హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలు, ప్రభుత్వ వైఫల్యాలను అడుగడుగునా ఎండగడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాజకీయంగా కక్ష సాధించేందుకే ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ నోటీసులు జారీచేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, అందులో భాగంగానే కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని శుక్రవారం ఎక్స్ వేదికగా విమర్శించారు.
రేవంత్ సర్కారు డైవర్షన్ డ్రామాలు నడుపుతూ బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు. ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా రేవంత్ రాజకీయ అరాచకత్వం విజయం సాధించే ప్రసక్తేలేదని పేర్కొన్నారు. సీఎం డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలకు ఇప్పటికే అర్థమయ్యాయని, తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
ఫార్ములా-ఈ కారు రేస్‌తో తెలంగాణ ప్రతిష్ఠ పెరిగిందని, పెట్టుబడులు వెల్లువెత్తాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. అమర్‌రాజా లాంటి దిగ్గజ కంపెనీ సైతం తమ ప్లాంట్ల స్థాపనకు ముందుకు వచ్చిందని వివరించారు. ‘2000 సంవత్సరంలో అప్పటి సీఎం చంద్రబాబు ఫార్ములా-ఈ రేస్ తెచ్చేందుకు విఫలయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ సర్కారు, కేటీఆర్ కృషితో తెలంగాణలో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించి రాష్ట్రఖ్యాతిని పెంచారు.
హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ వాహనాల మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చారు’ అని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రతిష్ఠ పెంచిన కేటీఆర్‌కు రేవంత్ సర్కారు నోటిసులిచ్చి ప్రతాపం చూపడం విడ్డూరమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించి రాష్ట్ర పరువు, దేశ ప్రతిష్ఠను మంటగలిపిందని తూర్పారబట్టారు. రేవంత్‌రెడ్డి ఎన్నిరకాలుగా వేధించినా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం బీఆర్ఎస్ ఆపబోదని స్పష్టంచేశారు.