Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అజ్ఞాని అని, సాగునీరు, నదీ జలాలపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ‘ఉమ్మడి ఏపీలో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక కొడుతం.. చిల్లు కొడుతమంటే చూస్తూ ఊరుకోం’ అని తీవ్రంగా హెచ్చరించారు. ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేతలు మన్నె గోవర్ధన్‌రెడ్డి, విప్లవ్‌తో తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీ తమ చేతుల్లో ఉన్నరని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెదవులు మూసుకోవడం వల్ల ఏపీ సీఎం చంద్రబాబు ఆడిందే ఆటగా తయారైందని విమర్శించారు. బాబుతో లోపాయికారి ఒప్పందంతోనే రేవంత్ ప్రభుత్వం బనకచర్లకు సహకరిస్తున్నదని మండిపడ్డారు.
లోకేశ్ మాటలపై కాంగ్రెస్ ఎందుకు స్పందించదు?
‘బనకచర్ల కట్టి తీరుతం. అనుమతులు ఎట్లా తేవాలో నాకు తెలుసు అని నారా లోకేశ్ అంటున్నడు. ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉన్నది. మేము ఏం చెప్తే ఆ పని చేస్తది.. మా చేతిలో ఎంపీలున్నరు. మేము ఆడిందే ఆట.. అన్న ధైర్యంతో లోకేశ్ మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు?’ అని హరీశ్ నిలదీశారు. ‘ఎట్లా కడుతవ్? మా తెలంగాణ హకుల సంగతేందని ముఖ్యమంత్రి అడగరు.. నీళ్ల మంత్రి మాట్లాడరు.. అంటే దీన్ని బట్టి మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నరు. చీఫ్ సెక్రటరీ ఏమో బనకచర్ల అంశం ఎజెండాలో ఉంటే మేము మీటింగ్‌కే రామని లేఖ రాస్తరు. సీఎం రేవంత్ రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే బనకచర్ల ఉన్నా ఆ మీటింగ్‌లో పాల్గొంటరు. ఎజెండాలో బనకచర్ల అంశం లేదని రేవంత్‌రెడ్డి అబద్ధం చెప్తున్నరు. వాళ్లు కడుతామంటేనే కదా నేను అడ్డు చెప్పేదని సన్నాయి నొక్కులు నొక్కుతడు. ఈ మాటలు చూస్తా ఉంటే రేవంత్ ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నడు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో పడ్డడు. కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తరు. రేవంత్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్నలుగా తలూపడం వల్లే లోకేశ్ అంత ధైర్యంగా మాట్లాడుతున్నడు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాళేశ్వరం అడ్డగింతకు 7 లేఖలు రాసిండ్రు
‘కాళేశ్వరం ప్రాజెక్టును ఎప్పుడైనా అడ్డుకున్నామా? టీడీపీ అడ్డుకోలేదు. తెలుగు ప్రజలంతా ఒకటే అని లోకేశ్ సన్నాయి నొకులు నొక్కుతున్నడు’ అని హరీశ్ ఆక్షేపించారు. ‘మీకు తెల్వకపోతే మీ నాన్నను అడుగు. నాన్నా కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకున్నామా? లేదా? ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న? అని మీ నాన్నను అడిగి మాట్లాడితే బాగుంటది. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి.. ప్రాజెక్టు పనులు నిలిపివేయండని టీడీపీ ప్రభుత్వం 2018లో కేంద్రానికి లేఖ రాసింది. ఒకలేఖనే కాదు.. కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ 2016 జనవరి 20, 2016 మే 5, 2016 మే 28, 2017 ఏప్రిల్ 19, 2017 జూలై 25, 2018 జూన్ 5, 2018 జూన్ 13న మొత్తం మీ నాన్న ఏడు ఉత్తరాలు రాసిండ్రు. కానీ నిన్న లోకేశ్ మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా? అని సన్నాయి నొకులు నొక్కుతున్నడు. కావాలంటే ఈ లేఖలన్నీ పంపిస్తా చదువుకోండి’ అని హితవుపలికారు. ‘కాళేశ్వరం అనేది కొత్త ప్రాజెక్టు కాదు. ప్రాణహితలో అంతర్భాగం. అందుకే ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ వర్తించదు అని కేంద్రం స్పష్టంగా పేరొన్నది’ అని గుర్తుచేశారు. ఎవరెవరికి, ఏ తేదీల్లో చంద్రబాబు లేఖలు రాశారో వివరిస్తూ వాటిని మీడియాకు చూపించారు.
అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టినం
‘కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి లేదని లోకేశ్ అంటున్నడు.. ఒకటి కాదు రెండు కాదు 11 అనుమతులు ఉన్నయి’ అని హరీశ్ స్పష్టంచేశారు. ‘హైడ్రాలజీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఇరిగేషన్ ప్లానింగ్ ఇంటర్‌స్టేట్ మేటర్స్ ఇలా 11 రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించింది. మీకేమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తా వెరిఫై చేసుకోండి’ అని సూచించారు. ‘కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా నీళ్లన్నీ ఆంధ్రప్రదేశ్‌కు రావాలని కుట్ర చేసినట్టుగా అనిపిస్తున్నది. తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అక్రమ ప్రాజెక్టులు కట్టితీరాలి. కృష్ణా నదిని ఎట్లయితే మళ్ల్లించుకున్నామో, అట్లనే గోదావరిని కూడా మొత్తం మళ్లించుకోవాలి. రెండు నదులను కూడా హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతున్నది’ అని హరీశ్ నిప్పులు చెరిగారు.
ముందు నీళ్ల లెక తేల్చి కట్టుకోండి
‘సముద్రంలో కలిసే నీళ్లు మేము తీసుకపోతే తప్పేందని లోకేశ్ అంటున్నడు. 1) సముద్రంలో నీళ్లు కలుస్తున్నయి అంటున్నావు కదా..? ఉమ్మడి ఏపీలో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. దాన్ని అంగీకరించండి. 2) గోదావరి నది మీద తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖలన్నీ విత్‌డ్రా చేసుకోండి. 3) గోదావరి నీళ్లను, కృష్ణా నదికి మళ్లిస్తే నాగార్జునసాగర్ పైభాగంలో అంటే తెలంగాణకు నీళ్లు ఇయ్యాలని ట్రిబ్యునల్ అవార్డు ఉన్నది. ఆ ట్రిబ్యునళ్ల అవార్డు ప్రకారం కృష్ణా నదిలో మాకు 157 టీఎంసీలు ఇవ్వడానికి ఒప్పుకోండి. 4) 1,480 టీఎంసీలు అని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది. గోదావరిలో నీళ్లు ఉన్నాయా? లేవా? అనే లెక్కతేల్చి ఉన్న దాంట్లో 65ః35 నిష్పత్తి ప్రకారంగా పంచుకుందాం. నీ ఇష్టమున్న ప్రాజెక్టు కట్టుకో.. ముందు లెక తేల్చాలి కదా? లెక తేల్చకుండా నేను కడతా అంటే ఎట్లా ఒప్పుకుంటాం?’ అని హరీశ్ నిలదీశారు.
అవే పాత డైలాగులు
తెలంగాణ నీటి హక్కులను తేల్చాలని అడుగుతుంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని లోకేశ్ మాటాడుతున్నారని హరీశ్ ఫైరయ్యారు.‘ఆనాడు మా రాష్ట్రం మాకు కావాలంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నరు.. తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నరు అన్నరు. ఇయ్యాల కూడా అవే డైలాగులు కొడుతున్నరు. తెలంగాణలో ప్రజలు లేరు.. తెలంగాణ ప్రజలకు కడుపు లేదు. తెలంగాణ ప్రజల తాగునీటికో, సాగునీటికో, పరిశ్రమలకో, మూగజీవాలకో, చేపలకో, చెరువులకో, మాకు నీళ్లు అవసరం లేదా? నీ ఒకనికే కడుపు ఉన్నదా? మా నీళ్లు మాకు రావద్దా? మా నీళ్లు మాకు కావాలి? మా హకు మాకు కావాలంటే.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతరా? అని మాట్లాడుతున్నరు. ఇప్పుడు మా బతుకుదెరువు. మా భవిష్యత్తును అడుగుతున్నం. ఎలాగూ రేవంత్‌రెడ్డి మాట్లాడరు. కానీ, తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన గులాబీ జెండా తప్పకుండా ప్రశ్నిస్తది. తప్పకుండా మాట్లాడుతది. నేను ఒక విషయం అడుగుతున్నా లోకేశ్.. మీ నాన్న ఎనుకట బాబ్లీపై మహారాష్ట్రతో కొట్లాడిండు. ఆల్మట్టి ఎత్తు పెంచుతామంటే కర్ణాటక మీద కొట్లాడిండు.. మీ నాన్న బాబ్లీ మీద కొట్లాడితే అది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టా? ఇట్ల మాట్లాడి తప్పించుకోవాలనుకుంటే తప్పించుకోలేరు. ఇది మా హకు? మా న్యాయబద్ధమైన వాటా కోసం మేము మాట్లాడుతున్నం. మాకేం గొంతెమ్మ కోరికల్లేవు. మీ పట్ల మాకేం గుడ్డి వ్యతిరేకత లేదు’ అని స్పష్టంచేశారు.
