హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతి బాగోతంపై సమగ్ర విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) చైర్మన్‌కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గురువారం లేఖ రాశారు. కాంగ్రెస్ పాలనలో ప్రతిష్ఠాత్మక కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం.. అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారడం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు. విద్యాసంస్థలు సైతం అవినీతికి కేంద్రంగా మారడం రాష్ట్ర ప్రభుత్వ దిగజారుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విలువల్లేని తనానికి నిదర్శనమని విమర్శించారు. వైద్య విద్య మారుల రీ-వాల్యుయేషన్ ప్రక్రియపై వరుసగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నదని నిలదీశారు. పీజీ వైద్య పరీక్షల్లో ఫెయిలైన ఐదుగురు విద్యార్థులు, కొద్ది రోజులకే ఎలా పాస్ అవుతారని ప్రశ్నించారు. ఈ అక్రమాల వెనుక విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డాక్టర్ నందకుమార్‌రెడ్డి సూత్రధారి అని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
ఫెయిలైన విద్యార్థులంతా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు చెందినవారని, ఆ కాలేజీలతో వీసీ ఎన్ని కోట్ల రూపాయల డీల్ చేసుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. వీసీ వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రీ-కౌంటింగ్ తర్వాత ఓ విద్యార్థి పాస్ కావడం కాళోజీ విశ్వవిద్యాలయ చరిత్రలోనే మొదటిసారి అని, ఇది నిబంధనల ఉల్లంఘనకు స్పష్టమైన ఉదాహరణ అని వివరించారు. పీజీ వైద్య పరీక్షలను సజావుగా నిర్వహించడంలో వీసీ పూర్తిగా వైఫల్యం చెందారని, సమర్థులైన అధికారులకు అవకాశం కల్పించకుండా రాజకీయ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల యూనివర్సిటీ ఖ్యాతి రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మొత్తం తతంగంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. ‘రీ-వాల్యుయేషన్చేసే అధికారం వీసీకి ఎవరు ఇచ్చారు? సమాధాన పత్రాలనుతిరిగి విద్యార్థులకు ఇచ్చి ఫెయిలైన వారిని పాస్ చేయాలని వీసీని ఆదేశించినవారు ఎవరు? ఆరోగ్య శాఖ నియమించిన కమిటీ అవకతవకలను గుర్తించినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి. ఈ సామ్లో ప్రభుత్వం కాపాడుతున్న ఆ పెద్ద మనిషి ఎవరు?’ అని ప్రశ్నించారు.
అర్హత లేని విద్యార్థులను వైద్యవిద్యలో అడ్డదారిలో పాస్ చేస్తే ప్రజల ప్రాణాలు తీస్తారని, అప్పుడు ఎవరిది బాధ్యత? అని హరీశ్‌రావు మండిపడ్డారు. కమీషన్ల కోసం కకుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీసీపై అవినీతి ఆరోపణలు, నకిలీ తనిఖీలతో మెడికల్, నర్సింగ్ కాలేజీల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్న ఘటనలు పత్రికల ద్వారా వెలుగు చూస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో తక్షణం చర్యలు తీసుకోవాలని గవర్నర్, ఎన్ఎంసీ చైర్మన్‌కు విన్నవించారు. వీసీకి అండగా ఉన్న రాజకీయ పెద్దలెవరో బహిర్గతం చేయాలని, ఆరోగ్య శాఖ, విజిలెన్స్ శాఖ దర్యాప్తు నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్, పీజీ పరీక్షల మోసాలు, మారుల రీ-వాల్యుయేషన్, సర్వర్ మార్పులు మొదలైనవాటిపై పూర్తి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు. వీసీ నందకుమార్రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.