హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగుతున్నది కాంగ్రెస్ పాలన కాదని, బీజేపీ-టీడీపీ రిమోట్ పాలన అని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్లస్ కూటమి విషపు పాలన నడుస్తున్నదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి బాబు, బీజేపీతో ఉన్న చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. గోదావరి-బనకచర్ల విషయంలో రేవంత్‌రెడ్డి తెలంగాణకు మరణశాసనం రాసే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉన్నంతవరకు, బీఆర్ఎస్ ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరిగితే సహించం గాక సహించమని గర్జించారు.
బుధవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించారు. చర్చకు పిలిచి మొహం చాటేసిన విషయం దగ్గరి నుంచి ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించిన అంశాల వరకు తూర్పారబట్టారు. చర్చకు పిలిచి పారిపోయిన చరిత్ర సీఎం రేవంత్‌రెడ్డిదని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఈ మధ్య రేవంత్‌రెడ్డి చర్చకు రమ్మని సవాల్ విసిరితే.. అందుకు స్పందించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వెళ్తే.. చర్చకు రాకుండా రేవంత్ మొహం చాటేశారని విమర్శించారు.
ఢిల్లీ సమావేశానికి సీఎం హాజరుకావడమే తప్పు. సమావేశానికి హాజరైందే కాకుండా కమిటీ వేయడానికి ఒప్పుకొని, ఆ కమిటీ నిర్ణయమే శిరోధార్యం అన్నట్టుగా సీఎం పేర్కొనడం దారుణం. కమిటీ ఒకవేళ గోదావరి-బనకచర్ల కట్టాలని చెప్తే ఒప్పుకుంటానని అనడమే సీఎం రేవంత్ ఉద్దేశమా?
-హరీశ్‌రావు
బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టింది ఎక్కడ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘మేం క్లబ్బులకు, పబ్‌లకు, ఫైవ్‌స్టార్ హోటళ్లకు రాం’ అని బిల్డప్ ఇచ్చిన రేవంత్ ప్రెస్‌మీట్ పెట్టింది ఎక్కడ? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఢిల్లీలో తెలంగాణభవన్, సీఎంకు అధికారిక నివాసం ఉండగా అక్కడెక్కడా ప్రెస్‌మీట్ పెట్టకుండా 7 స్టార్ హోటల్ అయిన లీలా ప్యాలెస్‌లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. స్టార్ హోటల్స్‌కు సీఎం దూరమే అయితే లీలా ప్యాలెస్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఎలా పెట్టారని నిలదీశారు. ముఖ్యమంత్రి మాటలకు, చేతలకు పొంతనే ఉండదని విమర్శించారు.
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన లీకులు, ఝలక్‌లు ఏమయ్యాయని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు పెట్టిన మీటింగ్‌కు పోయేదే లేదని, ఆ సమావేశాన్ని బహిష్కరిస్తామని లీకులు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి అర్థరాత్రి పరుగుపరుగున ఢిల్లీకి ఎందుకుపోయారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుతో కుదిరిన చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వ్యవహారం గతంలోనూ ఇలాగే ఉన్నదని, అసెంబ్లీ సాక్షిగా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లబోమని, బహిష్కరిస్తామని చెప్పిన రేవంత్.. ఎవరూ రాకముందే పరుగుపరుగున పోయి ముందుసీట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఊసరవెల్లి కన్నా వేగంగా రేవంత్ రంగులు మారుస్తారని విమర్శించారు.
అబద్ధం ఆడినందుకు, రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించినందుకు బేషరతుగా చెంపలేసుకొని క్షమాపణలు చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ బనకచర్ల ప్రాజెక్టుకు ఒప్పుకోదని స్పష్టంచేశారు. గోదావరిలో వరదజలాలు లేవని, ఒకవేళ ఉంటే మన రాష్ట్ర వాటా తేల్చాలని కోరారు. ప్రొరాటా ప్రకారం తెలంగాణకు 1,950 టీఎంసీలు రావాలని కేసీఆర్ ముందే చెప్పారని గుర్తుచేశారు. గోదావరి-బనకచర్లలో ఇంకో కుట్ర కూడా దాగి ఉన్నదని, గోదావరి జలాలే కాకుండా కృష్ణా జలాలను కూడా తరలించుకుపోయే కుట్ర ఉన్నదని ఆరోపించారు. నాగార్జునసాగర్ కుడికాలువను సున్నా నుంచి 80 కిలోమీటర్ వరకు డబుల్సైజ్ చేయనున్నట్టు ప్రీ ఫీజబులిటీ రిపోర్టులో పొందుపర్చారని, దీనిద్వారా 150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న బొల్లపల్లి రిజర్వాయర్‌ను నింపుకుంటారని చెప్పారు.
