Harish Rao | మన సీఎం మసిపూసి మారేడు కాయ చేయడంలో సిద్ధహస్తుడని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం రిపోర్ట్‌పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘చరిత్ర, కాలం అన్ని విషయాలను తేలుస్తుంది. ఈ రిపోర్ట్ కోర్టు ముందు నిలబడదు. కానీ, ఈ రిపోర్ట్ ఎంత డొల్ల రిపోర్టో.. చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చేస్తాను. హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ఆధారంగా మీరు ఏదైతే.. 160 టీఎంసీల నీరు అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో.. ఆ నీరు అక్కడ లేవు అని ఎవరు చెప్పారు? కేంద్ర జలసంఘం చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ 8.2.2015లో లేఖ ఇచ్చింది. మా ప్రభుత్వం ఏర్పడ్డది జూన్ 2, 2014న. ఆ ఎనిమిది నెలల కాలంలో నీళ్ల మంత్రిగా నేను మహారాష్ట్రకు వెళ్లి.. ఆ నాటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ని కలిసి మాట్లాడాను. ఆయనను కలిసి మాకు తెలంగాణ వచ్చింది. మేం ప్రాణహిత కట్టుకుంటాం అనుమతి ఇవ్వాలని అడిగితే.. మీరు మరిచిపోండి.. ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్.. ఏపీలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్.. మావోళ్లు కాంగ్రెసోళ్లు ఉన్నప్పుడు ఏడు సంవత్సరాలు అడిగితే అనుమతి ఇవ్వలేదు. మా రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. మేం అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని ఆ నాటి కాంగ్రెస్ మంత్రి చెప్పారు’ అని హరీశ్ గుర్తు చేశారు.
‘ఆ తర్వాత ఆరు నెలల తర్వాత కొత్తగా బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ మంత్రి వద్దకు వెళ్తే.. కొత్త రాష్ట్రం వచ్చింది.. నీళ్ల కోసం ఉద్యమం జరిగింది.. దయచేసి 152 మీటర్లలో అనుమతి ఇవ్వమంటే.. ఆయన కూడా మేం ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు. కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నిరకాలుగా ప్రయత్నం చేసినా.. ఆనాటి గవర్నర్ విద్యాసాగర్‌రావు సమక్షంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా.. దీనిపై పోరాటం చేశాం. అరెస్టులయ్యాం.. దీనిపై ఒప్పుకునే ప్రశ్నే లేదని మహారాష్ట్ర తేల్చి చెప్పింది. చెప్పడమే కాదు లెటర్ కూడా రాశారని గుర్తు చేశారు. అయితే, హరీశ్‌రావు ప్రసంగానికి సీఎం రేవంత్‌రెడ్డి అడ్డు తగిలారు. ఆ తర్వాత హరీశ్‌రావు మళ్లీ మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రి మసిపూసి మారేడు కాయ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఆయనను అభినందిస్తున్నాను. ఉమాభారతి లేఖ రాశారని.. హరీశ్‌రావు ఎండార్స్ చేశారు.. నీళ్లు ఇచ్చారు.. అనుమతి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నాడు. ఉమాభారతి రాసిన లేఖలో ఒకటే పేజీని సీఎం రేవంత్ చదివాడు. లేఖ కూడా నా దగ్గర ఉంది. అదే లేఖలో మూడో పేజీని హరీశ్‌రావు చదివి వినిపించారు. ఉమాభారతి రాసిన లేఖ మొదటి పేజీ.. ఆ కమిషన్ మొదటి పేజీ చదివింది కానీ.. మూడో పేజీ చదవలేదు గనుకనే.. ఆ కమిషన్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని చెబుతున్నా. ముఖ్యమంత్రి కూడా మూడో పేజీ చదవకుండా.. మొదటి పేజీ చదివి ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా’నన్నారు.
‘ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నడు. మంత్రిగారు నేను వెల్ ప్రిపేర్ అయ్యాను.. ఉత్తమ్ అన్న లెక్క రాలేదు. ఎలెక్ట్ అయ్యాక మళ్లీ అడుగుతారా? అని సీఎం అన్నడు.. ఆ నాడు 24.10.2014 నాడు సీడబ్ల్యూసీ నుంచి లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ‘మీరు 2004 వరకు మాత్రమే వాటర్ సిరీస్‌ను పంపారు. 2013 సంవత్సరం వరకు అప్డేట్ చేయండి’ సీడబ్ల్యూసీ మనకు డైరెక్షన్ ఇచ్చింది. దానిపై 2013 వరకు అప్డేట్ సిరీస్‌ను నెల రోజుల తర్వాత తిరిగి పంపడం జరిగింది. దానిపై సీడబ్ల్యూసీ దానిపై.. 4.3.2015 రోజున లెటర్ రాసింది. నేను ఈ లెటర్లన్నీ ఘోష్ కమిషన్‌కు అందజేశాను. ఆయనకు డౌట్ వస్తే.. సీడబ్ల్యూసీని పిలిచి క్లారిఫికేషన్ అడగాలి కదా? సీడబ్ల్యూసీని పిలిచి ఈ లెటర్ మీరే ఇచ్చారా? నీళ్లు లేవని ఎందుకు ఇచ్చారు ? అని అడగాలా వద్దా? ఈ లెటర్‌ను ఘోష్ కమిషన్‌కు అందించి.. రిసివ్డ్ కాపీని కూడా తెచ్చుకున్నాను. ఆ కాపీ నా వద్ద ఉన్నది’ అన్నారు.
ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషన్.. ‘165 టీఎంసీల్లో 63 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకున్న నీళ్లు కూడా ఉన్నయ్.. అది పోతే మీకు ఉండేది 102 టీఎంసీలు మాత్రమే అని చెప్పింది. చాలా స్పష్టంగా నీటి లభ్యత లేదని మూడు లెటర్లలో వచ్చింది. ఈ నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన కిరణ్ కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. మీరు పెట్టే ఖర్చు వృథా అవుతుంది. 152 మీటర్ల ఎత్తులో మేం ఒప్పుకోమని చెబితే.. కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా రిప్లే ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రే. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు కడితే.. మీరు చేసిన ఖర్చు వృథా అయితే.. ఆ వృథా కాకుండా నీళ్లున్న చోటికి మార్చి.. మీరు చేసిన తప్పును సవరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం’ అన్నారు. ఆ తర్వాత సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి హరీశ్‌రావు ప్రసంగానికి అడ్డు తగిలి.. చెప్పిన విషయాలను.. అవే ఆరోపణలను మరోసారి వల్లెవేశారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను హరీశ్‌రావు ఖండించారు. ఆయన వ్యాఖ్యలన్నీ సత్యదూరమని.. వ్యాప్కోస్ రిపోర్ట్ ఆరు నెలల సమయం పట్టిందన్నారు. టెండర్ ఇచ్చేందుకు రెండు మూడు నెలల సమయం పట్టిందన్నారు. రూ.11వేలకోట్లు వృథా అయ్యాయని చెప్పడం తప్పు. ఆ వృథాను ఆదా చేసే ప్రయత్నం చేశాం. తమ్మిడిహట్టి మాత్రమే కాదు. ప్యాకేజీ 6, 7, 8 ఎక్కడిక్కడి వరకో తవ్వి పెట్టారు. దాన్ని సద్వినియోగం చేసేందుకు మాత్రమే ప్రాజెక్టును మార్చడం జరిగింది. సోర్స్ ఒక్కటే.. మారింది’ అని హరీశ్‌రావు వివరించారు.