పల్నాడు గ్రిడ్‌పై మౌనమెందుకు రేవంత్?
‘నాగార్జునసాగర్ కుడివైపున ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పల్నాడు వాటర్‌గ్రిడ్‌పై మౌనమెందుకు? ఈ అక్రమ ప్రాజెక్టుకు మూడున్నర నెలల కిందట (04.08. 26) ఆంధ్రా సర్కార్ ఉత్తర్వులు..
- ఏడాదిగా పనులు జరుగుతుంటే ఏంచేస్తున్నరు?
- ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోలేదు ఎందుకు?
- సాగర్ జలాలు తరలిస్తుంటే సర్కారేం చేస్తున్నది?
- మంచినీళ్లకు రోజుకూ 2 టీఎంసీలు ఎందుకు?
- నల్లగొండ నీళ్ల మంత్రి ఉత్తమ్ నిద్రపోయారా?
- కోమటిరెడ్డి వ్యాఖ్యలతో సర్కార్ తప్పిదం తేటతెల్లం
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘నాగార్జునసాగర్ కుడివైపున ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న పల్నాడు వాటర్‌గ్రిడ్‌పై మౌనమెందుకు? ఈ అక్రమ ప్రాజెక్టుకు మూడున్నర నెలల కిందట (04.08. 26) ఆంధ్రా సర్కార్ ఉత్తర్వులు జారీచేసిన విషయం మీకు తెలియదా? తెలిసినా తెలియనట్టు నటించారా? ఉత్తర్వులు రాకముందు ఏడాది నుంచి సర్వే, మొబిలైజేషన్ పనులు జరుగుతుంటే మీ ప్రభుత్వం మొద్దునిద్ర పోతుందా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
సాగర్‌కు పొక్కబెట్టి రోజూ 2 టీఎంసీల నీరు తరలించే కుట్రలు చేస్తున్నా నీళ్ల మంత్రి ఉత్తమ్‌రెడ్డి ఏం చేస్తున్నారు? నిలువరించకుండా నిద్రపోతున్నారా? నీకు తెలియకుండానే జీవో వచ్చిందా? తెలంగాణ నీళ్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంటే అడ్డుకోకుండా చోద్యంచూస్తున్నారెందుకు? మీరనేది ఎనిమిది, తొమ్మిది టీఎంసీలు తీసుకుపోయేదే నిజమైతే రెండు టీఎంసీల వ్యాసంతో టన్నెల్ ఎందుకు తవ్వుతున్నారు? అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సాగర్ పక్కన ఏపీ కడుతున్న పల్నాడు వాటర్‌గ్రిడ్ వెనుక భారీ కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. నాటి నుంచి తెలంగాణకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ పాపానికి ఒడిగట్టిందని మండిపడ్డారు.
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో బయటపడ్డ డొల్లతనం
పల్నాడు వాటర్‌గ్రిడ్‌పై తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఈఈ, ఈసీని బాగా తిట్టానని, ఆంధ్రాకు చెందిన వ్యక్తివైనందుకే తమకు చెప్పలేదా? అని విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో సర్కార్ డొల్లతనం బట్టబయలైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రభుత్వ తప్పిదాన్ని అంగీకరించడమేనని తేల్చిచెప్పారు. ప్రభుత్వ తప్పిదాన్ని ఒప్పుకొని మంత్రి లెంపలేసుకొన్నారని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైందని దెప్పిపొడిచారు. ‘మంచినీళ్ల పేరిట ఏపీ సర్కార్ రోజూ రెండు టీఎంసీల చొప్పున రెండు నెలల్లో 120 టీఎంసీలు తరలిస్తే తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది? రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోతే సాగర్ ఖాళీ అయిపోయి నల్లగొండ జిల్లాకు తాగు, సాగునీరు దొరకదు. హైదరాబాద్ ప్రజలు వలసపోయే పరిస్థితి వస్తద’ అని ఆందోళన వ్యక్తంచేశారు.
ఉత్తమ్ మొద్దునిద్ర!
‘ఉత్తమ్‌రెడ్డి! మూడున్నర నెలల నుంచి ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే ఏం చేసివన్? నీ నల్లగొండకు రావాల్సిన సాగు, తాగునీరు ఏపీ దోచుకుంటుంటే ఎందుకు మొద్దునిద్ర నటిస్తున్నవ్? ఏపీతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారెందుకు? మీ కుర్చీలు, అధికారాన్ని కాపాడేందుకు చంద్రబాబుకు దాసోహమైపోతారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఏపీ కడుతున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఆనాడు బీఆర్ఎస్ పోరాడి నిద్రలేపిన తర్వాతే మంత్రి ఉత్తమ్ బ్యాక్‌డేట్‌తో ఉత్తరాలు రాసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నేడు సాగర్ నుంచి ఏపీ రెండు టీఎంసీలు తరలించేందుకు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్, కొన్ని పత్రికలు బయటపెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహనలేని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సైతం నోటికొచ్చినట్టు మాట్లాడడం దురదృష్టకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పుస్తకాలు ముద్రించిన వారికి బిల్లులివ్వరా?
‘మూసీ సుందరీకరణకు, అందాల పోటీలకు, ఫుట్‌బాల్ షోకులకు, ఇతర ఆర్భాట కార్యక్రమాలకు ఖర్చు చేసేందుకు నిధులు ఉంటాయి. కానీ, పేద విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను ముద్రించిన వారికి బిల్లులు చెల్లించేందుకు డబ్బులు ఉండవా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. ప్రభుత్వ అవసరాల కోసం పుస్తకాలను ముద్రించి సరఫరా చేసిన చిన్న పరిశ్రమలు తమ బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను సకాలంలో ముద్రించి అందిస్తున్న 56 మంది వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్లకు సుమారు రూ.76 కోట్ల బిల్లులు మూడేండ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో హరీశ్‌రావును గురువారం తెలంగాణ వెబ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి తమ గోడును వినిపించారు. ఈ మేరకు ఆయన స్పందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

