హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): పాత తేదీ (ఈ ఏడాది అక్టోబర్ 10)తో ఇప్పుడు లేఖ రాయడం తప్ప, ఆంధ్రా సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నదా? లేదా? అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. ‘గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రెస్‌లో ఉన్నదని, ప్రాసెస్ చేస్తున్నామని స్పష్టం చేస్తూ.. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్పాటిల్ గత నెల 23న సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. ఇదే విషయంపై ఈ నెల 11న తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్లో నిలదీశాను. ఇప్పటివరకు ప్రభుత్వంలో ఎలాంటి కదలికా లేదు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర మంత్రికి ఇప్పటికీ సీఎం లేఖ రాయకపోవడం తెలంగాణ ప్రజలను మోసంచేయడమేనని విమర్శించారు. ఈ నెల 6న ఏపీ సర్కారు డీపీఆర్ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి, దొడ్డిదారిలో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నప్పటికీ, దాన్ని అడ్డుకోవాలని కోరుతూ, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రికి సీఎంగానీ, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిగాని ఇప్పటివరకు ఎందుకు లేఖ రాయలేదని నిలదీశారు. తెలంగాణ ఇరిగేషన్ సెక్రెటరీకి సైతం లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు.
పాత డేట్‌తో ఉత్తరం రాస్తే ఏం లాభం?
ఒకవైపు ఏపీ సర్కారు అక్రమంగా బనకచర్ల ప్రాజెక్టు పనులు వేగంగా సాగిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాత తేదీలతో లేఖలు రాస్తూ, తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. గోదావరి జలాలను వరద జలాల పేరుతో తరలించేందుకు ఏపీ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో రేవంత్ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తున్నదని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు మొదలు డీపీఆర్‌కు టెండర్లు ఆహ్వానించే వరకు ప్రతిసారీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, నిద్ర లేపుతూ వచ్చిందని స్పష్టంచేశారు.
నీటి హక్కులను కాలరాస్తున్న ఏపీ
బనకచర్ల ద్వారా తెలంగాణ నీటి హకులను కాలరాసే కుట్రలకు ఏపీ పాల్పడుతున్నదని, బీఆర్ఎస్ ఎన్నిసార్లు ముల్లుకర్రతో పొడిచినా, రేవంత్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడటంలేదని హరీశ్‌రావు దుయ్యబట్టారు. తెలంగాణభవన్‌లో ఈ నెల 11న ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వాన్ని తాను నిలదీస్తే, మూడు రోజుల తర్వాత నెమ్మదిగా నిద్రలేచి పాత తేదీతో లేఖ విడుదలచేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ నిలదీసిన ప్రతిసారీ.. లేఖలు రాయడం, మమ అనిపించడం, ఆ తర్వాత చేతులు దులుపుకోవడం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు కోసం ఏపీ కుట్రలు చేస్తున్నప్పటికీ, చోద్యం చూడటం తప్ప బనకచర్లను నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిన కృషి ఏమీలేదని విమర్శించారు.
పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలు
బనకచర్లపై పొరుగు రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వారి డిమాండ్లు, అభ్యంతరాలను స్పష్టంగా కేంద్రానికి తెలిపాయని, కానీ, తెలంగాణ సర్కారు మాత్రం అభ్యంతరాలను తెలుపకుండా మౌనం పాటించడం వెనుక ఆంతర్యమేమిటని హరీశ్‌రావు ప్రశ్నించారు. కర్ణాటక కాంగ్రెస్, ఆంధ్రా టీడీపీ, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంటే, సీఎం రేవంత్‌రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని విమర్శంచారు. 22 నెలల్లో 55 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డికి.. ఏనాడూ తెలంగాణ నీటి ప్రయోజనాలు గుర్తుకు రాకపోవడం మన దౌర్భాగ్యమని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి.. ఇప్పటికైనా కండ్లు తెరిచి, కుళ్లు రాజకీయాలు మానేసి, తెలంగాణ ప్రయోజనాల కోసం అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలని, తెలంగాణ నీటి హకులు కాపాడటం కోసం న్యాయ పోరాటానికి సిద్ధపడాలని కోరారు.