Harish Rao | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖ శాఖపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పూ ర్తిగా తప్పుల తడక అని, సత్యదూరమని ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. అది వైట్‌పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నమని రేవంత్ సర్కారు కుట్రలను తిప్పికొట్టారు. అసెంబ్లీలో ఇరిగేషన్ శ్వేతపత్రంపై లఘు చర్చ సందర్భంగా హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. శ్వేతపత్రం లో ప్రభుత్వం ప్రస్తావించిన ఒకో అబద్ధాన్ని విడమర్చి చెప్పారు. మిడ్ మానేరు ప్రాజెక్ట్ సమైక్య రాష్ట్రంలో పూర్తయినట్టు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, మళ్లీ సభలో అడుగుపెట్టబోనని స్పష్టం చేశారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం గమనార్హం.
ఉత్తమ్ అబద్ధం: నీటిపారుదల రంగంపై ఖర్చు, ఆయకట్టు విషయంలో గత ప్రభుత్వం ఎక్కువ ఖర్చుచేసి.. తక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ మొత్తంలో ఖర్చుచేసి.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లిచ్చాం.
హరీశ్ నిజం: శ్వేతపత్రంలో తప్పుగా.. ఒ కో పేజీలో ఒకో విధంగా చెప్పారు. పేజీ నం బర్-8, టేబుల్ నంబర్ 2.1లో 2014కు ముందు రూ.54,234 కోట్లు ఖర్చుచేసి, 57.79 లక్షలకు నీళ్లిచ్చామని చెప్పారు. పేజీ నంబర్-37లో 1956-2014 వరకు ఉమ్మడి ఏపీ.. తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులపై రూ.54,234 కోట్లు ఖర్చుచేసి.. 41.76 ల క్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతిని అందించామని తెలిపారు. ఒక దగ్గర 57 లక్షల ఎకరాలని.. మరో దగ్గర 41 లక్షల ఎకరాలని వేర్వేరుగా చూపించారు. శ్వేతపత్రం ఫాల్స్ అనేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చుచేసి.. తక్కువ ఆయకట్టుకు నీరందించిందన్న భావన కలిగించేందుకు చేసిన కుస్తీ ఇది.
ఉత్తమ్ అబద్ధం: రాయలసీమ లిఫ్ట్ విషయంలో కేసీఆర్ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. టెండర్లు వరకు స్పందించకపోవ డంతో తెలంగాణ నీళ్ల వాటాకు నష్టంకలిగింది.
హరీశ్ నిజం: ఇది పూర్తిగా తప్పు. రాయలసీమ లిఫ్ట్ జీవో 5- 5- 2020న వచ్చింది. జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్తల ఆ ధారంగా మే 29-1-2020 నాడే మేం కేం ద్రానికి ఫిర్యాదు చేశాం. సరిగ్గా వారం అంటే 12-5-2020 నాడే కేంద్ర ప్రభుత్వానికి… కేఆర్ఎంబీకి మేం ఫిర్యాదుచేశాం.
ఉత్తమ్ అబద్ధం: కృష్ణా నదిపై ప్రాజెక్టులను గత ప్రభుత్వమే కేఆర్ఎంబీకి అప్పగించింది.
హరీశ్ నిజం: ఇది పూర్తిగా అవాస్తవం. మీరు అధికారంలోకి వచ్చాక 15 ఔట్లెట్లను బోర్డుకు అప్పగించినట్టు చెప్పే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్‌ను బయటపెట్టాం. ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చింది. 17-1-24నాడు కేఆర్ఎంబీని నెలలోపు అప్పగిస్తామని ఈ ప్రభుత్వం ఒప్పుకొన్నట్టు కేంద్రం మినిట్స్‌ను జారీచేసింది. ఇదే విషయం జనవరి 18న పత్రికల్లో వస్తే.. ఆ తర్వాత మేం గొంతెత్తితే.. పోరాటానికి బయలుదేరితే జనవరి 27న ఈ మినిట్స్‌ను అంగీకరించమని ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ లేఖ రాశారు.
ఈ 10 రోజులు నిద్రపోయారా? మేం మొదటల్లోనే అప్పగించి ఉంటే 1-2-24న జరిగిన సమావేశానికి ఇరిగేషన్‌శాఖ సెక్రటరీ.. ఈఎన్సీ పోలేదా? 1-2-24 నాడు కేఆర్ఎంబీకి అప్పగిస్తున్నట్టు ఒప్పుకొని రాలేదా? రెండు రాష్ర్టాల ఈఎన్సీలు అప్పగించాలని నిర్ణయించినట్టు ప్రెస్మీట్లో చెప్పలేదా? మీ ప్రభుత్వం నియమించిన ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాసిన లేఖలోనే స్పష్టంగా 16వ, 17వ కేఆర్ఎంబీ సమావేశంలో మా తెలంగాణ గత ప్రభుత్వం అప్పగించడాన్ని వ్యతిరేకించిందని లేఖలో ప్రస్తావిస్తే.. మీరేమో శ్వేతపత్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించిందని నెపం వేశారు. ఇది భావ్యమా?
ఉత్తమ్ అబద్ధం: కృష్ణానదిపై గల సాగర్, శ్రీశైలం ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించాలని కేంద్రం గెజిట్ ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం సవాల్ చేయలేదు. ఫలితంగా నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది.
హరీష్ నిజం: ఇది పూర్తిగా తప్పు. మేం వ్యతిరేకిస్తూ అపెక్స్ కౌన్సిల్స్‌కు రిఫర్ చేయాలని చెప్పాం. అయినా మేం ఫిర్యాదు చేశాం మహాప్రభో.. అంటే మేం ఫిర్యాదు చేయలేదంటున్నారు. ఇది వైట్ పేపర్ కాదు ఫాల్స్ పేపర్. ఈ శ్వేతపత్రం పూర్తిగాతప్పుల తడక. దీని ద్వారా రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.