నాగార్జునసాగర్‌లో ఎప్పుడైనా వరదనీరు వస్తే, బొల్లపల్లి రిజర్వాయర్‌ను నింపుకోవాలని ఆ రిపోర్టులో పేర్కొన్నట్టు తెలిపారు. దీనిపై ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం మాట్లాడటంలేదని విమర్శించారు. ‘కష్ణా నదిలో నీళ్లు వస్తే కృష్ణా నీళ్లు, అవి రాకుంటే గోదావరి నీళ్లు.. ఇదైతే ఇది.. అదైతే అది’ అనే విధంగా ఏపీ ప్రభుత్వం కృషిచేస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. అయినా సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కమిటీ రిపోర్టును శిరసావహిస్తామని చెప్తున్నారని దుయ్యబట్టారు.
‘మనం ఒప్పుకున్న కమిటీ కదండీ, మనం ఒప్పుకోవాల్సిందే’ అని స్వయంగా రేవంత్‌రెడ్డే చెప్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. దీనినిబట్టి ఒకవేళ నీళ్లు తీసుకోవాలని కమిటీ రిపోర్ట్ ఇస్తే ఒప్పుకోవడమేనా? అని ప్రశ్నించారు. బీజేపీ, చంద్రబాబు కలిసే ఉన్నారని, నేడు కేంద్ర ప్రభుత్వం ఆయన (చంద్రబాబు) సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అంటున్నదని చెప్పారు. మనం అవసరమైతే ప్రజాపోరాటలకు శ్రీకారం చుట్టాలని, అవసరమైతే సుప్రీంకోర్టుకు పోవాలని పేర్కొన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొనిపోతే వెంట వస్తామని బీఆర్ఎస్ పార్టీ ముందే చెప్పిందని తెలిపారు.
‘తెలంగాణ హక్కులను కాపాడటానికి బీఆర్ఎస్కు భేషజాలు లేవు. మీతో కలిసిరావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కలిసొస్తాం మీతోని’ అని ఇదివరకే ప్రభుత్వానికి స్పష్టంచేశామని గుర్తుచేశారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే తప్ప రాజకీయాలు ముఖ్యం కాదని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంచేసిందని గుర్తుచేశారు. కానీ, సీఎం మాత్రం చంద్రబాబు ప్రయోజనాల కోసం, గురుదక్షిణ చెల్లించడం కోసం పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన డొల్లతనం ఇవాళ బయటపడిందని, ఆయన వైఖరి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయిందని చెప్పారు.
‘ఏదో సాధించామని చెప్తున్నారు. ఏం సాధించారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నది. ఈ 20 నెలల్లో పెద్దవాగు కూలిపోయింది.. ఎస్ఎల్బీసీ కుప్పకూలింది.. వట్టెం పప్పు మునిగిపోయింది.. జూరాల గేట్లు పడిపోయాయి.. ఎక్కడన్నా ఒక్క చెరువు కట్టినవా? చెక్‌డ్యాం కట్టినవా? ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చినవా? ఏం చేసినవ్? ఇంకా ఉల్టాగా చంద్రబాబుకి గురుదక్షిణ కింద కృష్ణా నదిలో మాకు 500 టీఎంసీల నీళ్లు చాలని చెప్తున్నవ్. అసలు 500 టీఎంసీల నీళ్లు చాలని చెప్పడానికి నువ్వెవరు?’ అని హరీశ్‌రావు నిలదీశారు. ‘కేసీఆర్ ఈ నీళ్ల కోసం తొమ్మిదేండ్లు పోరాడారు. రాష్ట్రం ఏర్పడిన 42 రోజుల్లోనే కేంద్రం వద్దకు వెళ్లి కృష్ణా నదిపై సెక్షన్-3 కింద ట్రిబ్యునల్ వేయాలని, మాకు 763 టీఎంసీల నీళ్లు రావాలని పోరాడారు. దీనిపై సుప్రీంకోర్టుకు పోయారు.. ప్రధానమంత్రిని కలిశారు.
