రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం, బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది. రేవంత్‌రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఢిల్లీని చూస్తే రేవంత్‌కు భయం, చంద్రబాబు పట్ల గురుదక్షిణ.. దీంతో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
Harish Rao | సిద్దిపేట, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి ) : తెలంగాణకు అన్యాయం చేయడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్న సమన్యాయం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు, జగన్ ఇద్దరిదీ ఒకే బాట అని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీయేనని స్పష్టంచేశారు. బుధవారం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల చంద్రబాబు చేసిన ప్రసంగంపై ఘాటు వ్యా ఖ్యలు చేశారు. తాను కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించలేదని, సముద్రంలో కలిసే నీళ్లను మాత్రమే తీసుకెళ్తున్నానని, తెలంగాణ, ఏపీ తనకు రెండు కండ్లలాంటివని, రెండు రాష్ర్టాలకు సమన్యాయం జరగాలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు హరీశ్‌రావు చెప్పారు. పూర్తిగా సత్యదూరమైన విషయాలను చంద్రబాబు మాట్లాడారని, వాటికి సాక్ష్యాధారాలతో సహా తాను చూపిస్తానని పేర్కొన్నారు.
చంద్రబాబుకు రెండు రాష్ర్టాలు, రెండు కండ్లు అయితే, నాగార్జునసాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి, సాగర్ కుడి కాలువ నుంచి నిండుగా నీళ్లు ఎందుకు తీసుకుపోతున్నరు? ఇదేనా సమన్యాయం? అని హరీశ్ ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో ఏపీకి తాత్కాలికంగా కేటాయించిన వాటా ప్రకారం 512 టీఎంసీలు రావాల్సి ఉండగా, చంద్రబాబు 655 టీఎంసీలు వాడుకున్నారని వివరించారు. తెలంగాణకు 343 టీఎంసీలు రావాల్సి ఉండగా, 220 టీఎంసీలే వచ్చిందని చెప్పారు. ఢిల్లీలో పలుకుబడిని ఉపయోగించి బీజేపీ, చంద్రబాబు తెలంగాణ నోరు కొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోతూ తెలంగాణకు సాగు, తాగునీరు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌కు తాగునీరు, ఎడమకాల్వ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. చంద్రబాబు దత్తత తీసుకున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్‌సాగర్, బీమా కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ విషయంలో చంద్రబాబుది పక్షపాత ధోరణి అని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేమిటని చంద్రబాబు అంటున్నారని, కృష్ణా నది విషయంలోనూ అదే జరిగిందని పేర్కొన్నారు. పెన్నా బేసిన్లో ప్రాజెక్ట్‌లు కట్టి నదీ పరీవాహక ప్రాంతం బయట కృష్ణా జలాలు వాడుతున్నారని ఆరోపించారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు కట్టి తెలంగాణ నోరు కొట్టారని, అత్యధిక ప్రాంతం తెలంగాణలో పారితే, ఎక్కువ వాటా లేకుండా అన్యాయం చేశారని హరీశ్ విమర్శించారు. అందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు బనకచర్ల ద్వారా 200 టీఎంసీలను గోదావరి నుంచి పెన్నా బేసిన్‌కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో 1,480 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి కేటాయించిందని, అప్పటి ప్రభుత్వ జీవోల ప్రకారమే 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారని, కానీ, వాడకంలో ఎప్పుడూ 200 టీఎంసీలు దాటలేదని వివరించారు. అందుకే కేసీఆర్ గోదావరి నదిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో 240 టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్ట్, 47 టీఎంసీలతో సమ్మక్కసాగర్, 65 టీఎంసీలతో సీతమ్మసాగర్, 12 టీఎంసీలతో వార్ధా ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేశారని వివరించారు.
కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఒక్కో ప్రాజెక్ట్ డీపీఆర్‌లు వాపస్ వస్తున్నాయని చెప్పారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం, చంద్రబాబు కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించి డీపీఆర్‌లు వాపస్ వచ్చేలా చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో రేవంత్‌రెడ్డిని జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే.. అవగాహన లేక ‘ఐయామ్ నాట్ రైట్‌పర్సన్’ అని తప్పుకున్నారని, అలాంటి వ్యక్తి చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్ట్‌లు సాధిస్త్తరా? అక్రమ ప్రాజెక్ట్‌లను ఆపగలుగుతరా? అని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర పనిచేసిన వారినే నీటిపారుదల శాఖ సలహాదారులుగా నియమించారని, ఇక తెలంగాణకు ఎలా న్యాయం జరుగుతుందని నిలదీశారు.
తెలంగాణకు అన్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ప్రజలను చైతన్యం చేసి, బీజేపీ, చంద్రబాబు కుట్రలను తిప్పికొడుతాం. రెండు కండ్ల సిద్ధాంతం, సమన్యాయంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం లేదని కేంద్రానికి లేఖ రాయాలి.
