హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో, గల్లీలో ఎవరున్నా తెలంగాణ గొంతు వినిపించే బీఆర్ఎస్ ఎంపీలే పార్లమెంట్లో ఉండాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తేనే వారిచ్చిన హామీలు నెరవేరుతాయని తెలిపారు. ఢిల్లీ నుంచి తెలంగాణకు ఏం తీసుకురావాలన్నా అది బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు కాలేదని, అందుకనే ఆగుతున్నామని, లేదంటే చీల్చిచెండాడేవాళ్లమని హెచ్చరించారు.
మరికొన్ని రోజులుపోతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా రండిరండి అంటూ ప్రజలే వారిని బయటకు తీసుకువస్తారని పేర్కొన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన నాగర్‌కర్నూల్ లోక్‌సభ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపై కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పార్టీ నడుచుకుంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రం కోసం రేయింబళ్లు తండ్లాడామని, అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉంటూనే మన మట్టిమనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడదామని పిలుపునిచ్చారు.
బడ్జెట్‌కు మించి హామీలు
దేశంలో ప్రభుత్వాలు మారడం కొత్తేమీ కాదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వరుసగా పదేండ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదని, ఐదేండ్లకే ఆ పార్టీ ప్రజావ్యతిరేకత మూటగట్టుకుని ఇంటికిపోయిన సందర్భాలే ఎక్కువని వివరించారు. మన బడ్జెట్ రూ. 2.90 లక్షల కోట్లు అయితే, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలని తెలిపారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. హామీల సంగతి తేల్చమంటే అవసరం లేని విషయాలను తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీల అమలుకు డబ్బుల్లేవని స్వయంగా ఆ రాష్ట్ర ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి చెప్పారని గుర్తుచేశారు. కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేశారని, సంప్రదాయ రాజకీయ పద్ధతులకు ఆయన దూరంగా ఉన్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఫలితాలను గుణపాఠంగా తీసుకుని ముందుకు సాగుదామని, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుదామని పిలుపునిచ్చారు.
మెడలు వంచాల్సింది పోయి దండలేస్తున్నారు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని చేతులెత్తేసిన కేంద్రం మెడలు వంచాల్సింది పోయి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో ప్రతిరోజు బీజేపీ నాయకుల మెడల్లో దండలేసి వస్తున్నారని విమర్శించారు. పేదరికం అతితక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉండడం కేసీఆర్ ఘనతేనని ప్రశంసించారు. రాష్ట్రంలో పేదరికం 3 శాతంగా ఉంటే, ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్లో 9శాతంగా ఉందని గుర్తు చేశారు. దావోస్ వెళ్లడం దండగని ప్రతిపక్షంలో ఉండగా విమర్శించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలు మొదలుపెట్టిందని హరీశ్ ఆరోపించారు.
కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి రక్ష: పోచారం
కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి రక్ష అని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి ఓడిపోతారన్న ప్రచారం జరిగిందని, కానీ తాను కష్టపడి పనిచేసి తప్పని నిరూపించానని చెప్పారు. ఓటమితో కుంగిపోవద్దని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ హామీలపై పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ రాములు, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, రజనీ తదితరులు పాల్గొన్నారు.
దుష్ప్రచారంతోనే కాంగ్రెస్ గెలిచింది: నాగం జనార్దన్‌రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారంతోనే గెలిచిందని మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు రేషన్‌కార్డులు ఇవ్వలేదని బీఆర్ఎస్లో చేరే వరకు తాను అనుకునేవాడినని, కానీ కేసీఆర్ ప్రభుత్వం 6 లక్షల తెల్లరేషన్‌కార్డులు ఇచ్చిందనే విషయం ఆ తర్వాత తెలిసిందని పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రచారం చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాడర్ అధైర్యపడొద్దని, పార్లమెంటు ఎన్నికల్లో అందరం సమిష్టిగా కష్టపడితే 10 స్థానాలు గెలుచుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు.