Harish Rao : తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో 2025 జూన్ 30వ తేదీ ఒక చీకటి రోజని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో కూలి కోసం వలస వచ్చిన 54 మంది పేద కార్మికులు సజీవదహనమైన ఘోర ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ వైఫల్యం, సిగాచి యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు.
ఘటన జరిగిన రోజున హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఉన్నా 20 కిలోమీటర్లు దూరంలోని ఘటన స్థలానికి సీఎం రేవంత్ రాకపోవడం, బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవకపోవడం హృదయవిదారకమన్నారు. విమర్శలు రావడంతో మరుసటి రోజు వచ్చారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మృతదేహాల సాక్షిగా ప్రతి కుటుంబానికి రూ.1 కోటి ఇస్తానని ప్రకటించినా, ప్రభుత్వం తరపున కేవలం రూ.1 లక్ష మాత్రమే ఇచ్చింది. కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్స్యూరెన్స్, వైద్య ఖర్చులను కూడా పరిహారంలో చేర్చి మోసం చేశారని ఆరోపించారు.
డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం, క్షతగాత్రులకు సహాయం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఈ ఘటన సామూహిక హత్య అని, 818 HPకి అనుమతి తీసుకుని 1777 HP నడపడం, సేఫ్టీ గార్డ్స్, ఫైర్ NOC, డస్ట్ కంట్రోల్ వ్యవస్థ లేకపోవడం వంటి నిర్లక్ష్యాలు విచారణలో తేలాయన్నారు. ప్రభుత్వం యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం, ఎండీని అరెస్టు చేసి వెంటనే బెయిల్‌పై విడుదల చేయడం లోపాయికారీ ఒప్పందాన్ని సూచిస్తుందని విమర్శించారు.
సిగాచి డైరెక్టర్ల ఆస్తులను అటాచ్ చేసి కోటి రూపాయల పరిహారం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాట తప్పడం మీకు అలవాటే కానీ ప్రాణాలు కోల్పోయిన పేద కార్మికుల కుటుంబాలను మోసం చేయవద్దని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.