కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ర్టానికి రూపాయి కూడా కేటాయించలేదని, నీతి ఆయోగ్ సమావేశాన్ని వ్యతిరేకిస్తామని అసెంబ్లీలో చెప్పిన రేవంత్‌రెడ్డి.. నిన్న అందరికంటే ముందే ఎందుకు వెళ్లారు? బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని ప్రధానితో మాట్లాడుతారనుకున్నం. కానీ ఆయనేమీ మాట్లాడలేదు.
-హరీశ్
BRS | హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : నాడు నీళ్ల కోసం బీఆర్ఎస్ పోరాడిందని, తెచ్చుకున్న తెలంగాణలో 200 టీఎంసీల నీళ్లను అప్పనంగా ఏపీకి తరలిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ అనుమతితో పెద్దఎత్తున ప్రజా పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రాజెక్టును నిలువరించాలని, లేదంటే ఢిల్లీలో సీడబ్ల్యూసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో ఆదివారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తున్నదని, తద్వారా తెలంగాణకు తీవ్ర నష్టం కలగబోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తామంటే అడ్డుకున్న ఏపీ.. ఒక అనుమతి కూడా లేకున్నా నిబంధనలు బుల్డోజ్ చేస్తూ, కేంద్రం జుట్టు తన చేతిలో ఉన్నదని రాత్రికి రాత్రి పనులు చేపడుతున్నదని విమర్శించారు.
తెలంగాణ ఉద్యమం నీళ్ల నుంచే పుట్టిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. అంతటి ప్రాధాన్యం ఉన్న నీళ్లను కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలను కాపాడటంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఉమ్మడి ఏపీలో సీమాంధ్ర నేతల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని, నేడు స్వరాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల రూపంలో నష్టం వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలింపు కుట్ర ప్లాన్ ప్రకారమే జరుగుతున్నదని తెలిసినా సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోవడంలేదని, గురుదక్షిణ చెల్లించుకుంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఇదే చంద్రబాబు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక లేఖలు రాశారు. 2018లో కేంద్ర జలవనరుల శాఖకు, అపెక్స్ కౌన్సిల్‌కు లేఖలు రాశారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా, విభజన చట్టం ఉల్లంఘిస్తూ కాళేశ్వరం కడుతున్నారని అడ్డుకోవాలని కోరా రు. కాళేశ్వరం కొత్తది కాదు, ప్రాణహితకు కొనసాగింపు అని వాస్తవం చెప్పి కేంద్రం అనుమతి సాధించాం. భక్త రామదాసు లిఫ్టు ఆపేందుకూ లేఖ రాశారు. పాలమూరు సహా 20, 30 ప్రాజెక్టుల్ని అడ్డుకోవాలని లేఖలు రాశారు. చివరికి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా కేసులు వేశారు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా చం ద్రబాబు రాసిన లేఖలను మీడియాకు చూపించారు.
కిషన్రెడ్డీజీ.. ఆల్‌పార్టీ డెలిగేషన్ను మోదీ దగ్గరకు తీసుకెళ్లండి. పదవిలో ఉండటం ముఖ్యం కాదు, ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. పదవిలో ఉండే అర్హత మీకు లేదు. జీరో పర్మిషన్ ప్రాజెక్టులకు అనుమతులు ఎలా ఇస్తారు?
