Harish Rao | సిద్దిపేట, జనవరి 22( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజలు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టాలి? దరఖాస్తు పెట్టిన ప్రతిసారీ రూ.30, రూ.40 ఖర్చు అవుతున్నది. ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాం.. మీసేవలో అప్లికేషన్ పెట్టాం.. ఇప్పుడు మళ్లీ గ్రామసభల్లో అప్లికేషన్ పెట్టుకున్నాం.. అని ప్రజలు అంటున్నరు. ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకున్న దరఖాస్తులను ఆన్లైన్ చేయకపోవడంతో, కట్టగట్టి పకకుపడేయడంతో మళ్లీమళ్లీ దరఖాస్తులు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 15వ వార్డు గాడిచర్లపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన సభలో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను విన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. 13 నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక హామీ కూడా రేవంత్ సర్కార్ అమలు చేయలేదని విమర్శించారు.
‘గాడిచర్లపల్లికి చెందిన ఆకుల రాజుకు రూ.1.35 లక్షల రుణం ఉంటే ఇంకా మాఫీ కాలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నడు. కుసుంబ నగేశ్‌కు రూ.లక్ష వ్యవసాయ రుణముంది. ఇంకా మాఫీ కాలేదు. బాగమ్మగారి పూజకు లక్ష రుణం ఉన్నది. నర్సింగరావుకు రూ.47 వేలు, ఏల్పుల రాములుకు రూ.42 వేలు అప్పు ఉన్నది. వీళ్లంతా లక్షలోపు రుణం ఉన్నవారే.. అయిన ఇంకా రుణమాఫీ కాలేదని గ్రామసభలో దరఖాస్తు పెట్టుకున్నరు. ఎం రాధకు రూ.లక్ష రుణమాఫీ కాలేదు. కే యాదయ్య రూ.1,60,000 రుణం తీసుకుంటే మాఫీ కాలేదు. ఊత బాలయ్య రూ.1,60,000కు అప్పు ఉన్నది.
రుణమాఫీ కోసం అడిగితే మిత్తి రూ.13,000 కట్టుమని బ్యాంకు అధికారులు చెప్పారు. మిత్తి కట్టాడు. మిత్తి కట్టినాక కూడా రుణమాఫీ కాలేదు. మరిగే సుధాకర్ రూ.1,90,000 రుణం తీసుకుంటే మిత్తి కడితేనే రుణమాఫీ జరుగుతుందని చెప్పారంట. రూ.25వేలు బ్యాంకుకు మిత్తి కట్టాడు. ఇంకా రుణమాఫీ కాలేదు. సత్తయ్య దగ్గర రూ.68 వేల కట్టించుకొని రెండు లక్షల రుణమాఫీ చేయలేదు’ అని హరీశ్‌రావు ఆధారాలతోసహా వివరించారు. నవంబర్ 30న రూ.2,750 కోట్లకు మహబూబ్‌నగర్‌లో రుణమాఫీ చెకు ముఖ్యమంత్రి ఇస్తే ఇప్పటివరకు రుణమాఫీ జరగలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఇచ్చిన చెకే బౌన్స్ అయితే ప్రభుత్వ పరువు పోయినట్టే కదా అని ప్రశ్నించారు. రైతుల కోసం ఇచ్చిన చెకు రాకపోతే ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రికి, ఆర్థిక మంత్రికి లేదా? అని నిలదీశారు.
రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేశారు. ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగిందో ప్రభుత్వం చెప్పాలని కోరారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వానకాలం రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తరని రైతులు అడుగుతున్నారని చెప్పారు. వానకాలం, యాసంగి కలిపి.. ఇచ్చినమాట ప్రకారం రూ.15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘రూ.15,000 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్ వేస్తా అంటున్నవు. రూ.5000 కోట్లతో మీ ఊరికి ఆరులైన్ల రోడ్డు వేసుకుంటున్నవు. మీ ఊరికి రోడ్డు వేసుకునేందుకు పైసలుంటయి.. మూసి సుందరీకరణకు పైసలుంటాయి కానీ రైతులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవా?’ అని ప్రశ్నించారు.
రేషన్‌కార్డుల కోసం గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఏమయ్యాయని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దరఖాస్తుల పేరుతో ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటున్నరు. ప్రజల డబ్బులు ఎందుకు వృథా చేస్తున్నరు అని మండిపడ్డారు. అర్హులైన అందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేండ్ల కింద కేసీఆర్ రేషన్‌కార్డుల కోసం ఆదాయం పరిమితిని రూ. 60 వేల నుంచి రూ.1.5 లక్షలకు, అర్బన్‌లో రూ.75 వేల నుంచి రూ.2.55 లక్షలకు పెంచారని గుర్తుచేశారు.
2024లో కూడా అదే పరిమితితో రేషన్‌కార్డులు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గమని మండిపడ్డారు. ఏడాదికి ఐదు లక్షల ఇండ్లు కడతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఏడాది పూర్తయినా ఒక ఇల్లయినా కట్టిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చిన ఇండ్లే తప్ప కట్టిన ఇండ్లు లేవని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.ఆరు లక్షలు ఇస్త్తమని చెప్పి, ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టించలేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.ఆరు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కూలీలందరికీ న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు కొందరు మాత్రమే అర్హులు అనడం దుర్మార్గమని మండిపడ్డారు. రకరకాల సాకులతో కోతలుపెట్టి కోటిమంది కూలీలు ఉంటే ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయభరోసా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆరు పైసలు ఇచ్చి 94 పైసలు ఎగబెడుతున్నరు. రుణమాఫీ 30 పైసలు ఇచ్చి, 70 పైసలు ఎగబెట్టారు. రైతుభరోసా వానకాలం ఎగపెట్టిరు, యాసంగి కూడా ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు.
పేదలకు, అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలి. ఇన్చార్జి మంత్రుల పేరిట కార్యకర్తలకు ఇండ్లు ఇస్తే ప్రజాపోరాటం తప్పదని హరీశ్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్ తప్పులకు అధికారులు బలవుతున్నారని, గ్రామాల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.30 వేలు బాకీ పడిందని విమర్శించారు. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ గెలిచిన తర్వాత ఇచ్చినమాట ప్రకారం మహిళలకు రూ.2,500 ఇస్తున్నారని గుర్తుచేశారు. పొరుగు రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినంక పెన్షన్లు పెంచి రూ.4వేలు ఇస్తున్నారని, రేవంత్‌రెడ్డి.. అవ్వాతాతలకు ఎప్పుడు ఇస్తరని ప్రశ్నించారు.
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ ‘కోత’ల సర్కార్‌గా మారిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఒక్క చేయూత పింఛన్లనే ఏకంగా 60 వేల మంది లబ్ధిదారులకు కోత పెట్టి పాపం మూటగట్టుకున్నదని ఎక్స్‌వేదికగా మండిపడ్డారు. చేయూత పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరంలో 43.3 లక్షలు ఉంటే, 2024-25 ఆర్థిక సంవత్సరానికి 42.7 లక్షలకు తగ్గిందని పేర్కొన్నారు. అంటే 60 వేల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందకుండా కాంగ్రెస్ సరారు కోతలు పెట్టిందని తెలిపారు. ఆసరా పింఛన్లను రూ.2,000 నుంచి రూ.4,000కు పెంచడం దేవుడెరుగు, లబ్ధిదారుల సంఖ్యలో కోతలు మొదలు పెట్టడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.