Harish Rao | హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): ‘ఇంతకుముందు రైతు బంధును బిచ్చం అన్నవు. ఇప్పుడు రైతు భరోసాను చిల్ల ర పంచాయితీ అంటున్నవు. సంక్రాంతికి ఇస్తానన్న సంగతి తేలిపోయింది.. చబ్బీస్ (26) జనవరి చేదు మాత్రనే అయ్యింది. ఇప్పుడు మార్చి 31 దాకా గడువు పెంచినవు. జర్నలిస్టు లు ఇదేమని అడిగితే, చిల్లర పంచాయితీ అం టున్నవు. అప్పుల పాలవుతున్న రైతుల ఆవేదనను పకనబెట్టి మీ ప్రచారం వినాలా? రైతు ల అప్పులు ముఖ్యమా? దావోస్ డప్పులు ముఖ్యమా?’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు.
‘మీ సెల్ఫ్ డబ్బాకు, మీ వెకిలి సెటైర్లకు కాలం చెల్లింది. ఇకనైనా కండ్లు తెరువు రేవంత్‌రెడ్డీ. నీలో అటెన్షన్ డిక్రీసింగ్ డిజార్డర్ మొదలైంది. నీ మాటలను ఎవరూ నమ్మడం లేదనే ఆందోళన పెరిగిపోయింది. మంచి మా నసిక వైద్యుడిని సంప్రదించడం మంచిది’ అని హితవుపలికారు.
దావోస్ పెట్టుబడుల కథ అట్టర్‌ఫ్లాప్ అయిందని, రేవంత్ ఎన్ని ముచ్చ ట్లు చెప్పినా? కథలు చెప్పినా? తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని స్పష్టంచేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్ ఎలా ఉన్నదంటే పెట్టుబడుల కట్టుకథను నమ్మించేందుకు శతవిధా లా ప్రయత్నించి అట్టర్‌ఫ్లాప్ అయినట్టు ఉన్న ది’ అని ఎద్దేవా చేశారు. ‘మీ ప్రెస్ రిలీజులు, మీ మీడియా కవరేజీలు, మీ ఈనో స్టోరీలను ఎవరూ నమ్మడం లేదని ప్రెస్‌మీట్ పెట్టినవు. ఎప్పుడో అయిపోయిన దావోస్‌కు ఇప్పుడెందుకు దావతు? దావోస్‌లో జరిగే ఎంవోయూలన్నీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే.
ఎవరైనా ఓపెన్ టెండర్లో రావాల్సిందే అని ఆర్థికమంత్రి భట్టి అంటే నువ్వేమో లక్షా 82 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టు గప్పాలు కొడుతున్నవు. మరి భట్టి చెప్పింది నిజమా? నీ మాటలు నిజమా రేవంత్‌రెడ్డీ?’ అని మంగళవారం ఎక్స్ వేదికగా నిలదీశారు. ‘పొంతన లేకుండా నువ్వు చెప్పిన కంపెనీలు, పెట్టుబడుల లెకలు యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించింది. అంతా డొల్ల ప్రచారమని తేలిపోయింది’ అని విమర్శించారు.
గోండుల సంసృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన నాగోబా జాతర మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న సందర్భంగా గిరిజనులకు హరీశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో అంబరాన్నంటే ఆదివాసీ సంబురం దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా నిలవడం తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.
దేవుళ్లకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని హరీశ్ విమర్శించారు. ధూప దీప నైవేద్యాలకు నిధులను రెండు నెలలుగా ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పైసల్లేక పూజారులు ఉద్దెరకు పూజాసామగ్రి తీసుకొచ్చి పూజలు చేస్తున్నారని వాపోయారు. రెండు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధూపదీప నైవేద్యం నిధులు రావడం లేదని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు.