హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): పథకాల అమలులో ఎన్నిసార్లు మాట మారుస్తారని.. ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలనా? అంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి 2024 ఆగస్ట్ 15 వరకు రుణమాఫీ గడువు పొడిగించారని గుర్తు చేశారు.
దసరా వరకు రుణమాఫీ అని చెప్పినా నేటికీ 20 లక్షల పైచిలుకు రైతులకు అందలేదని తెలిపారు. రైతుబంధు విషయంలోనూ కాంగ్రెస్ మాట తప్పిందని పేర్కొన్నారు. ఇప్పుడే తీసుకుంటే రూ.10వేలు, 2023 డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే రూ.15వేల రైతు భరోసా అని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
వానకాలం రైతు భరోసా ఎగవేశారని.. సంక్రాంతికి ఇస్తామని మరోసారి మాట తప్పారని మండిపడ్డారు. తర్వాత జనవరి 26కి అందిస్తామని చెప్పి మళ్లీ ఇప్పుడు మార్చి 31 వరకు అనడం ఏంటని ఫైర్ అయ్యారు. కేసీఆర్ రైతుబంధు ఇచ్చి రైతులకు దన్నుగా నిలిచారని, రేవంత్‌రెడ్డి మాత్రం దాన్ని ఎగ్గొట్టి రైతులకు భరోసా లేకుండా చేశారని మండిపడ్డారు. ఆసరా పింఛన్ రూ.4వేలు, తులం బంగారం, మహిళలకు రూ.2,500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2లక్షల ఉద్యోగాలు నిరుద్యోగభృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలని ఎద్దేవా చేశారు.