కాలుకు బలపం కట్టుకొని తిరిగి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారు. కేసీఆర్ పోరాటంతో వచ్చిన సెక్షన్-3పై ఇప్పటికీ వాదనలు జరుగుతున్నాయి. మరో ఐదారు నెలల్లో వాదనలు పూర్తయి ట్రిబ్యునల్ అవార్డు వస్తుంది. ఈ అవార్డు వస్తే, తెలంగాణకు 700-800 టీఎంసీల నీళ్లు వస్తాయి. ఒకవైపు మన నీటిపారుదల శాఖ ఇంత మంచి వాదనలు వినిపిస్తుంటే.. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం 500 టీఎంసీలు చాలంటున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 575 టీఎంసీలు చాలని చెప్తున్నారు. ఒకవైపు ఇరిగేషన్ శాఖ 763 అడుగుతుంటే, సీఎం 500 టీఎంసీలు, నీళ్ల మంత్రి 575 చాలంటున్నారు. ఇది మీ అవగాహనా రాహిత్యం.. మీకు చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నిదర్శనం’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
గోదావరి-బనకచర్ల అంశం అసలు ఎజెండాలోనే లేదన్నట్టుగా, బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు తూర్పారబట్టారు. ‘కడతామనే విషయం ఎజెండాలో లేనప్పుడు ఆపమనే ముచ్చటేరాదు’ అని రేవంత్‌రెడ్డి ఎట్లా అంటారని మండిపడ్డారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో మొదటి పాయింటే గోదావరి-బనకచర్ల అంశమని ఉన్నా, రేవంత్ అసలు అది అంశమే కాదన్నట్టుగా వ్యవహరించారని మండిపడ్డారు. ఏపీ మంత్రి రామానాయుడు, సీఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా మాట్లాడిన అంశాలను హరీశ్‌రావు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఏపీ మంత్రి మాట్లాడిన తరువాత అయినా సీఎం రేవంత్ జాగ్రత్తపడాల్సి ఉండెనని, అలా కాకుండా మీడియా సమావేశంలో ఇష్టారీతిగా అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
‘కడతమని ప్రతిపాదన వస్తే కదా.. ఆపమనే చర్చ జరిగేది’ అని సీఎం రేవంత్‌రెడ్డి అంత నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడతారని హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటేనా.. అది? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సోమవారానికి కల్లా కమిటీ ఏర్పడుతుంది. నెలరోజుల్లోగా కమిటీ రిపోర్టు ఇస్తుంది’ అని ఏపీ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు చెప్తే, రేవంత్‌రెడ్డి మాత్రం అసలు చర్చే జరగలేదని చెప్తూ ఎవరిని మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రేవంత్‌ను ప్రజలు ఎన్నుకున్నారని, ‘ఆంధ్రాకో, చంద్రబాబుకో అప్పజెప్పడానికో.. కట్టబెట్టడానికో.. నీ గురుదక్షణ చెల్లించుకోవడానికో కాదని హెచ్చరించారు. నిజం నిప్పులాంటిదని, రేవంత్ దాచాలని చూసినా దాగదని స్పష్టంచేశారు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ‘రేవంత్‌రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి. చంద్రబాబుకు గురుదక్షణ చెల్లించుకునేందుకు మాట్లాడితే.. పక్కన ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అయినా సోయి ఉండాలె కదా! నిజాయితీగా చెప్పాలి కదా!’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఢిల్లీ సమావేశానికి సీఎం హాజరుకావడమే తప్పు అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు. సమావేశానికి హాజరైందే కాకుండా కమిటీ వేయడానికి ఒప్పుకొని, ఆ కమిటీ నిర్ణయమే శిరోధార్యం అన్నట్టుగా సీఎం పేర్కొనడం దారుణమని మండిపడ్డారు. కమిటీ ఒకవేళ గోదావరి-బనకచర్ల కట్టాలని చెప్తే ఒప్పుకుంటానని అనడమే సీఎం రేవంత్ ఉద్దేశమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేతిలో కేంద్రం ఉన్నదని, బాబు ఒత్తిడి పెంచి రిపోర్టు తెప్పిస్తే దానికి ఒప్పుకుంటానని ఎట్లా చెప్తావని నిలదీశారు. కమిటీ ఇచ్చే నివేదికతో రాష్ర్టానికి నష్టం జరిగితే పోరాటం చేస్తననో, సుప్రీంకోర్టుకు వెళ్తననో చెప్పాల్సిన సీఎం ఒప్పుకుంటా అన్నట్టుగా తలూపడం దుర్మార్గమని మండిపడ్డారు.
