హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : చికడపల్లి సెంట్రల్ లైబ్రరీలో గ్రూప్స్, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులపై ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తించడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘ఇదేనా ప్రజాపాలన అంటే, ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే..?’ అని ప్రశ్నించారు.
ఆనాడు సిటీ సెంట్రల్ లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకువెళ్లి ఓట్లు కొల్లగొట్టారని, నేడు అదే లైబ్రరీకి పోలీసులను పంపించి విద్యార్థుల వీపులు పగలగొడుతున్నారని ధ్వజమెత్తారు. చికడపల్లి సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని సోమవారం ఎక్స్ వేదికగా హరీశ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై దమనకాండను ప్రభుత్వం వెంటనే ఆపాలని, ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం రెచ్చగొట్టడం వలే ్ల: ఎర్రోళ్ల
విద్యార్థులను అవమానిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్లే విద్యార్థులు రోడ్లపైకి వచ్చారని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. నిరుద్యోగులు, విద్యార్థుల అరెస్టును ఆయన ఖండించారు. హైదరాబాద్‌లో ఎటు చూసినా ముండ్లు, ఇనుప కంచెలతో సమైక్యపాలనలో ఉద్యమ రోజులను తలపిస్తున్నదని చెప్పారు.
నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి పిలుపునిస్తే వారిని పిలిచి చర్చలు జరపకుండా యూనివర్సిటీ విద్యార్థులు, నిరుద్యోగులు, ముదిరిపోయిన బెండకాయలని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని సూచించారు. నిరుద్యోగులు కోరుతున్నట్టుగా డీఎస్సీ వాయిదా వేసి పరీక్షల మధ్య వ్యవధి పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.