కరీంనగర్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): ‘మహిళల ఖాతాల్లో రూ.25.89 కోట్లు వేసినం. పండుగ పూట ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నరు. కండ్లు కనిపించట్లేదా?’ అని మంత్రి తన్నీరు హరీశ్‌రావు బీజేపీ నేత ఈటల రాజేందర్‌పై మండిపడ్డారు. బీజేపీ అనే గుంత లో దిగి నిండా బురద అంటించుకున్న ఈటల.. అబద్ధాలతో ఎన్నికలో లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. శనివారం రాత్రి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీజేపీ విధానాలు, ఈటల అబద్ధపు ప్రచారాలపై విరుచుకుపడ్డారు. ఏడేండ్లలో కేంద్రంలోని బీజేపీ ఏంచేసింది?, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏం చేసిందో విశ్లేషించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ధరలు పెంచుతూ సామాన్యులను కడుపు నిండా తినకుండా చేసిన బీజేపీకి ఎందుకు ఓటేయాలో ఆలోచించుకోవాలని కోరారు.
ఆది నుంచి అబద్ధాలు చెప్తూ టీఆర్ఎస్పై ఈటల బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. జమ్మికుంట మీటింగ్‌లో కరెంటు పోతే టీఆర్ఎస్ వాళ్లే కట్ చేశారని మొత్తుకున్నారని, బిల్లు కట్టకనే ఆ ఫంక్షన్ హాల్‌కు కనెక్షన్ తొలగించిన సంగతి చెబితే నోరు తెరవట్లేదని గుర్తుచేశారు. కమలాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రధాన అనుచరుడి కారు ఢీకొని ఆటోడ్రైవర్ చనిపోతే.. అది బాల్క సుమన్ కారని విష ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. తీరా అది బీజేపీ నా యకుడి కారని తేలడంతో చప్పుడు చేయట్లేదని ఎద్దేవాచేశారు. మహిళలకు ఇ చ్చినవి ఫేక్ చెక్కులని ప్రచా రం చేస్తున్న ఈటలకు.. మహిళల ఖాతాల్లో 25.89 కోట్లు జమైన విషయం కనిపించట్లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలుపు కోసం ఇంత దిగజారుడుతనం అవసరమా? అని ప్రశ్నించారు.
దేశంలో విద్యుత్తు సంక్షోభం ఏర్పడిందని, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్, ఆ పార్టీ పాలిస్తున్న ఉత్తరప్రదేశ్, హరియాణ, బీహార్, పక్కనున్న ఏపీలోనూ కోతలు విధిస్తున్నారని మంత్రి తెలిపారు. కేసీఆర్ దూరదృష్టి కారణంగా రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని స్పష్టంచేశారు. స్థానిక అవసరాలకు సరిపోగా.. 10 మిలియన్ యూనిట్లు ఇతర రాష్ర్టాలకు విక్రయిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని బొగ్గు నిల్వలను బలవంతంగా లాక్కునేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో ఎంపీ బండా ప్రకాశ్, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు, టీఆర్ఎస్ నాయకులు కౌషిక్‌రెడ్డి పాల్గొన్నారు.
గ్యాస్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్ను వస్తుందని అబద్ధాలు చెప్తివి. దీనిపై చర్చకు రావాలని, నువ్వు చెప్పింది నిజమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పిన. అబద్ధమైతే ఉపఎన్నిక పోటీ నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరితే ఇంతవరకు ఎందుకు స్పందించలేదు. అది అబద్ధం కాబట్టే నువ్వు నోరు తెరవట్లేదు. – మంత్రి హరీశ్‌రావు
ఈటల గెలిస్తే బీజేపీకి లాభమని, టీఆర్ఎస్ గెలిస్తే హుజూరాబాద్ ప్రజలకు న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు. బీజేపీ ఢిల్లీకి గులాం లాంటి పార్టీ అని, టీఆర్ఎస్ ప్రజల పార్టీ అని చెప్పారు. బీజేపీ పేరు చెప్పుకోడానికి భయపడుతున్న ఈటల.. ముస్లింల వద్దకు వెళ్లి తనను చూసి ఓట్లు వేయాలని కోరుతున్నారని ఎద్దేవాచేశారు. ఈటలను చూసే దళితబంధు అమలు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. మరి రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కాళేశ్వరం ప్రాజెక్టు, ఉచిత విద్యుత్తు, రుణమాఫీ ఎవరిని చూసి అమలు చేస్తున్నామో? చెప్పాలని డిమాండ్ చేశారు.