హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యమ సమయంలో ఉద్యమానికి ద్రోహం చేశాడని, ఇప్పుడు నీళ్ల విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. బనకచర్లను వెనక్కి తీసుకుని నల్లమల సాగర్‌కు మారుతున్నట్లు ఏపీ ప్రకటించగానే అది తమ ప్రతాపమే అని ముఖ్యమంత్రి, నీళ్ల మంత్రి డబ్బా కొట్టుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
బనకచర్ల అయినా.. నల్లమల సాగర్ అయినా జరిగేది తెలంగాణకు జల దోపిడే అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఏపీ తన తెలివిని ప్రదర్శించిందని, కానీ మన సర్కారుకు ఆ సోయి లేకుండా పోయిందని విమర్శించారు. పోలవరం నుంచి నీటిని బనకచర్లలో కలపకుండా, పోలవరం–నల్లమల్ల సాగర్‌కు లింక్ చేయడంలో వాళ్ల ప్రయోజనాలు చూసుకున్నారని ఆరోపించారు.
ఎందుకంటే.. గోదావరి నీళ్లను కృష్ణా ద్వారా తరలిస్తే.. బచావత్ అవార్డు ప్రకారం 45:21:14 నిష్పత్తిలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు కృష్ణాలో నీటి వాటా ఇవ్వాల్సి ఉంటుందని, పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఈ రూల్ వర్తిస్తుందని, నల్లమల సాగర్‌కు లింక్ చేస్తే ఎగువ రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాల్సిన అవసరం తప్పుతుందని, అందుకే ఏపీ ఆ ఉపాయం చేసిందని చెప్పారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేసి, తెలంగాణ నీటి ప్రాజెక్టులను అడుగడుగునా అడ్డుకున్న ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ నీటి సలహాదారుడిగా నియమించడం ద్వారా, నేడు బనకచర్ల కమిటీలోకి తీసుకోవడం ద్వారా రేవంత్‌రెడ్డి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ సర్కారు ఇప్పటికైనా పిచ్చి డ్రామాలు బంద్ పెట్టి, తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడాలని సూచించారు.
అసెంబ్లీలో చిల్లర ప్రసంగాలు చేయడం కాకుండా, గోదావరి–బనకచర్లకు తాము వ్యతిరేకమని, కమిటీని వెనక్కి తీసుకుంటున్నామని తీర్మానం పెట్టాలని, ఆ తీర్మానం కాపీని ఢిల్లీకి పంపిద్దామని హరీశ్‌రావు సూచించారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి ఈ ప్రాజెక్టుకు అనుమతి ఎలా ఇచ్చారని ధర్నా చేద్దామని పేర్కొన్నారు.