60 ఏండ్లల్లో పాలమూరుకు కాంగ్రెస్ నీళ్లిచ్చింది లక్ష ఎకరాలకే. కానీ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి పదేండ్లలోనే కేసీఆర్ ప్రభుత్వం 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. మైనర్ ఇరిగేషన్ కలిపి 10 లక్షల ఎకరాల మాగాణిగా పాలమూరును మార్చింది. చివరికి ఏడేండ్లలో ఎస్ఎల్బీసీలో 11.5 కిలోమీటర్ల టన్నెల్ మేం తవ్వితే.. రెండేండ్లలో కాంగ్రెస్ తవ్వింది 18 మీటర్లు మాత్రమే.అదీ కేసీఆర్ నిబద్ధత.. మీ నిష్ప్రయోజకత్వం!
పాలమూరుకు ఒకవైపు 90 టీఎంసీల నీటి కేటాయింపులకు ప్రయత్నం చేస్తూనే 170 టీఎంసీలు వాడాలనే వ్యూహంతో కేసీఆర్ పనిచేసిండు. అనేక ప్రయత్నాలు చేసి ఏడు అనుమతులు తీసుకొచ్చిండు. రేవంత్‌రెడ్డీ.. నువ్వు తెలివి తక్కువోనివై మిగిలిన మూడు అనుమతులు తీసుకురాలేకపోయినవ్. నీ చేతగానితనం వల్లే కేంద్రం డీపీఆర్‌ను కూడా వెనక్కి పంపింది. 90 టీఎంసీలను 45 టీఎంసీలకు తగ్గించుకున్న మూర్ఖునివి నువ్వు. -హరీశ్
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మరణశాసనం రాసింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని, నాటి నుంచి నేటి వరకు తీరని ద్రోహం చేసిన ఆ పార్టీయే తెలంగాణకు నంబర్ వన్ విలన్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి పిట్టకథలు, మంత్రి ఉత్తమ్ కుమార్ కట్టుకథలు చెప్పి సభను తప్పుదోవపట్టించారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని, చేసిన తప్పులను సరిదిద్ది తెలంగాణ నీటిహక్కులను కాపాడింది కేసీఆరేనని స్పష్టంచేశారు. పదేండ్ల పాలనలో కాళేశ్వరం, పాలమూరులాంటి బృహత్తరమైన ప్రాజెక్టులను నిర్మించిన ఘన చరిత్ర బీఆర్ఎస్ సర్కార్ సొంతమని గుర్తుచేశారు.
ఆదివారం తెలంగాణ భవన్లో ‘నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు’ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన జలద్రోహాలు, ప్రస్తుత రేవంత్ సర్కారు కొనసాగిస్తున్న మోసాల పరంపరను ఎండగట్టారు. తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపి మోసాల పరంపరకు శ్రీకారం చుట్టిందని, 174 టీఎంసీల నీటి వినియోగ లక్ష్యంగా అప్పర్ కృష్ణ, తుంగభద్ర ఎడమకాలువ, భీమా ప్రాజెక్టులను రద్దు చేయవద్దని ఫజల్అలీ కమిషన్ చేసిన సిఫారసులను తుంగలో తొక్కి ఆ ప్రాజెక్టులను రద్దుచేసిందని తెలంగాణకు అన్యాయం చేసిందని నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిలో 79 శాతం తెలంగాణకు పరీవాహక ప్రాంతం ఉంటే దక్కింది 15 శాతమని, కృష్ణాలో 69కి దక్కింది 34 శాతమేనని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో సెక్షన్ 84 పెట్టి నీటివాటాల పంపకంలో అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరంపై కక్ష..పాలమూరుపై పగ
రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో తెలంగాణకు మరింత అన్యాయం జరిగిందని హరీశ్ ఫైర్ అయ్యారు. గద్దెనెక్కిన 40 రోజుల్లోనే కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించి, బనకచర్లకు లోపకాయికారి ఒప్పందం చేసుకున్న నీచపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. కాళేశ్వరంపై కక్ష గట్టిన్రు..