియామకాలు, సాంస్కృతిక కార్యక్రమాల వంటి అంశాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను శాసనమండలిలో బయటపెట్టాలని సూచించారు. అంతకుముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.

Kcr