Harish Rao | హైదరాబాద్, డిసెంబర్18 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో పలువురు నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, అలాకాకుండా ఇక పై అసెంబ్లీ వద్ద కూడా డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు పెట్టాలని మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రశ్నోత్తరాల సందర్భంగా కరీంనగర్-కామారెడ్డి- ఎల్లారెడ్డి జాతీయ రహదారి పనుల పురోగతి అంశాన్ని సభ్యుడు మదన్మోహన్ లేవనెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బదులిస్తూ బీఆర్ఎస్పై ఆరోపణలకు దిగారు.
బీఆర్ఎస్ హయాంలో కమీష న్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప రోడ్లను ప ట్టించుకోలేదంటూ విమర్శలకు దిగారు. దీంతో వెంటనే మాజీ మంత్రి హరీశ్‌రావు జోక్యం చే సుకున్నారు. మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖం డించారు. శాసనసభ రూల్స్ అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకే కాకుండా కాంగ్రెస్ సభ్యుల కూ సుద్దులు చెప్పాలంటూ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు చురకలంటించారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈసారి నేరుగా హరీశ్‌రావుపై మా టల దాడికి దిగారు.
వ్యక్తిగత ఆరోపణలకు దిగ గా, హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా భగ్గుమన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందించారు. కొందరు అసెంబ్లీకి వచ్చి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, ఇకపై అలాకాకుండా ఉండాలంటే ‘డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు పెట్టాలి’ అంటూ మంత్రి కోమటిరెడ్డిపై విరుచుకుపడ్డారు. దీంతో ఒక్కసారిగా సభ ఉద్రిక్తతంగా మారింది. ఆ తర్వాత స్పీకర్ జోక్యం చేసుకుని హరీశ్‌రావు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించడంతో గందరగోళం సద్దుమణిగింది.
ప్రశ్నోత్తరాలు పూర్తికాకుండానే భూభారతి బిల్లును సభలో ప్రవేశపెట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి స్పీకర్ సూచించారు. దీంతో మంత్రి పొంగులేటి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో మాజీమంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శాసనసభ నియమాలకు విరుద్ధంగా ఒకే రోజులో బిల్లును ప్రవేశపెట్టడంతోపాటు, చర్చించడంతోపాటు, సవరణలకు కూడా అవకాశం లేకుండా చేయడమేమిటని నిలదీశారు. కీలకమైన భూభారతి బిల్లుపై చర్చించేందుకు సమయమివ్వాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు లేవనెత్తిన అంశాలపై ఇతర ప్రతిపక్ష నే తలందరూ మద్దతు పలికారు.
ప్రభుత్వం గురుకులాలపై సర్కార్ శ్రద్ధ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. గురుకులాలపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. 56 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ అద్దంలా తయారు చేసిచ్చిన గురుకులాలను తాము చెడగొట్టామా? అంటూ చురకలంటించారు.
ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అనేక మంచి పనులు జరిగాయని గుర్తుచేశారు. అంతకంటే బాగా పేరు తెచ్చుకునే పనులు చేయాలని సూచించారు. 1971లో పీవీ నర్సింహారావు సర్వేల్లో మొదటి గురుకులం ప్రారంభించారని, 43 ఏండ్లలో ప్రారంభించిన గురుకులాలు 203 మాత్రమేనని, కానీ బీఆర్ఎస్ 819 ఏర్పాటు చేసిందని, విద్యార్థుల సంఖ్య 2 లక్షల నుంచి నేడు 10 లక్షలకు పెరిగిందని, నాడు కొలిచి అన్నం పెడితే, కేసీఆర్ సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టారని, విదేశాల్లో చదివించేందుకు రూ.20 లక్షల సాలర్షిప్స్ అందించిన దేశంలో ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు.
21 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్నానని, 15 ఏండ్లుగా డిసెంబర్ 31న రాత్రి ఎస్సీ హాస్టల్లో అన్నం తిని, అక్కడి విద్యార్థులతో కలిసి వేడుక జరుపుకుంటానని వెల్లడించారు. విద్యార్థుల సమస్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతుంటే అధికార పార్టీ ఎమ్మె ల్యేలు శంకర్, రాంచందర్ నాయక్, వెడ్మ బొ జ్జు నాన్‌స్టాప్‌గా రన్నింగ్ కామెంటరీ చేస్తూనే ఉన్నారు. దీంతో హరీశ్‌రావు ‘మీరు జర నోరు మంచిజేస్కోవాలె’ అని సీరియస్‌గా చెప్పారు. దీంతో మళ్లీ హరీశ్‌రావు ప్రసంగం పూర్తయ్యే వరకూ ఆ ముగ్గురిలో ఒక్కరు కూడా కిక్కురమనలేదు.
అసెంబ్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలను, ఇతర అంశాలను ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో ఇస్తామని హామీ ఇచ్చిన పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ఎంప్లాయీస్ హెల్త్ సీంను పరిమితి లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ సమస్యను పరిషరించాలని సూచించారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో 1,913 ప్రభుత్వ పాఠశాలలు మూత పడ్డాయని, ఇప్పటికైనా ఆ పాఠశాలల్లో టీచర్లను పెట్టి సూళ్లు తెరిపించాలని సూచించారు. 12 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నామని, బడిలోనో అమ్మ ఒడిలోనో ఉండాల్సిన పిల్లలు వెంటిలేటర్లపై ఉంటున్నారని, పాము కాటు, కుకకాటు, ఎలుక కాటు, ఫుడ్ పాయిజన్, కరెంట్ షాకులు, ఇతర కారణాలతో ఏడాదిలో 54 మంది విద్యార్థుల చనిపోయారని, ఆ విద్యార్థుల వివరాలు పంపుతున్నామని, మానవతా దృక్పథంతో 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.