హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తేతెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ)కు విశేష స్పందన కనిపించింది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఇచ్చిన ఈ పీపీటీకి రాష్ట్ర వ్యాప్తంగా ఊరూ వాడా తేడాలేకుండా సబ్బండవర్గాలు టీవీలకు అతుక్కుపోయారు. ముఖ్యంగా రైతులు ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు. ఘోష్ కమిషన్ నివేదిక పేరిట కాంగ్రెస్ కట్టుకథల లోగుట్టును గణాంకాలు, ఆధారాలతో సహా ఎండగడుతుంటే ఆసక్తిగా తిలకించారు. విదేశాల్లోని ప్రవాసీ తెలంగాణవాసులు సైతం విలువైన సమయాన్ని కేటాయించి లైవ్ టెలికాస్ట్‌ను వీక్షించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో ఎల్ఈడీ స్క్రీన్ల పై పీపీటీ లైవ్‌ను ఏర్పాటుచేశారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కాళేశ్వరం ముసుగులో కేసీఆర్‌ను బద్నాం చే స్తున్న తీరు, కాళేశ్వరంతో కలిగే ప్రయోజనాలను హరీశ్‌రావు వివరిస్తుంటే అమితాసక్తితో వీక్షించారు. కాంగ్రెస్ కుట్రలు, బనకచర్ల రూపంలో జరుగుతున్న నష్టాన్ని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తంచేశారు.
హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సమయంలో పలుచోట్ల కరెం ట్ కోతల కుట్రలు చోటుచేసుకున్నాయి. దీంతో ఆయా చోట్ల ప్రత్యక్ష ప్రసారాలు నిలిచిపోయాయి. పీపీటీకీ వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకే సర్కార్ కరెంట్ సరఫరాను నిలిపివేసిందని బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వాస్తవాలు ప్రజలు తెలియకూడదనే కుట్రతోనే అవాంతరాలు కల్పించిందని ఆరోపించారు. జగిత్యాల బీఆర్ఎస్ భవన్లో లైవ్ టెలికాస్ట్ సమయంలో కరెంట్ పోవడంతో సెల్ఫోన్లలోనే తిలకించారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే విద్యుత్తు సరఫరాను నిలిపివేసిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజెంటేషన్ చూడొద్దనే ఈ కుట్రకు దిగిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ దమననీతిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ విగ్రహం వద్ద జగిత్యాల-కరీంనగర్ రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ చిల్లర చర్యలు మానుకోవాలని హితవు పలికారు. కరెంట్ బంద్ చేస్తే వాస్తవాలు కనుమరుగైపోతాయా? అని ప్రశ్నించారు.
కాళేశ్వరంపై హరీశ్‌రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు విదేశాల్లోనూ స్పందన కనిపించింది. ప్రవాసీ తెలంగాణవాసులు లైవ్ టెలికాస్ట్‌ను ఆసక్తిగా తిలకించారు. లండన్‌లోని బీఆర్ఎస్ యూకే కేంద్ర కార్యాలయంలోనూ ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అక్కడి బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. కమిషన్ల పేరిట కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు హరిగౌడ్ ఆరోపించారు. ఎన్నారైలకు కాళేశ్వరంపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాలో విస్త్రత ప్రచా రం చేస్తామని సోషల్ మీడియా కన్వీనర్ రవిప్రదీప్ చెప్పారు.