పాలమూరుపై పగ బట్టిన్రు అంటూ నిప్పులు చెరిగారు. రెండేండ్లలో పాలమూరు ప్యాకేజీ-3లోని బుడ్డ కాలువను పూర్తిచేస్తే 50 టీఎంసీల నీరు నిలుపుకొనే అకాశమున్నా కేసీఆర్‌పై కుట్రతో విస్మరించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ‘రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటికే కట్టిన నిజాంసాగర్, డిండి లాంటి మైనర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద 16.03 లక్షల ఎకరాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 20 లక్షల ఎకరాలు నాడు మొత్తంగా వచ్చింది 36 లక్షల ఎకరాలు, 1956 నుంచి 2004 వరకు 60 ఏండ్లలో వచ్చిన ఆయకట్టు 36 లక్షల ఎకరాలు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో 5.71 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు.. స్థిరీకరణ 93 వేల ఎకరాలు, మొత్తంగా 6.64 లక్షల ఎకరాలు. కానీ బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో కరోనా సంక్షోభం, పెద్దనోట్ల రద్దుతో ఆర్థికమాంద్యం నెలకొన్నా, కొత్త రాష్ట్రమైనా స్థిరీకరించిన ఆయకట్టు 31.50 లక్షల ఎకరాలు. 17.24 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు.. మొత్తంగా 48.74 లక్షల ఎకరాల ఆయకట్టు సాధించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కింది’ అని తేల్చిచెప్పారు. ‘కాంగ్రెస్ పదేండ్లు 5.71 లక్షల కొత్త ఆయకట్టు..బీఆర్ఎస్ 17.24 లక్షల కొత్త ఆయకట్టు..కాంగ్రెస్ కొత్తగా తెచ్చిన ఆయకట్టు ఏడాదికి 57 వేల ఎకరాలు.. బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి 1,81,473 ఎకరాలు’ అని స్పష్టంచేశారు. ఈ గణంకాలే కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనకు తేడాలను అని తేల్చిచెప్పారు.
హరీశ్‌కు అభినందనల వెల్లువ
హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు పీపీటీ నిర్వహించిన తర్వాత ఆయనకు నేతలు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌కు గట్టి జవాబిచ్చారని ప్రశంసించారు. పక్కా ఆధారాలు, గణాంకాలతో ఆకట్టుకునేలా పీపీటీ ఇచ్చారని మెచ్చుకున్నారు. హరీశ్‌ను అభినందినవారిలో రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేశ్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, తలసాని, బీఆర్ఎస్ విప్‌లు వివేకానంద, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, గంగుల, లక్ష్మారెడ్డి, సీనియర్ నేతలు ఉన్నారు.
విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో ఆంధ్రా ప్రాజెక్టులు హంద్రీనీవా, తెలుగు గంగ, వెలిగొండ, పెన్‌గంగను చేర్చి.. తెలంగాణవి కల్వకుర్తి, నెట్టెం పాడును మాత్రమే చేర్చి పాలమూరు, డిండి ప్రాజెక్టులను కాంగ్రెస్ విస్మరించింది నిజం కాదా? ప్రాజెక్టులను 11వ షెడ్యూల్లో చేర్చకపోవడం, నీటి పంపకాలను సెక్షన్ 3లో పెట్టకపోవడం రక్షణ కల్పించడమా? 11వ షెడ్యూల్లో చేర్చి ఉంటే ఏనాడో అనుమతులు వచ్చేవి.. ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి.
-హరీశ్‌రావు
రాష్ర్టాన్ని బలవంతంగా కలిపింది కాంగ్రెస్.. మన విద్యార్థులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెస్.. 369 మంది తెలంగాణ బిడ్డలను కాల్చిచంపింది కాంగ్రెస్.. ప్రాజెక్టులను రద్దుచేసింది..చివరికి రాష్ట్ర విభజనలో అన్యాయం చేసింది కాంగ్రెస్.. నాడైనా నేడైనా తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్సేనని కేసీఆర్ చెప్తున్న మాటలు అక్షరసత్యం.
-హరీశ్‌రావు