-హరీశ్‌రావు
విభజన చట్టం ప్రకారం గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు కడితే కేఆర్ఎంబీ లేదా జీఆర్ఎంబీతోపాటు అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకోవాల్సిందేనని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ‘గోదావరి బనకచర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? విభజన చట్టం ప్రకారం, కేఆర్ఎంబీ లేదా జీఆర్ఎంబీ అనుమతి తీసుకోవాలి. ఆయా పరీవాహక రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి, ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవేవీ లేకుండానే కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ర్టానికి రూపాయి కూడా కేటాయించలేదని, నీతి ఆయోగ్ సమావేశాన్ని వ్యతిరేకిస్తామని అసెంబ్లీ చెప్పిన రేవంత్‌రెడ్డి.. అందరికంటే ముందే ఎందుకు వెళ్లారని హరీశ్‌రావు ప్రశ్నించారు. నీతి ఆయోగ్ మీటింగ్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి.. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని ప్రధానితో మాట్లాడతారకున్నామని, కానీ ఏమీ మాట్లాడలేదని మండిపడ్డారు. ‘అసలు కుట్ర ఏమిటంటే, గోదావరి మీద ట్రిబ్యునల్ వేయాలని ఏపీ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. గోదావరి ట్రిబ్యునల్ వచ్చే లోపే బనకచర్ల నిర్మించి, ప్రజాధనం ఖర్చు అయింది కాబట్టి, నీళ్లు కేటాయించాలని చెప్పి, 200 టీఎంసీలు తీసుకొనే కుట్ర. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతున్నది’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ర్టానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరని ద్రోహం చేస్తున్నదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాళేశ్వరం కోసం మేం ఆర్ఈసీ, పీఎఫ్సీ నుంచి రుణాలు తెచ్చినం. ఎఫ్ఆర్బీఎం కంటే అదనంగా ఉన్నదని కేంద్రం రికవరీ పెట్టింది. ఏపీకి మాత్రం ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి రుణాలు తెచ్చుకొనే అవకాశం ఇచ్చింది. తెలంగాణ పట్ల బీజేపీకి ఎందుకింత కక్ష. సవతి తల్లి ప్రేమ? తెలంగాణ భారతదేశంలో భాగంగా కాదా? పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. బాగానే ఉన్నది. కానీ, మా కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరు? పోలవరానికి రూ. 80 వేల కోట్లు, బనకచర్లకు రూ.80వేల కోట్లు.. అంటే లక్షా 60 వేల కోట్లు ఏపీకి ఇస్తరు. ఇందులో ఒక శాతం అయినా తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చారా? సమక సాగర్, డిండి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వరు. కానీ, పక రాష్ట్రానికి నిధుల వరద పారిస్తున్నరు. సీనియర్ మంత్రి కిషన్‌రెడ్డి చొరవ చూపాలి. ప్రాజెక్టును అడ్డుకోవాలి. లేదంటే అఖిలపక్షాన్ని తీసుకువెళ్లి బనకచర్ల ప్రాజెక్టును ఆపించాలి. లేదంటే ఢిల్లీలో సీడబ్ల్యూసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తాం. కేంద్ర ద్వంద్వనీతిని ఢిల్లీ వేదికగా ఎండగడతాం. కిషన్రెడ్డీజీ.. ఆల్ పార్టీ డెలిగేషన్ను మోదీ దగ్గరకు తీసుకెళ్లండి. పదవిలో ఉండటం ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. పదవిలో ఉండే అర్హత మీకు లేదు. జీరో పర్మిషన్ ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇస్తారు’ అని హరీశ్‌రావు నిలదీశారు.
చంద్రబాబు ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక లేఖలు రాశారు. 2018లో కేంద్ర జలవనరుల శాఖకు, అపెక్స్ కౌన్సిల్ లేఖ రాశారు. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా, విభజన చట్టం ఉల్లంఘిస్తూ కాళేశ్వరం కడుతున్నారని అడ్డుకోవాలని పేరొన్నారు. భక్త రామదాసు లిఫ్టు ఆపేందుకు లేఖ రాశారు. పాలమూరు సహా 20, 30 ప్రాజెక్టులు అడ్డుకోవాలని లేఖలు రాశారు. చివరికి గ్రీన్ ట్రిబ్యునల్‌లో కూడా కేసులు వేశారు.
