‘రేవంత్‌రెడ్డికి రైతులు, ప్రజలంటే పట్టింపు లేదు. రుణమాఫీ మీద తొలి సంతకం అన్నడు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట్లాడిండు. అంతా మోసమే. రైతుబంధు, రుణమాఫీ, పింఛన్లు, మహాలక్ష్మి అన్నీ చేస్తానన్నడు. ఇప్పుడు సప్పుడు లేదు. దసరాలోపు రైతులందరికీ 2 లక్షల వరకు షరతుల్లేకుండా రుణమాఫీ చేయకుంటే, ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తం. వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతేందని నిలదీస్తం.
– తొర్రూరు ధర్నాలో హరీశ్‌రావు
రైతుల కన్నీళ్లు చూస్తే రాతి గుండెలు కూడా కరుగుతాయి. కానీ, రేవంత్‌రెడ్డి గుండె మాత్రం కరగడం లేదు. రేవంత్‌ది రాతిగుండె కాబట్టే రైతుబంధు ఇవ్వడం లేదు. రుణమాఫీ చేయడం లేదు. రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా?
-హరీశ్‌రావు
మహబూబాబాద్, అక్టోబర్4(నమస్తే తెలంగాణ): దసరాలోపు రైతులందరికీ రూ.2 లక్షల వరకు షరతులు లేకుండా రుణమాఫీ చేయకుంటే, ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామని, వరంగల్ రైతు డిక్లరేషన్‌పై నిలదీస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30% మంది రైతులకే రుణమాఫీ అయిందని, మిగిలిన 70% మందికి మాఫీ చేసే దాకా వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. పండుగ తరువాత కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో షరతులు లేకుండా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. రుణమాఫీకి 31 సాకులు పెట్టి లక్షలాది రైతులకు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పాలకుర్తి మండలంలోనే 4,314 మందికి రుణమాఫీ కాలేదని చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నట్టుగా 22 లక్షల మందికి కూడా మాఫీ కాలేదని దుయ్యబట్టారు. ‘రుణమాఫీ కాలేదు అంటే, పెండ్లి కాలేదు అంటున్నరట, కొందరికి ఆధార్‌కార్డు లేక ఆపుతున్నరు. ఇదేమి రాజ్యం?’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. రేవంత్ మోసగాడని రైతులు, ప్రజలు అంటున్నారనిచెప్పారు. కర్ణాటకలో ఐదు, తెలంగాణలో ఆరు, ఇప్పుడు హర్యానాలో 7 గ్యారెంటీలు అంటున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ అమలుకావడం లేదని దుయ్యబట్టారు.
‘రైతులతోపాటు కౌలురైతులకు ఏడాదికి ఎకరాకు రూ.15 వేలు ఇస్తా అన్నడు. కాలేదు.. భూమి లేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అన్నడు.. కాలేదు.. రైతు కూలీలు, భూమి లేని రైతులకు పంట బీమా పథకం అన్నడు. కాలేదు.. పోడు, అసైన్డ్ భూములకు యాజమాన్య హకులు ఇస్తా అన్నడు. కాలేదు.. అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ అని చెప్పి, ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొకులు నొకుతున్నడు’ అని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి దయ వల్ల రాహుల్‌గాంధీ మీద తెలంగాణ ప్రజలకు, రైతులకు నమ్మకం లేకుండా పోతున్నదని ఎద్దేవా చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు.
వానకాలం సీజన్ ముగుస్తున్నా రైతుబంధు ఇవ్వలేదని, ఇంకెప్పుడు ఇస్తరని హరీశ్‌రావు ప్రశ్నించారు. దసరాలోపు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆపి, రైతులకు రైతుబంధు కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్‌ది రైతు గుండె కాబట్టి ఇచ్చారని, రేవంత్‌ది రాతిగుండె కాబట్టే ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అన్ని పంటలకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నాలకు మాత్రమే ఇస్తామంటున్నారని మండిపడ్డారు.
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ కాలేదన్న మనోవ్యథతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో తరావత్ రవి అనే రైతు, సిద్దిపేట జిల్లాలో సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులెవరూ ఆధైర్య పడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, రేవంత్‌రెడ్డి మెడలు వంచి రుణమాఫీ అమలు చేయిస్తామని చెప్పారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులను నిలదీయాలని రైతులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీని ఆనుకొని ఉన్న పేదల ఇండ్లు కూలగొడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎకువ కాలం గుండాగిరి నిలబడదని హితవు చెప్పారు. ‘అది కొడతా, ఇది కొడతా అంటున్నవ్. అన్యాయంగా ఉన్న ప్రతి ఒకరిదీ కూలగొట్టు.. దగ్గర ఉండి సహకారం అందిస్తాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజలపక్షం’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు బాగాలేవని విమర్శించిన రేవంత్‌రెడ్డి బతుకమ్మ చీరలు లేదా వాటి బదులు ఇస్తానన్న రూ.500 మహిళలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇస్తామన్న రూ.పదివేల ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో తన మీద 300 కేసులు పెట్టారని, ఇప్పటికే 30 పెట్టారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా హామీల అమలుపై ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో ఎందుకు చేరారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలు వస్తాయని స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్యను గెలిపించుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సీఎం సీటు రాగనే పెద్దోడిని అవుతున్నా అనుకుంటున్నవు.. ప్రజలను మోసం చేస్తున్న నిన్ను ఆరు నెలల్లో గద్దె దింపుడు ఖాయం. సోనియగాంధీ పుట్టిన రోజున రుణమాఫీ చేస్తామని బ్రోకర్ మాటలు చెప్పి కుర్చీల కూర్చున్నవ్. రైతులను మోసం చేసిన నువ్వు జాగ్రత్తగ ఉండాలె.. తమాషా అనుకుంటున్నవా? రైతుబంధు పోయింది. రుణమాఫీ పోయింది. రైతుబంధు 15 వేలు అన్నవు. మోసం చేసినవు. మూడు కేజీలు ఉన్న రేవంత్‌రెడ్డి రైతులను మోసం చేసిండు. ఇది రాక్షస పాలన. ఎవరైనా ఏమైనా అంటే జైల్లో పెడుతుండ్రు. ఇటువంటి పాలన నా 70 ఏండ్లలో చూడలేదు. కేసీఆర్ కిట్టు మాయమైంది. తులం బంగారం ఇవ్వకపోతివి. కేసీఆర్ పాలనలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ సార్‌ను ఓడించి మేము చేసుకున్న తప్పిదం. మల్ల కేసీఆర్ రావాలి. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో పడేయాలి.
– గుగులోత్ జింతు, రైతు, రాంధన్ తండా