హైదరాబాద్ మే 20 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొడితిరి.. అధికారంలోకి రాగానే మంత్రి సీతక్క చేత మొదటి సంతకం పెట్టిస్తిరి.. కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాదిన్నర దాటినా పెంచిన జీతాలు ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ మొదటికి తెస్తిరి.. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆడబిడ్డల కడపు కొట్టకుండా పెంచిన వేతనాలు ఇవ్వండి..’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలను ఏకరువు పెడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మంత్రి పెట్టిన మొదటి సంతకమే మరిచిపోతే ఎట్లా అని నిలదీశారు. మూడు నెలలు పెంచిన వేతనం రూ. 13,650 చొప్పున చెల్లించి మళ్లీ రూ. 7,800కి తగ్గించడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు పెంచిన వేతనాలను తగ్గించే కొత్త సంప్రదాయానికి తెరలేపిందని ఎద్దేవా చేశారు. మినీ అంగన్వాడీలను అప్‌గ్రేడ్ చేస్తూ ఇచ్చిన జీవోనూ విస్మరించి మళ్లీ కొత్త జీవో జారీ చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. 8 జిల్లాల వారికే పెరిగిన వేతనాలు అందాయని, మిగిలినవారు ఎదురుచూస్తున్నారని చెప్పారు. అంగన్వాడీ టీచర్లు ప్రచార సాధనాలు కాదని.. వారికి ఆత్మగౌరవం కావాలని ఉద్ఘాటించారు. ‘మంత్రి మొదటి సంతకం చేసిన జనవరి 2024 నాటి నుంచి పెరిగిన వేతనాలు ఇవ్వాలి.. వెంటనే హెల్పర్లను నియమించాలి’ అని డిమాండ్ చేశారు.
మారుమూల పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లను అప్‌గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ సర్కారు 2023, సెప్టెంబర్ 5న జీవో ఇచ్చిందని, ఎన్నికల కోడ్ కారణంగా అమల్లోకి రాలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఈ జీవోను కాపీ కొట్టి కొత్త జీవో ఇచ్చిందన్నారు. మూడు నెలలు పెరిగిన వేతనాలిచ్చి మళ్లీ పాత వేతనాలే ఇస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పెంచిన జీతాలను తగ్గించే కొత్త విధానానికి తెరలేపిందని ప్రస్తావించారు. రైజింగ్ అని చెబుతున్న ముఖ్యమంత్రి అంగన్వాడీల జీతాలు తగ్గించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మినీ అంగన్వాడీలు పెండింగ్ వేతనాల కోసం మంత్రిని కలిసినా పట్టించుకోకపోవడం బాధాకరమని వాపోయారు. ప్రచార ఆర్భాటం కోసం ఒకే సమస్యపై రెండుసార్లు ఉత్తర్వులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఖరితో మినీ అంగన్వాడీ టీచర్లు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా పెంచిన వేతనాలపై స్పష్టత ఇవ్వాలని, అన్ని జిల్లాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి మోసం చేసిందని హరీశ్‌రావు లేఖలో మండిపడ్డారు. ‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం.. ఆడబిడ్డ పెండ్లిళ్లకు తులం బంగారం ఇస్తాం.. యువతులకు స్కూటర్లు అందిస్తాం.. అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు రూ. 18,000 వేతనాలు ఇస్తాం.. మినీ అంగన్వాడీలకు పెరిగిన వేతనాలిస్తాం’ అని మోసం చేసిందని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా మినీ అంగన్వాడీలకు పెరిగిన వేతనాలు ఇవ్వాలని, ప్రతి సెంటర్లో హెల్పర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.