కృష్ణాలో వాటా కోసం కేసీఆర్ పోరాటం చేసి సెక్షన్ 3 ద్వారా కొత్త ట్రిబ్యునల్ సాధించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. గోదావరి మీద కూడా భవిష్యత్తులో కొత్త ట్రిబ్యునల్ వస్తదని భావించి ప్రాణహితకు 160 టీఎంసీలు, కాళేశ్వరానికి 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినట్టు చెప్పారు. దేవాదులను 38 నుంచి 60 టీఎంసీలకు, సీతమ్మ సాగర్‌కు 67, సమ్మకసాగర్కు 47 టీఎంసీలు, చనా ఖా కొరాటాకు 5, వార్దాకు 5 టీఎంసీలు.. మొత్తం 969 టీఎంసీల్లో 950 టీఎంసీలు కేటాయించినట్టు వెల్లడించారు. గోదావరి ట్రి బ్యునల్ ఒక అవార్డు ఇచ్చిందని, పోలవరం ద్వారా 80 టీఎంసీల నీళ్లను కృష్ణాకు తరలిస్తే తెలంగాణకు 45, కర్ణాటకకు 25, మహారాష్ట్రకు 14 టీఎంసీలు కేటాయించాలని చెప్పిందని అన్నారు. ఏపీ పట్టిసీమ ద్వారా నీళ్లు మళ్లి స్తే, కర్ణాటక వాళ్లు 25 టీఎంసీలు ఇవ్వాలని సీడబ్ల్యూసీని కోరితే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించారని చెప్పారు. మహారాష్ట్ర అడిగితే 14 టీఎంసీలు, అదే పద్ధతిలో తెలంగాణకు 45 టీఎంసీలు కేటాయించారని తెలిపారు. వాటిని పాలమూరు ప్రాజెక్టుకు కేటాయించుకుంటామని చెప్తే డీపీఆర్ వాపస్ పంపారని, కర్ణాటక, మహారాష్ట్రకు ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా? అని నిలదీశారు. తెలంగాణకు బీజేపీ చేస్తున్న ద్రోహానికి ఇదో ఉదాహరణ అని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు తీసుకెళ్లబోతున్న 200 టీఎంసీల్లో 112 టీఎంసీలు, పాతవి 45 టీఎంసీలు మొత్తం 150పైగా టీఎంసీలు అని, అవి వస్తే డిండికి, పాలమూరుకు, కల్వకుర్తికి నికర జలాలు కేటాయించవచ్చని, దీనిపై రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నిస్తలేదని నిలదీశారు. పోతిరెడ్డిపాడు పొక పెద్దగా చేస్తే పోరాడింది బీఆర్ఎస్, పీజేఆర్ అని, హారతులు పట్టింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని ఆక్షేపించారు. ఇప్పుడు గోదావరి జలాలు తరలిస్తుంటే హారతులు పడుతున్నది రేవంత్‌రెడ్డేనని, నాడైనా, నేడైనా తెలంగాణ పాలిట కాంగ్రెస్ శాపంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.
అందుబాటులో ఉన్న నీటిని వాడుకోలేని చేతగాని ప్రభుత్వం వల్ల ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌లో పంటలు ఎండాయని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఏడాదిన్నరలో ఒక ప్రాజెక్టు కట్టలేదు. ఒక ఎకరాకూ అదనంంగా నీళ్లు ఇవ్వలేదు. పెద్దవాగు కొట్టుకుపోయింది. వట్టెంపంపు హౌస్ మునిగింది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలింది. ఏపీ సర్కారు శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు వేగవం తం చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. లైనింగ్ చేస్తే 90 వేల క్యూసెకులు పోతయి. ఇప్పుడు 40 వేల క్యుసెకులు పోతున్నయ్. వీటిని కాంగ్రెస్ నిలువరించలేకపోతున్నది. కేఆర్ఎంబీ పని చేయదు. రాష్ట్ర ప్రభుత్వం అడగదు. కృష్ణాలో తాతాలిక ఒప్పందం ప్రకారం 34 శాతం నీటి కేటాయింపులు ఉన్నయి. కానీ, రేవంత్ చేతగానితనం వల్ల తెలంగాణ 65 టీఎంసీల నీళ్లను తకువ వాడుకున్నది. 27 శాతం మాత్రమే వాడుకున్నది’ అని హరీశ్‌రావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తున్నదని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ విషయంపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేయాలని సూచించారు. తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో గట్టిగా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి అధికారులతో ఉత్తరాలు రాసి చేతులు దులుపుకొంటే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని, చరిత్రహీనులుగా మారిపోతారని హరీశ్‌రావు హెచ్చరించారు.