గోదావరి-బనకచర్లను ఎంజెడాలో పెట్టి సమావేశం నిర్వహించడమే తప్పు అయితే, దానికి సీఎం రేవంత్ హాజరుకావడం మరో తప్పు అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కేంద్రం ఈ సమావేశాన్ని నిర్వహించడం ముమ్మాటికీ తప్పు అని కుండబద్దలుకొట్టారు. నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థలు గోదావరి-బనకచర్ల ప్రతిపాదనను నిర్దద్వంద్వంగా విసిరికొడితే సమావేశం ఎట్లా పెడతారని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర అటవీ-పర్యావరణ శాఖలు గోదావరి-బనకచర్ల టీవోఆర్ కూడా ఇవ్వకుండా తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘పోలవరం ప్రాజెక్టు అనుమతలు అన్నీ తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తెలంగాణ కాన్సెంట్ కావాలి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జీఆర్ఎంబీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఇవన్నీ లేకుండా గోదావరి-బనకచర్లకు అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని నాలుగు సంస్థలు విసిరికొడితే.. ఈ సమావేశం నిర్వహించడం, రేవంత్ వెళ్లడం, కమిటీ చెప్పినట్టు వింటా అని తలూపి సంతకం పెట్టి రావడం ఏమిటి?’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కడతమని ప్రతిపాదన వస్తే కదా.. ఆపమనే చర్చ జరిగేది అని సీఎం రేవంత్‌రెడ్డి అంత నిస్సిగ్గుగా ఎట్లా మాట్లాడతారు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటేనా.. అది?
-హరీశ్‌రావు
తెలంగాణకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ సహించదుగాక సహించదని, రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకోదని హరీశ్‌రావు హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయని మండిపడ్డారు. అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేయాల్సిందిపోయి ఇలాంటి సమావేశానికి సీఎం ఎట్లా హాజరవుతారని ప్రశ్నించారు. ‘పొద్దుగాల పోను అన్నోడు.. పొద్దూకి ఎందుకు పోయిండో’ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పాల్గొనాలని ఒత్తిడి చేసిందెవరో చెప్పాలని నిలదీశారు. ‘బీజేపీ ఒత్తిడి పనిచేసిందా? బాబు ఒత్తిడి పనిచేసిందా? ఏ ఒత్తిడి మీద మీటింగ్‌కు వెళ్లావ్? ’ అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బాయ్‌కాట్ చేస్తానని చెప్పిన రేవంత్‌కు బీజేపీ, బాబుతో ఉన్న ‘భాయ్..భాయ్’ రాజకీయాలేందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ చీకటి ఒప్పందంలో ఈ రహస్య సమావేశానికి వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు.
తెలంగాణ సాగునీటి ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హరీశ్‌రావు హెచ్చరించారు. ‘నీళ్ల విషయంలో నిజాయితీ ప్రదర్శించు.. లేకపోతే తెలంగాణ ప్రజలు అవే నీళ్లలో నిన్ను ముంచుతరు.. జాగ్రత్త’ అని సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. బనకచర్ల ప్రాజెక్టును అందరూ వ్యతిరేకిస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం ఎందుకు పరుగులు పెడుతున్నారు? ఢిల్లీలో కమిటీల నిర్ణయాన్ని శిరసావహిస్తానని ఎందుకు అంగీకరించారు? అని నిలదీశారు. ‘ఇది రాష్ట్ర ద్రోహం కాదా? ఇప్పుడు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి. ఈ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే మిస్టర్ రేవంత్‌రెడ్డి..’ అని ఘాటుగా విమర్శించారు.
‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నింటినీ కేఆర్ఎంబీకి అప్పగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కేసీఆర్ బయటికొచ్చి గర్జించి.. పదేండ్లు నేను కాపాడితే నువ్వు ఎట్లా ఇస్తవని నిలదీశారు. కృష్ణాలో నీటి వాటాల పంపకం తేలేవరకు, ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు ప్రాజెక్టులను అప్పగించేది లేదని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టులను మన అజమాయిషీలో ఉంచుకున్నది. వీళ్లు రాగానే ఢిల్లీకి వెళ్లి అన్ని ప్రాజెక్టులు అప్పగిస్తమని సంతకం పెట్టి వచ్చారు. ప్రాజెక్టులను అలా ఎలా అప్పగిస్తరని బీఆర్ఎస్ పోరాడితే, కేసీఆర్ గర్జిస్తే.. అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి అదంతా తప్పు.. తూచ్.. తెల్వక చేసినం.. అని చెప్పారు. ఇలా తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించడం తప్ప ఇంతకుమించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిందేమిటి?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘రాష్ట్రం కొత్తగా ఏర్పడినా, రెండేండ్లు కరోనా ఉన్నా 17.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తీసుకొచ్చినం. 30 లక్షల ఎకరాలకు పైగా స్థిరీకరణ చేశాం. ఇలా దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం 48 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చింది. మరి నువ్వు చేసిందేమిటి? కూలిపోవుడు, తెగిపోవుడు తప్ప చేసిందేమిటి?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప సాగునీటి రంగంలో కాంగ్రెస్ సర్కారు సాధించింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. నోటి తీట తప్ప.. నీటి వాటా సాధించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా.. మార్పు తెస్తా అని చెప్పిన రేవంత్‌రెడ్డి కొన్ని మార్పులు మాత్రం తెచ్చారు.. అవి నీళ్లు చంద్రబాబుకు… నిధులు రాహుల్‌గాంధీకి. ఆపాయింట్మెంట్ మాత్రం అదిత్యాదాస్ లాంటి తెలంగాణ ద్రోహులకు. ఇదే కదా నువ్వు తెచ్చిన మార్పు’ అని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
‘గోదావరి బనకచర్లపై చర్చ జరిగిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నరు. అసలు చర్చనే జరగలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. ఇంకా స్పష్టతలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నరు. ఏమిటిది..? ఉత్తమ్‌ది ఓ మాట.. రేవంత్‌రెడ్డిది ఇంకో మాట, ఆంధ్రప్రదేశ్ మంత్రిది మరో మాట’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణకు సాగునీటిరంగంలో తీరని ద్రోహం చేసిన అధికారిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పెట్టుకోవడం ఏమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడుగడుగునా అడ్డుపడ్డ వ్యక్తి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను అక్రమంగా నిర్మించుకోవడానికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి కోర్టులను తప్పుదోవ పట్టించిన వ్యక్తిని తెచ్చి ఈ రాష్ట్ర సలహాదారుగా పెట్టుకోవడం ఏమిటని నిలదీశారు. రాష్ట్రంలో పేరుకే రేవంత్ పాలన.. పదవులను నిర్ణయించేది చంద్రబాబు అని దుయ్యబట్టారు. అనేక సందర్భాల్లో బాబు చెప్పగానే రేవంత్‌రెడ్డి అపాయింట్మెంట్లు ఇచ్చారని ఆరోపించారు.