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ లైఫ్‌లైన్ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు. 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83 లక్షల ఎకరాల స్థిరీకరణతోపాటు హైదరాబాద్‌కు తాగునీటితోపాటు సగం తెలంగాణకు సాగు, తాగు నీరు అందించే ప్రాజెక్ట్ అని వివరించారు. దీనిని వ్యతిరేకించడమంటే తెలంగాణకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు డజన్ల కొద్దీ ఉత్తరాలు రాసిన సంగతి తాము మర్చిపోమని స్పష్టంచేశారు. తెలంగాణకు అన్యాయం చేయడంలో చంద్రబాబు, జగన్‌లది ఒకేబాట అని విమర్శించారు. గోదావరిలో 969 టీఎంసీల నీళ్లు కేటాయించారు కదా.. ముందు మా నికర జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లను ఆపాలన్నారు.
నికర జలాల వినియోగం కోసం నిర్మిస్తున్న సీతమ్మసాగర్, సమ్మక్కసాగర్, కాళేశ్వరం మూడో టీఎంసీ, వార్ధా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ లేఖ రాశారని, నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే, రెండు కండ్ల సిద్ధాంతం, సమన్యాయం నిజమే అయితే ఈ నాలుగు ప్రాజెక్ట్‌ల విషయంలో తెలంగాణకు అనుమతి ఇవ్వాలని, ఏపీకి అభ్యంతరం లేదంటూ కేంద్రానికి ఉత్తరం రాయాలని డిమాండ్ చేశారు. పాలమూరులో నిర్మిస్తున్న పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు అభ్యంతరం లేదంటూ కేంద్రానికి లేఖ రాసి సమన్యాయం నిరూపించుకోవాలని సవాల్ చేశారు. పాలమూరులో వేసిన ఎన్జీటీ కేసును విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎంతో ఆలోచించి 45 టీఎంసీల పాలమూరు ఎత్తిపోతల కోసం నికర జలాలు కేటాయించి, కేంద్రానికి డీపీఆర్ పంపారని, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ బజాజ్ నేతృత్వంలో కమిటీ వేస్తే, చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి నేటి వరకు రిపోర్ట్ బయటకు రానివ్వలేదని విమర్శించారు. ఆ రిపోర్ట్ వస్తే పాలమూరు ప్రాజెక్ట్ ఆగదని, మీ సమన్యాయం నిజమే అయితే ఎందుకు పాలమూరు మీద ఎన్జీటీలో కేసు వేశారని నిలదీశారు.
చంద్రబాబు చెప్తున్న సమన్యాయం, రెండు కండ్ల సిద్ధ్దాంతం ఉత్తమాటలే. నాడు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నది చంద్రబాబే. నేడు నీటిని అక్రమంగా తరలించే ప్రయత్నం చేస్తున్నది చంద్రబాబే.
ఢిల్లీ చంద్రబాబు చేతుల్లో ఉన్నదని, తన పలుకుబడి ఉపయోగించి బడ్జెట్లో ఏపీకి డబ్బులు తెచ్చుకున్నారని, సమన్యాయం అనేది నిజమే అయితే తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా ఎందుకు వచ్చిందని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎందుకంటే చంద్రబాబు రెండు కండ్లు ఏపీ వైపే చూస్తున్నాయని చెప్పారు. రేవంత్‌రెడ్డికి చేతకాలేదని, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. మీ సమన్యాయం నిజమే అయితే, ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తక్కు కింద అమ్ముతుంటే ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి మాట్లాడరని, ఎంపీలు నోరు మెదపరని, అందుకే తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ గొంతు విప్పాల్సి వస్తున్నదని చెప్పారు.
సిద్దిపేట అర్బన్: కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరప్రదాయిని అని, ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కండ్లు తెరవకపోతే చరిత్ర క్షమించదని హరీశ్‌రావు పేర్కొన్నారు. అన్ని వర్గాలకు మంచి చేసే ఇలాంటి ప్రాజెక్ట్‌ను నిర్లక్యం చేయకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు. బుధవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని రంగనాయకసాగర్ ప్రాజెక్ట్‌ను హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలైనా మేడిగడ్డలో కుంగిన ఒక పిల్లర్‌ను బాగుచేసే తీరిక లేదని మండిపడ్డారు. ఎస్సారెస్పీ స్టేజ్-2లో తుంగతుర్తి, సూర్యాపేట, భూపాలపల్లి ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ, కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీటిని అందించామని గుర్తుచేశారు. నేడు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, ఆ నీళ్లను లిఫ్ట్ చేసి లక్షల ఎకరాల్లో పంటలను కాపాడే అవకాశం ఉన్నదని చెప్పారు. కేసీఆర్, బీఆర్ఎస్ మీద కోపంతో తెలంగాణ రైతులకు అన్యా యం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యం, బీజేపీ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతున్నది. రేవంత్‌రెడ్డికి కేంద్రాన్ని ఎదురించే ధైర్యం, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఢిల్లీని చూస్తే రేవంత్‌కు భయం, చంద్రబాబు పట్ల గురుదక్షిణ.. దీంతో రాష్ర్టానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది.