Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని హరీశ్‌రావు నిలదీశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం రిపోర్ట్‌పై సభలో చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. అయితే, సభలో హరీశ్‌రావు మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు సహా పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ వైపు ఆరోపణలు చేస్తూనే.. మరో వైపు సబ్జెక్ట్‌పైనే మాట్లాడాలని గమనార్హం. అయినా, హరీశ్‌రావుకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఓ వైపు ప్రభుత్వానికి ఘాటుగా కౌంటర్లు వేస్తూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి ఓ మాట అన్నడు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నం. ఒకటి ఒప్పుకున్నడు. ఆనాడు చాతకాలేదు. మంత్రులం ఉమ్మడి ఏపీలో చేయలేకపోయామని అన్నరు. మరి తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావొస్తున్నా తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి తవ్వలేదు. గ్రావిటి ద్వారా ఎందుకు నీళ్లు ఎందుకు తేలేదు. రెండేళ్లయినా ఏం చేస్తున్నారు ? అని నిలదీశారు.
దాంతో మంత్రి శ్రీధర్‌బాబు.. ఆ తర్వాత మంత్రి జూపల్లి కృష్ణారావు హరీశ్‌రావు ప్రసంగానికి అడ్డు తగిలారు. అనంతరం మంత్రులు అడిగిన ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ నుంచి పోయినప్పుడు ఎలా? వచ్చాయో అడిగారు చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కేబినెట్స్ మినిట్స్ ఉన్నయ్. అందులో జూపల్లి కృష్ణారావు కూడా మంత్రిగా ఉన్నడు. కేబినెట్ మినిట్స్ కూడా ఉన్నయ్. 3 జూన్ 2016 రోజున కేబినెట్ సమావేశం జరిగిందని.. ఇందులో కడియం శ్రీహరి, మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, పద్మారావుగౌడ్, జోగురామన్న, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, చందులాల్, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఆ రోజు వ్యాప్కోస్‌కు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు భాగమే. ఇవాళ అడుగుతున్న ప్రశ్నలు ఆ రోజు ఎందుకు అడగలేదు ? దాంతో మంత్రి జూపల్లి, శ్రీధర్‌బాబు జోక్యం చేసుకొని ప్రసంగానికి అడ్డు తగలడంతో.. తనకు ప్రశ్నలు వేస్తున్నారని.. రాష్ట్రంలో, అసెంబ్లీలో ఏం జరుగుతుందో ప్రజలు పరిశీలిస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. ఆ తర్వాత మళ్లీ హరీశ్‌రావు మళ్లీ మాట్లాడబోతుండగా.. జూపల్లి, పొంగులేటి అడ్డుతగిలారు.
‘మంత్రి జూపల్లి కృష్ణారావు మేడిపల్లి దగ్గర నీళ్లు ఎలా వచ్చాయని అడుగుతున్నరు. అంటూ ఒక మాట తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అంతా 20-30 కిలోమీటర్లు మాత్రమే ఉంటదని అంటున్నరు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు ఉంటది. నీళ్లు ఎలా వస్తాయంటే.. మహారాష్ట్ర టెరిటరి నుంచి ఉన్న క్యాచ్మెంట్.. తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివి వినిపిస్తాను రాసుకోవాలి. మహారాష్ట్ర నుంచి చాంకేరి వాగు, మట్టాపూర్వాగు, అహిరివాగు, కొల్లపల్లివాగు, వట్రాల్వాగు, లంకచెరువు, పోచంపల్లివాగు, వయ్యంపల్లివాగు, మేడారం వాగు, కృష్ణాపూర్, పెంటిపాకవాగు, తుమ్మాపూర్, అపెట్టవాగు, వడ్డెంవాగు, కూకట్పల్లి వాగు మహారాష్ట్ర నుంచి వస్తయ్. తెలంగాణ నుంచి పెద్దవాగు, ఎర్రవాగు, నీల్వాయ్వాగు, వట్టివాగు, చెల్మెడవాగు, గొల్లపల్లి, ర్యాలీవాగు, జైపూర్ వాగు వస్తయ్. ఇవన్నీ కలిపి 120 టీఎంసీలు అదనంగా మేడిగడ్డ వద్దకు రావడం జరుగుతుంది’ హరీశ్‌రావు వివరించారు.
ఇక సీఎం రేవంత్ కామెంట్స్‌పై స్పందిస్తూ.. ‘ఇక సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నిపుణుల కమిటీ నివేదికను నాకు చదివి వినిపించారు. కమిటీ ఏం చెప్పింది, కమిటీ మాటలను మేం పట్టించుకోలేదా? ఘోష్ కమిషన్ పట్టించుకోలేదా? ఒకసారి మాట్లాడుకుందాం. నిపుణుల కమిటీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఏం అడిగింది? మేం అడిగింది మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్‌మానేరుకు నీరు తీసుకుపోవడానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వాలని అడిగాం. మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ కట్టవచ్చని, మిడ్‌మానేరుకు నేరుగా నీరు తీసుకుపోవడం సాధ్యం కాదని నిపుణుల కమిటీ చెప్పింది. ఇదే నిపుణుల కమిటీని ఘోష్ కమిషన్ పిలిచింది. ఆనాడు వారికి ఏం చెప్పారు అని అడిగింది. రిటైర్డ్ ఇంజినీర్లు ఘోష్ కమిషన్ ముందు చెబితే.. మాట చెప్పడం కాదు.. రాతపూర్వకంగా ఇవ్వాలని కోరింది. ఘోష్ కమిషకు రాతపూర్వకంగా రిటైర్డ్ ఇంజినీర్లు కాపీ ఇచ్చారు.
ఘోష్ కమిషన్‌కు లెటర్ పెడితే రిటైర్డ్ ఇంజినీర్ల కాపీ కావాలని కోరితే పంపారు. ఫస్ట్ రిపోర్ట్‌లో చెప్పిన విషయమే.. ఘోష్ కమిషన్‌కు రెండో రిపోర్ట్‌లో చెప్పారు. మా సూచనల మేరకు నేరుగా నీటిని తరలింపును మానుకొని.. గోదావరి నదిని ఉపయోగించి.. నీళ్లు తీసుకుపోతున్నారని చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పారు. మా ఆలోచనలు, సూచనల మేరకు అన్నారం, సుందిళ్ల, మరో రెండు బ్యారేజీలు కట్టి.. ఎల్లంపల్లి నుంచి గోదావరి నీళ్లను తీసుకురావడం జరిగిందని ఘోష్ కమిషన్‌కు రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చారు. ఇప్పుడు చెప్పాలి ఘోష్ కమిషన్ పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజినీర్ల నివేదికను? మేం పట్టించుకోలేదా? అని ప్రశ్నించగా.. స్పీకర్ హరీశ్‌రావు మైక్‌ను కట్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కల్పించుకొని.. ముందు ఇచ్చిన నివేదికలో హరీశ్‌రావు చెప్పిన విషయాలు లేవంటూ చెప్పుకొచ్చారు. కుట్ర పూరితంగా తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని ఆరోపించగా.. హరీశ్‌రావు ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రి ఉత్తమ్‌కు పంపడం గమనార్హం.