ఇప్పటికీ తెలంగాణ ద్రోహులకు, ఆంధ్ర ప్రాంతానికి చెందినవారికి పదవులు ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో సైతం బాబు మాటలను రేవంత్ శిరసావహిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. చంద్రబాబును విమర్శించాల్సింది పోయి కేసీఆర్‌ను విమర్శించడమే రేవంత్‌రెడ్డి పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇటీవల రెండుసార్లు రేవంత్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారని, అందులో ఆంధ్రప్రదేశ్ ఏరకంగా తెలంగాణకు అన్యాయం చేస్తున్నదో, ఏరకంగా చంద్రబాబు తెలంగాణ నీటి హక్కులను కొల్లగొడుతున్నారో చూపించాల్సింది పోయి, పేగులు తెగే వరకు కొట్లాడి తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను విమర్శించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పీపీటీలో అవాస్తవాలు, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
తెలంగాణకు అన్యాయం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌పై పోరాడిల్సింది పోయి తెలంగాణ సాధించిన కేసీఆర్ మీద పోరాటం చేయడం ఏమిటని నిలదీశారు. కేవలం కేసీఆర్ మీద ఉన్న అక్కసును వెల్లగక్కుతున్నారని, నిజాయితీగా తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం సీఎం రేవంత్ చేయడం లేదని ఆరోపించారు. ఏపీలో కూటమి పాలన నడిస్తే.. తెలంగాణలో రేవంత్ ప్లస్ కూటమి విష పాలన నడుస్తున్నదని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎవరి ఎజెండా కోసం ఢిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. ఏమీ సాధించకుండానే నాలుగు అంశాలను సాధించామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నారని ఎద్దేవా చేశారు.
‘గోదావరి-బనకచర్ల కమిటీ వేయుండ్రి, నెల లోపల కమిటీ రిపోర్టు ఇస్తది.. కమిటీ రిపోర్టు శిరసావహిస్తా..’ అని చెప్పి, తలూపి సంతకం పెట్టి రేవంత్ వచ్చారని ఆరోపించారు. ఇందులో సీఎం రేవంత్ చేసిందేమున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘టెలీమెట్రీ అని సీఎం రేవంత్ చెప్తున్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వరకు టెలీమెట్రీ పెట్టాం. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తర్వాత బనకచర్ల వద్ద ఉండే నాలుగు క్రాసింగ్‌ల వద్ద టెలీమెట్రీ పెట్టాలని ఆనాడే బీఆర్ఎస్ పోరాటం చేసింది’ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఇది కొనసాగే ప్రక్రియేనని కొత్తేమీ కాదని, సగానికి టెలీమెట్రీలు ఇన్స్టాల్ చేశారని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఉన్న కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విజయవాడ పంపడం విజయంగా సీఎం రేవంత్ చెప్పుకుంటున్నారని, ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లులోనే ఈ అంశం స్పష్టంగా ఉన్నదని పేర్కొన్నారు.
పొద్దుగాల పోను అన్నోడు.. పొద్దూకి ఎందుకు పోయిండో’ చెప్పాలి. సమావేశంలో పాల్గొనాలని ఒత్తిడి చేసిందెవరో చెప్పాలి. ‘బీజేపీ ఒత్తిడి పనిచేసిందా? బాబు ఒత్తిడి పనిచేసిందా? ఏ ఒత్తిడి మీద మీటింగ్‌కు వెళ్లావ్?
-హరీశ్‌రావు
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు రేవంత్‌ను ప్రజలు ఎన్నుకున్నారు. ఆంధ్రాకో, చంద్రబాబుకో అప్పజెప్పడానికో.. కట్టబెట్టడానికో.. నీ గురుదక్షణ చెల్లించుకోవడానికో కాదు. నిజం నిప్పులాంటిది. రేవంత్ దాచాలని చూసినా దాగదు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.
-హరీశ్‌రావు
సమ్మక్కసాగర్ బరాజ్ నుంచే నీళ్లు తీసుకొని వెళ్లాలని బీఆర్ఎస్ ఇంతకుముందే చెప్పిందని, అలా తీసుకొనిపోయే నీళ్లలో 50% తెలంగాణకు ఇవ్వాలని, అలా అయితే అభ్యంతరం లేదని బీఆర్ఎస్ ఇదివరకే స్పష్టంగా చెప్పిందని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ గోదావరి నది నుంచి ప్రతి నీటిచుక్కను వినియోగించుకోడానికి ప్రణాళికాబద్ధంగా కృషిచేశారని, అందులో 90% అనుమతులు సాధించినట్టు, మిగిలిన 10% ప్రాజెక్టులకు అనుమతులు సాధించి త్వరితగతిన పూర్తిచేసేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు వివరించారు. గోదావరిలో 930 టీఎంసీల నీళ్లను వాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచించి ప్రాజెక్టులు నిర్మించిందని, వాటిని సద్వినియోగం చేయాలి తప్ప కేసీఆర్‌కు పేరొస్తదనో, బీఆర్ఎస్కు పేరొస్తదనో పిచ్చిపిచ్చి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దని హితవు పలికారు.
