మెదక్: క్రిస్మస్ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రతి క్రిస్మస్కు పేద క్రిస్టియన్లకు గిఫ్ట్ ఇచ్చారని చెప్పారు. గత తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులకు కేసీఆర్ ఏం చేశారు? ఎంత బాగా చూసుకున్నారో అందరికీ తెలుసన్నారు. మెదక్ చర్చి వందేండ్ల వేడుకల్లో హరీశ్ రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మెదక్ చర్చి వందేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతీ ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వందేండ్లుగా ఆసియాలోనే రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా మెదక్ చర్చి వర్ధిల్లుతున్నదని చెప్పారు.
కల్లోల జగతికి శాంతి సందేశం అందించిన కరుణామయుడి గొప్ప ప్రార్థనా మందిరంగా ప్రఖ్యాతి గాంచిందన్నారు. చర్చి నిర్మాణాన్ని ఇంగ్లాండ్కు చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ 1914లో ప్రారంభించారని, 1924 డిసెంబర్ 25న పూర్తయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి మనువడు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 1914లో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు ఉండేది. ప్రజలు ఆకలితో అలమటించేవారు. చార్లెస్ వాకర్ ఫాస్నెట్ కరువుతో అల్లాడుతన్న ప్రజలను చూసి చలించారు. ఉచితంగా కాకుండా ప్రజలకు పని చూపి, వారి ఆకలి తీర్చాలని సంకల్పించారు. అలా వారిచేత ఏసుక్రీస్తు మందిరం నిర్మిస్తూ, వారి ఆకలిని తీర్చారు. చారిత్రాకమైన ఈ చర్చి మెదక్ జిల్లాలో ఉండటం మనకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.
కేసీఆర్ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. గత తొమ్మిదన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులకు కేసీఆర్ గారు ఏం చేశారు? ఎంత బాగా చూసుకున్నారో అందరికీ తెలుసు. క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి, ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ను అధికారికంగా జరిపిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. క్రిస్మస్ డే మరుసటి రోజు జరుపుకునే బాక్సింగ్ డేను సెలవుగా ప్రకటించారు. అంటే డిసెంబర్ 25తో పాటు 26న కూడా ఘనంగా పండుగ జరుపుకునేలా రెండు రోజులు సెలువు ఇచ్చారు. ప్రతి క్రిస్మస్ పండుగ నాడు పేద క్రిస్టియన్లకు గిఫ్ట్ ఇచ్చారు. కేసీఆర్.. ఒక్క మతమని కాదు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఇలా అన్ని మతాలను సమానంగా గౌరవించి, వారు సంతోషంగా జీవించేలా చూశారు. అన్ని వర్గాలు బాగున్నాయి కాబట్టే హైదరాబాద్, తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వం అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఇది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళి ఆచరణీయం. ప్రజలందరికి సుఖ శాంతుల కలగాలని ఆ యేసును ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి క్రిస్టియన్ సోదర సోదరీమణులకు శుభాంక్షలు తెలుపుతున్నాను.’ అని హరీశ్ రావు అన్నారు.
Live: Former Minister, MLA @BRSHarish speaking at the Centenary Celebrations of Medak Church. https://t.co/duHGKTRlAh
— Office of Harish Rao (@HarishRaoOffice) December 23, 2024