హైదరాబాద్, నవంబర్ 7(నమస్తే తెలంగాణ): తోపుడు బండి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సాదిక్ మృతి చెందారు. బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున సాదిక్ తుది శ్వాస విడిచారు. పార్థివదేహాన్ని ఆయన స్వగ్రామం ఖమ్మం జిల్లా కల్లూరుకు తరలించారు. విద్యార్థులు, స్నేహితులు, బంధువుల సందర్శనార్థం మధ్యాహ్నం 2గంటల వరకు కల్లూరు ఉంచి, సాయంత్రం 4గంటలకు సత్తుపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు. సాదిక్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.
ఓయూలో ఎంఏ తెలుగు చదివిన సాదిక్.. కొన్నాళ్లపాటు ప్రముఖ పత్రికల్లో జర్నలిస్టుగా సేవలందించారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టి వచ్చిన ఆదాయంతో పుస్తకాలను కొనేవారు. తోపుడు బండి ద్వారా వంద రోజుల్లో వెయ్యి కిలోమీటర్లు తిరిగి గ్రామాల్లో పుస్తకాలను పంచిపెట్టారు. ఆయన సేవా గుణానికి ఆకర్షితులైన కొంతమంది స్నేహితులు పుస్తకాలు కొనుగోలు చేసేందుకు సహకరించారు. అనంతరం పేద పిల్లలకు సాయం చేసేందుకు తోపుడు బండి ఫౌండేషన్‌ను స్థాపించారు. ఫౌండేషన్ ద్వారా విరాళాలు సేకరించి వేలాది మంది పేద పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్, పాఠశాలలకు ఫర్నిచర్ సమకూర్చారు. దాతల సాయంతో అనాథ పిల్లలకు చేయూతనిచ్చారు. సాదిక్ భార్య ఉష వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నా రు. సాదిక్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లోనూ ఉష పాలుపంచుకుంటున్నారు.
హైదరాబాద్, నవంబర్ 7(నమస్తేతెలంగాణ): జర్నలిస్టుగా, సంఘ సేవకుడిగా విశిష్ట సేవలందించి..తోపుడు బండితో పుస్తకప్రియులకు సుపరిచితుడైన సాదిక్ మృతి బాధాకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గురువారం ఎక్స్ వేదికగా సాదిక్ సేవలను ట్వీట్ చేశారు. పిల్లల్లో పుస్తక పఠనాసక్తిని పెంపొందించేందుకు తోపుడు బండిలో పుస్తకాలు పెట్టుకొని తిరగడం గొప్ప విషయమని కొనియాడారు. ఆయన సేవలు ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ఆకాంక్షించారు. సాదిక్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.