హైదరాబాద్, జూలై 2(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు అవినీతిపై సవాళ్లు విసిరి, చివరికి చర్చకు రాకుండా పోలీసుల వెనుక దాక్కొని తోకముడిచారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోల్ కొడుదామనుకొని కాంగ్రెస్ నేతలు సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన అప్పులపై నిజానిజాలు తేల్చుదామని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. తెలంగాణ భవన్లో కేటీఆర్, తాను ఉంటే చర్చకు రాకుండా పారిపోయారని.. చీమూనెత్తురుంటే జూపల్లి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్, గన్పార్, చివరకు కంచన్‌బాగ్ పీఎస్‌కు వెళ్లినా అవినీతిపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, పోలీసుల ఎస్కార్ట్ వాహనాల్లో ఎక్కడికి రావడానికైనా రెడీగా ఉంటే పోలీసులతో అడ్డుకున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణభవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, శంకర్‌నాయక్, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, రామచంద్రునాయక్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సబ్జెక్ట్ లేకుండా, పస లేకుండా మంత్రులు సవాల్ విసిరి తోకముడిచారని ఎద్దేవా చేశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో పొంతనలేని లెక్కలు చెప్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ఒక రోజు పదేండ్లలో రూ.8.50 లక్షల కోట్ల అప్పులు చేశారన్న జూపల్లి, మరుసటి రోజే రూ.7లక్షల కోట్లకుపైగా అంటున్నారని, ఒక్క రోజులోనే లక్ష కోట్లు తగ్గిందా? అని ప్రశ్నించారు. అప్పులపై జూపల్లి రెండు రకాలుగా మాట్లాడిన వీడియోలను ఈ సందర్భంగా మీడియాకు ప్రదర్శించారు. ఈ రోజు చర్చిస్తే మరో రూ.2-3 లక్షల కోట్లు తగ్గిస్తారేమోనని ఎద్దేవా చేశారు. అప్పులపై గతంలోనే అసెంబ్లీ సాక్షిగా తాను కాగ్, కేంద్రం పార్లమెంట్‌కు ఇచ్చిన లిఖితపూర్వక గణాంకాలతో చెప్పానని గుర్తుచేశారు. అసెంబ్లీలో అయినా, అమరవీరుల స్తూపం వద్ద అయినా, మరెక్కడయినా అప్పులపై చర్చించేందు తాను సిద్ధమని పునరుద్ఘాటించారు. ‘అప్పులపై సవాల్ విసిరింది మీరే. పోలీసులను అడ్డుపెట్టుకొని చర్చకు రాకుండా తోకముడిచింది మీరే’ అని స్పష్టంచేశారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూటకో మాట మాట్లాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిందే రూ.84 వేల కోట్లయితే, లక్ష కోట్ల అవినీతి అం టూ గతంలో దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తాము రూ.2వేల కోట్ల టెండర్లలో సామ్ జరిగిందంటే.. ఆయన తొలుత టెండర్ మొత్తమే రూ.687 కోట్లు అని, ఆ త ర్వాత రూ.1,142 కోట్లు అన్నారని గుర్తుచేశా రు. గురుకుల కిరాణా టెండర్లు రూ.800 కోట్ల కు పిలిచారని, ఇందులో రూ.200 కోట్ల గోల్మాల్ జరిగిందని పత్రికల్లో వచ్చిందని, ఇందు కు సంబంధించిన వార్త క్లిప్పింగ్‌ను మీడియా కు చూపించారు. ఈ టెండర్ విధానంపై కొం దరు కోర్టును ఆశ్రయించారని, కోర్టు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చిందని ఆ తీర్పును హరీశ్‌రావు చదివి వినిపించారు. మొదటినుంచే పిల్లలు తినే ఆహా రం, కోడిగుడ్ల కొనుగోళ్లలో కూడా సామ్ జరిగిందని చెప్తున్నామని, పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, గరం మసాలా వంటి వస్తువులను డబుల్ రేట్ల కోట్ చేశారని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు పోలీసు, పాఠశాల, గురుకుల యూనిఫామ్‌ల ఆర్డర్లు టెసోకే ఇవ్వాలనే ఉద్దేశంతో జీవో తీసుకొచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జీవో నిబంధనలను ఉల్లంఘించి కేంద్రీకృత టెండర్ విధానం తీసుకొచ్చి కమీషన్ల కోసం పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని చెప్పారు. దీనిపై చేనేత కార్మిక సంఘాలు కోర్టుకు వెళ్తే చేనేత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని వారికి ఆర్డర్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయాలని న్యాయమూర్తి నంద ఆదేశించారని గుర్తుచేశారు.
