సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వం పంతాలకు, పట్టింపులకు పోకుండా వెంటనే మేడిగడ్డ ప్రాజెక్ట్(Medigadda proj ect) నుంచి నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు. ఆదివారం ఆషాఢం బోనాల సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లులేక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతుల సంక్షేమం దృష్ట్యా సాగునీటి సమస్యలను పరిష్కరించాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి కష్టం రాకుండా ఆదుకుందని పేర్కొన్నారు. అలాగే ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని ప్రశంసించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. మహంకాళి అమ్మ దయతో మంచి వర్షాలు పడాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.