Harish Rao | మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 17: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తున్నారని, తన చేతగాని తనాన్ని గత ప్రభుత్వాలపై రుద్దడం సరికాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రం దివాలా తీసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే మాట్లాడటం, రాష్ట్ర ప్రతిష్ఠను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యల ద్వారా రాష్ట్ర భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నారని విమర్శించారు.
మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు అబద్ధ్దాలను వల్లెవేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంపై రూ.6.85 లక్షల కోట్ల అప్పు ఉన్నదనే తప్పుడు ప్రచారాన్ని ఇంకెన్నిసార్లు చెప్తారని ప్రశ్నించారు. పబ్లిక్ మీటింగ్‌ల్లో, ప్రచారసభల్లో, 16వ ఆర్థిక సంఘం ముందు చివరికి ప్రజాపాలన దినోత్సవ వేదికగా అదే తొండివాదన వినిపించడం వల్ల రాష్టానికి వచ్చే ప్రయోజనం ఏమిటని నిలదీశారు.
తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి, మూలధన పెట్టుబడి, సంక్షేమాల కోసం చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు మాత్రమేనని అసెంబ్లీ వేదికగా వివరించామని చెప్పారు. తెచ్చిన అప్పులను మూలధనంగా మార్చి ఎన్ని ఆస్తులు, ఎంత సంపద సృష్టించామో లెక్కలతో సహా అసెంబ్లీ వేదికగా వివరించామని గుర్తుచేశారు. అయినా రూ.6.85 లక్షల కోట్ల అప్పు ఉన్నదని, రాష్ట్రం దివాలా తీసిందని పేర్కొనడం ఏమిటని మండిపడ్డారు. దివ్యంగా ఉన్న రాష్ర్టాన్ని దివాలా తీసిందని ప్రచారం చేయడం ముఖ్యమంత్రికి తగునా? ఇది పాపం కాదా? అని ప్రశ్నించారు. కేవలం అప్పుల గురించి మాట్లాడుతున్నారు కానీ, తెలంగాణ దేశంలోనే తలసరి ఆదాయంలో ఆగ్రస్థానంలో నిలిచిన విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.
రాష్ట్రం దివాలా తీసిందనే మాటాలు విని పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా వస్తారా? రాజకీయ కక్షల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తారా? భావితరాలకు శిక్ష వేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతిష్ఠను కాపాడటం అంటే విదేశాలకు వెళ్లి ఇక్కడి డొల్ల కంపెనీల్లో బోగస్ పెట్టుబడులు పెట్టినంత సులువు కాదని చురకలేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సీఎం బాధ్యత లేని వ్యాఖ్యల వల్ల ఇప్పటికే పలు పరిశ్రమలు ఇతర రాష్ర్టాలకు తరలి వెళ్లాయని విమర్శించారు.
ప్రభుత్వ ఆనాలోచిత చర్యల వల్ల రియల్ఎస్టేట్ కుదేలైందని దుయ్యబట్టారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రేవంత్ పాలనలో టాప్ పది స్థానాల్లో సైతం లేకుండా పోయిందని మండిపడ్డారు. దీనికి మీ దివాలాకోరు వ్యాఖ్యలు, చేతగానితనం కారణం కాదా? అని ప్రశ్నించారు. రాజకీయ కక్ష సాధింపు కోసం రాష్ట్ర ప్రయోజనాలను సైతం పణంగా పెట్టే గొప్ప ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. ఇకనైనా రాష్ట్ర ప్రతిష్ఠను, గౌరవాన్ని మరింత పెంచే విధంగా వ్యవహరిస్తే మీకే కాదు రాష్ట్ర భవిష్యత్తుకు సైతం మంచిగా ఉంటుందని హితవు చెప్పారు.
రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న లెక్కలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 23న విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులు చూపించారని, ఇందులో రెండు రకాల అప్పులను ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదని క్లియర్‌గా పేర్కొన్నారని గుర్తుచేశారు.