హైదరాబాద్ : నగరంలోని వెంగళ్రావునగర్లో టెలీ మెంటల్ హెల్త్ సెంటర్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ కాల్ సెంటర్లో 25 మంది శిక్షణ పొందిన కౌన్సెలిర్లు, మనస్తత్వవేత్తలు, మానసిక వైద్యుల బృందం 24/7 సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ టెలీ మెంటల్ హెల్త్ సర్వీసెస్ ప్రస్తుతం రాష్ట్రంలో మానసిక ఆరోగ్య కార్యక్రమాలను బలోపేతం చేస్తుందని, ఈ మానసిక ఆరోగ్య కార్యక్రమం అమలుతో రాష్ట్రంలో మానసిక రోగులకు చక్కని సేవలు అందుతాయన్నారు. ఎవరైనా రోగి చికిత్స నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటే.. ఈ కేంద్రం సహాయంతో సమర్థవంతంగా వారిని ట్రాక్ చేస్తూ.. తిరిగి వైద్య సహాయం అందేలా చూడవచ్చన్నారు.
మానసిక రోగులు తమ జిల్లాల్లోని స్థానికంగా నిపుణుల వైద్యం పొందలేకపోవచ్చని.. అలాంటి వారికి ఈ కేంద్రం సాయం అందిస్తుందన్నారు. టెలీ-మెంటల్ హెల్త్ 24/ 7 కొనసాగుతుందని, బాధితులకు నాణ్యమైన సేవలు అందిస్తుందన్నారు. మానసిక సమస్యలున్న వారు టోల్ ఫ్రీ నంబర్ 14416ను వినియోగించాలన్నారు. ఉచితంగా 24/7 సేవలు అందుబాటులో ఉంటాయని, మానసిక ఆరోగ్య చికిత్స వివరాలు, బాధితులు చెప్పే సమస్యలు గోప్యంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ఈఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎం ఓస్డీడీ గంగాధర్, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్చి తదితరులు పాల్గొన్నారు.