నాటి జడ్జి తీర్పులోని సారాంశాన్ని చదివి వినిపించారు. అయినా అమలు చేయకపోవడంతో వీరాంజనేయ హ్యాండ్లూమ్ సొసైటీ మళ్లీ హైకోర్టును ఆశ్రయించిందని, ఈ కేసులో కూడా హైకోర్టు చేనేత కార్మికుల జీవనోపాధిపై దెబ్బకొట్టొద్దని స్పష్టంచేసిందని గుర్తుచేశారు. కమీషన్ల కోసం ప్రభుత్వం అప్పటికే ఇచ్చిన ఆర్డర్లను వెనకి తీసుకున్నదని చెప్పారు. పెద్ద కాంట్రాక్టర్లకు దుస్తుల కాంట్రాక్టు కట్టబెడితే వేలాది చేనేత కార్మికులు రోడ్డున పడుతారని, దయచేసిన పరిశీలించాలని ముఖ్యమంత్రికి స్వయంగా మంత్రి కొండా సురేఖ లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డికి గుజరాత్ దళారులపై ఉన్న దయ.. చేనేత కార్మికులపై లేదని, మఫత్‌లాల్ ముద్దు… చేనేత వద్దు’ అనేదే ప్రభుత్వ వైఖరి అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో తీసుకొచ్చిన జీవో 110 ప్రకారం దుస్తులు, బూట్ల కొనుగోళ్లు లిడ్‌క్యాప్ ద్వారా చేపట్టాలని హరీశ్‌రావు గుర్తుచేశారు. లిడ్‌క్యాప్ ద్వారా తెలంగాణలోని లోకల్ తోలు వ్యాపారులకు(మాదిగ లేదా ఇతర సామాజిక వర్గాలకు) ఆర్డర్లు దక్కకుండా కాంగ్రెస్ సర్కార్ దళితబిడ్డలను మోసం చేసిందని విమర్శించారు. బూట్ల సరఫరా టెండర్లు గుజరాత్ కంపెనీకి కట్టబెట్టారని ఆక్షేపించారు. దీనిపై లీడ్‌క్యాప్ శాఖ కోర్టుకు వెళ్లిందని, అంటే ఒకశాఖ మరోశాఖపై కోర్టుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, ఇదే సామ్‌కు నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో తమకే ఆర్డర్లు ఇచ్చేవారని లిడ్‌క్యాప్ ప్రభుత్వానికి లేఖ రాసిందని, అలాంటప్పుడు సామ్ జరుగలేదని అడ్లూరి లక్ష్మణ్ ఎలా చెప్తారని ప్రశ్నించారు.
పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు, పీఎంయూ చైర్మన్‌కు కూడా లిడ్‌క్యాప్ లేఖలు రాసిందని, దళితబిడ్డల నోరు కొట్టొద్దని విజ్ఞప్తి చేసిందని గుర్తుచేశారు. లేఖల ద్వారా చేసిన వినతి పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం గత జీవోను కూడా తుంగలో తొక్కి గుజరాత్ దళారులకు ఆర్డర్లు కట్టబెట్టారని మండిపడ్డారు. చివరకు దళిత బిడ్డలు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని, హైకోర్టు చెప్పిన తర్వాతే 10శాతం ఆర్డర్లు లిడ్క్యాప్నకు ఇచ్చారని గుర్తుచేశారు. నోట్‌బుక్స్ కొనుగోళ్లలో కూడా రూ.150 కోట్ల కమీషన్ కోసం వాటర్మార్ నిబంధన పెట్టారని విమర్శించారు. తాము ఈ స్కామ్ బయటపెట్టడంతో టెండర్లు రద్దు చేశారని చెప్పారు.
గురుకుల టెండర్లలో రూ.2వేల కోట్ల అవకతవకలు జరిగాయని తాను, ఆర్ఎస్ ప్రవీణ్, కొప్పుల ఈశ్వర్ ఆధారాలతో మాట్లాడామని హరీశ్‌రావు గుర్తుచేశారు. చర్చకు సిద్ధమని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రెస్‌క్లబ్‌లో అన్ని ఏర్పాటుచేశారని, తొలుత చర్చకు వస్తానన్న అడ్లూరి లక్ష్మణ్ తర్వాత హరీశ్‌రావే రావాలని షరతులు పెట్టారని చెప్పారు. సిద్దిపేటలో తనకు ముందస్తు కార్యక్రమాలున్నా వాటిని రద్దుచేసుకొని, తాము సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు రావడానికి సిద్ధమైతే మంత్రులు చెప్పారని పోలీసులు తమను అడ్డుకున్నారని విమర్శించారు. మంత్రుల సవాల్ నిజమైతే తమను ఎందుకు అరెస్టు చేయించారని ప్రశ్నించారు.
గన్‌పార్కుకు రావాలంటే అక్కడికి కూడా వెళ్లడానికి సిద్ధమైతే పోలీసులు రానివ్వలేదని మండిపడ్డారు. పోలీసులు తమను అడ్డుకుంటున్నారని, మీరైనా చె ప్పండని మంత్రులు అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్లకు తాను స్వ యంగా ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తలేదని మండిపడ్డారు. తమను అరెస్టు చేసి పోలీసులు కంచన్‌బాగ్ ఠాణాకు తరలిస్తే అక్కడ కూడా కుర్చీలు ఏర్పాటు చేసినా చర్చకు రాలేదని విమర్శించారు. హిట్లర్ ఆదర్శం అని చెప్పే సీఎం నుంచి ఇంతకంటే ఎకువ ఆశించలేమంటూ చురకలంటించారు.
కాంగ్రెస్ సర్కార్ తీరు మాటలు ఘనం.. చేతలు శూన్యం అన్నట్టుగా ఉన్నదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఎ స్సీ, ఎస్టీలకు టెండర్లు, ప్రొక్యూర్మెంట్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని, ఆ డిక్లరేషన్‌ను కాకి ఎత్తుకుపోయిందా? అని ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గట్టిగా ప్రశ్నిస్తున్నారని కక్షసాధింపులో భాగంగా ఆయన భద్రతను తగ్గించారని విమర్శించారు. రిటైర్‌అయ్యే ఏడాది ముందు బదిలీలు చేయకూడదని, కానీ, ఉద్దేశపూర్వకంగా ఆయన భార్య లక్ష్మీబాయిని లూప్లైన్లోకి బదిలీ చేశారని విమర్శించారు. శ్రీధర్‌బాబు సతీమణి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేశారని, తాము ఇ లా చేశామా? అని ప్రశ్నించారు. గురుకులా ల్లోని ఆరు లక్షల మంది పిల్లల కోసం, ఎస్సీ, ఎస్టీ బిడ్డల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పోరా టం చేస్తూనే ఉంటుందని స్పష్టంచేశారు.