ప్రస్తుతం టీడీపీ ఎంపీలపై ఆధారపడి బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నదని, తెలంగాణకు అన్యాయం జరిగినా రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రులు మాట్లాడటంలేదని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై తాను ఇప్పటికే కిషన్‌రెడ్డికి లేఖ రాశానని, అయన నుంచి ఇంతవరకు స్పందన రాలేదని చెప్పారు. నీళ్ల విషయంలో తెలంగాణకు ఎలా అన్యాయం జరుగుతున్నదో ప్రజలు గమనిస్తున్నారని, తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
‘టెలీమెట్రీ గురించి రేవంత్‌రెడ్డి గొప్పగా మాట్లాడుతున్నరు. అసలు ఇచ్చిన నీళ్లే వాడుకునే తెలివి లేదు. తాత్కాలిక ఒప్పందం ప్రకారం తెలంగాణకు 34% వాటా ఇచ్చారు. కానీ, గత నీటి సంవత్సరంలో 28% నీళ్లను మాత్రమే వినియోగించారు. తెలంగాణకు ఇచ్చిన వాటాలో 6% నీళ్లను వాడుకోలేని, చేతగాని, దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం’ అని హరీశ్‌రావు విమర్శించారు. ‘65 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు వదిలేసి.. తెలంగాణలో భూములను ఎండబెట్టారు. క్రాప్‌హాలీడే ఇచ్చారు.
నీళ్లు ఉండీ వాడుకోలేని చేతగానితనమా? లేక ఇది చంద్రబాబుకు గురు దక్షిణనా? 34% నీళ్లను ఎందుకు వినియోగించలేదు? నెట్టెంపాడు కింద క్రాప్‌హాలిడే ఎందుకు ఇచ్చారు? శ్రీశైలంలో వరద వస్తున్నది, పోతిరెడ్డిపాడు గేట్లు తీస్తున్నరు.. కల్వకుర్తి మోటర్ల కట్క ఎందుకు ఒత్తుతలేరు? నువ్వు కట్క ఒత్తుతవా? లేక రైతులను తీసుకొని వెళ్లి ఒత్తమంటవా? అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తే అప్పుడు వెళ్లి కల్వకుర్తి ఒత్తారు. 36 రోజులు వృథాగా పోయాయి కదా. ఒకవేళ ప్రభుత్వం 36 రోజులు ముందే నీళ్లు ఎత్తిపోస్తే నెల రోజుల ముందే నాట్లు పడేవి కదా. మన నీళ్ల వాటా మనం తీసుకునే అవకాశం ఉండేది కదా’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
‘నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పారు. కానీ, చర్చే జరగలేదని రేవంత్‌రెడ్డి బుకాయించారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు నిజాలు అర్థమయ్యాయి.. రేవంత్‌రెడ్డి అబద్ధాలు ఆడుతున్నడని..’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘గోదావరి-బనకచర్ల ఎజెండాలో ఉన్నది. దానిపై చర్చ కూడా జరిగింది. దీనిపై కమిటీ వేసిన్రు. సోమవారం కల్ల కమిటీ సభ్యులు తేలుతారు. నెలరోజుల్లో కమిటీ రిపోర్ట్ ఇస్తుంది’ అని స్పష్టంగా నిమ్మల చెప్తే.. చర్చలే జరగలేదని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చిత్తశుద్ధి ఏమిటో, ఆయన చీకటి ఒప్పందం ఏమిటో ఇవాళ రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమైందని చెప్పారు. ‘రేవంత్.. ఇంకా బుకాయించకు. రాష్ట్ర ప్రజలకు బేషరత్‌గా క్షమాపణ చెప్పు’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించొద్దని రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధం చెప్పారని హరీశ్‌రావు విమర్శించారు. అబద్ధాలను చెప్పేందుకే వాళ్లను వాడుకున్నారని ఆరోపించారు. వాళ్లు రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డారని, అలాంటి వారి నుంచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అభిప్రాయాలు అడగాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. ‘నిపుణులు, అనుభవజ్ఞలు ఉన్నారు. ఎవర్నీ అడగకుండా ఎందుకు పోతున్నవ్? కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, పర్యావరణ శాఖలు గోదావరి-బనకచర్ల డీపీఆర్‌ను తిరస్కరిస్తుంటే.. నువ్వు మీటింగ్‌కు ఎందుకు పోతున్నవ్? పరిగెత్తి పరిగెత్తి కమిటీలు ఎందుకు వేస్తున్నవ్? ఆ కమిటీల నిర్ణయాన్ని శిరసావహిస్తానని ఎందుకు అంగీకరిస్తున్నవ్? ఇది రాష్ట్ర ద్రోహం కాదా? ఇప్పుడు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టాలి? ఈ ద్రోహానికి పాల్పడ్డందుకు నిన్ను ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే మిస్టర్ రేవంత్‌రెడ్డి..’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి గత సంవత్సరం జూలై 6న ఏపీ సీఎం చంద్రబాబును ప్రగతిభవన్‌కు పిలిచి విభజన సమస్యలపై కూర్చొని మాట్లాడుకొని పరిష్కరిస్తమని చెప్పారు. ఈరోజు జూలై 16. అంటే ఏడాదిపై 10 రోజులైంది.. మరి ఒక్కటైన పరిష్కరించావా?’ అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆ రోజు బయటకు చెప్పింది విభజన సమస్యలు.. కానీ, లోపల జరిగింది చీకటి ఒప్పం దం అని దుయ్యబట్టారు. గోదావరి-బనకచర్లకు ఆరోజే బీజం పడిందని పేర్కొన్నారు. ఈరోజు కూడా కమిటీకి ఓకే చెప్పి తెలంగాణకు అన్యాయం చేశావని విమర్శించారు. ‘ప్రజలకు అన్ని విషయాలు తేటతెల్లం అయ్యాయి.
ఏపీ మంత్రి నిమ్మల కుండబద్దలు కొట్టినట్టు గోదావరి-బనకచర్లపై చర్చ జరిగిందని స్పష్టంగా చెప్పారు. అధికారిక ఎజెండాలో గోదావరి-బనకచర్ల అంశ మే మొదటి అంశంగా ఉన్నది. కానీ, రేవంత్‌రెడ్డి మాత్రం చర్చ జరగలేదని బుకాయిస్తున్నరు. చర్చనే జరగనప్పుడు ఆపాలనే విషయం ఎందుకొస్తదని అంటున్నరు. ఇప్పటికైనా నిజాయితీగా చెప్పు… అబద్ధం చెప్పినందుకు, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు, ఎజెండాలో బనకచర్ల అంశమే లేదని తప్పుడు మాటలు చెప్పినందుకు తెలంగాణ ప్రజలకు బేషరతుగా చెంపలేసుకొని, క్షమాపణలు చెప్పు’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ప్రతిపాదనే రానప్పుడు..‘వాళ్లు (ఏపీ) గోదావరి బనకచర్ల విషయంలో ‘కడతమని అడిగితే కదా.. మేం ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్లు కడతమనే ప్రతిపాదన చర్చకు రానప్పుడు. అపమనే చర్చనేరాదు.
-సీఎం రేవంత్‌రెడ్డి
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లేవనెత్తిన కృష్ణా, గోదావరికి సంబంధించిన అంశాల మీద.. ఈరెండింట్లో టెక్నికల్ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ టెక్నికల్ ఇష్యూస్‌ను ముందుగా పరిష్కారం చూపే విధంగా ఒక కమిటీని వేసి నిర్ణయం తీసుకోవాలని, పోలవరం-బనకచర్ల, కృష్ణా, గో దావరి ఇష్యూస్.. ఈ రెండు ఇష్యూస్ మీద సమావేశం జరిగింది. టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లతో కలిపి కమిటీలు వేయాలని నిర్ణయం జరిగింది.
-రామానాయుడు, ఏపీ మంత్రి