సిద్దిపేట, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యావ్యవస్థను బలోపేతం చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో వేలాది ప్రభుత్వ పాఠశాలలను కుదించే ప్రయత్నం జరుగుతున్నదని, ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా సర్దుబాట్లు, డిప్యుటేషన్లతో కాలం వెళ్లదీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా తడపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు జోగు వెంకటేశం, సిద్దిపేట న్యూ హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్ కనకయ్య ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి నెలా ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేస్తున్నప్పటికీ వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టడం లేదని ఆరోపించారు. తక్షణమే డీఎస్సీ నిర్వహించాలని, డీఎస్సీ పూర్తయ్యే వరకు అవసరమైన చోట విద్యా వలంటీర్లను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైరైన ఉద్యోగులకు బెనిఫిట్స్ విడుదల చేయడానికి 15శాతం కమీషన్ లంచంగా అడుగుతున్నారని ఓ ఉపాధ్యాయురాలు కన్నీళ్లు పెట్టుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
బడి తెరిచి 3 నెలలైనా యూనిఫామ్స్ ఏవి?
కేసీఆర్ తెచ్చిన మన ఊరు-మన బడి ఆపేసి, కనీసం ఒకటంటే ఒక కొత్త క్లాస్రూమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదని హరీశ్‌రావు విమర్శించారు. సుమారు 27వేల ప్రభుత్వ పాఠశాలలను 4వేలకు కుదించాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని ఆరోపించారు. విద్యార్థులకు యూనిఫామ్స్ ఇవ్వడంలో, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. మరోవైపు జీవో 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను రోడ్డుపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ బడుల సమస్యలన్నింటినీ ప్రస్తావిస్తామని హరీశ్‌రావు స్పష్టంచేశారు. బడుల మూసివేత, ఉపాధ్యాయ ఖాళీలు, డీఎస్సీ, విద్యా వలంటీర్ల నియామకం, సావెంజర్ల వేతనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిషరించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : ‘రేవంత్‌రెడ్డి పాలనలో ఆడబిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానలో పనిచేస్తున్న నర్సు శిరీష హత్య ఇందుకు నిదర్శనం’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. గురుకులంలో చదివి, పేదరికాన్ని జయించి నర్సుగా సేవలందిస్తున్న ఆడబిడ్డ హత్యకు గురికావడం తీవ్రంగా కలచివేసిందని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ హయాంలో ప్రజల ఆస్తులకే కాదు.. వారి ప్రాణాలకు కూడా రక్షణలేకుండా పోయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు పెరిగిపోయి, శాంతిభద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే హోం శాఖను నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నర్సు హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితుడికి వెంటనే శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.