పెప్పర్ స్ప్రే దాకా వెళ్లలేదా?
‘తెలంగాణ రాష్ర్టాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా? పెప్పర్ స్ప్రే దాకా వెళ్లలేదా? కానీ, శక్తియుక్తులను ప్రదర్శించి కేసీఆర్ తెలంగాణను తెచ్చిండ్రు. నువ్వు ఇయ్యాల మా హకులను కాలరాసేలా గోదావరిలో మా వాటా తేల్చకుండా ఇటు కృష్ణా నీళ్లను, అటు గోదావరి నీళ్లను తీసుకుపోయి తీరుతామంటే మేము కూడా ఆపి తీరుతామని మాట్లాడుతం. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ హకుల విషయంలో బీఆర్ఎస్ కాంప్రమైజ్ కాదు. అవసరమైతే ఎంత పోరాటమైనా చేస్తం’ అని హెచ్చరించారు.
బనకచర్లను 4 సంస్థలు ఎందుకు తిరస్కరించినయ్?
గోదావరిలో మిగులు జలాలుంటే బనకచర్ల డీపీఆర్‌ను నాలుగు కేంద్ర సంస్థలు ఎందుకు తిరస్కరించాయని హరీశ్ ప్రశ్నించారు. ‘నిన్న లోకేశ్ మాట్లాడుతూ మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి.. కనబడుత లేదా? అంటున్నడు. సాగు జలాలపై లోకేశ్‌కు అవగాహన లేదు. ఆయన యంగ్‌స్టర్.. భవిష్యత్తును చెడగొట్టుకుంటున్నడు. అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాసుపాలవుతున్నడు. మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయంటున్నారు కదా? ఒకవేళ నీళ్లున్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ వాటర్ కమిషన్ మీ బనకచర్ల డీపీఆర్‌ను ఎందుకు తిప్పి పంపింది? గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఎందుకు తిరసరించింది. నీళ్లు ఉంటే నాలుగు కేంద్ర సంస్థలు బనకచర్లను ఎందుకు తిరసరించాయో లోకేశ్ సమాధానం చెప్పాలి’ అని నిలదీశారు. ‘గోదావరిలో తెలంగాణ వాటా ఎంతో? ఏపీ వాటా ఎంతో సమాధానమివ్వాలి? అధికారం ఉన్నది కదా.. మంద బలం ఉన్నది కాదా? అని ఏది మాట్లాడినా చెల్లుతదనుకుంటే పొరపాటే’ అని హెచ్చరించారు.
బుల్డోజ్ చేస్తామంటే ఊరుకోం
‘ఆ రోజు తెలంగాణ ఏర్పాటును అడ్డుకొనేందుకు శతవిధాలా అడ్డుపడ్డరు. ఇప్పుడు నీళ్లను వాడుకోనివ్వకుండా తెలంగాణకు జలద్రోహం చేస్తున్నరు’ అని హరీశ్ మండిపడ్డారు. ‘ఇక మేము ఊరుకోం. మీ ఆటలు సాగనియ్యం. నాడు ఉమ్మడి ఏపీలో నడిపించిండ్రేమో. మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్. ఇయ్యాల బనకచర్ల కట్టి తీరుతామని మీరంటున్నారు. బనకచర్లను అడ్డుకొని తీరుతం’ అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. దేశంలో రాజ్యాంగం ఉన్నది. సుప్రీంకోర్టు ఉన్నది. హకులు ఉన్నయి. చట్టాలున్నయి. ఎట్ల అడ్డుకోవాలో మాకు తెలుసు. మేం మీ ప్రాజెక్టుల గురించి కాదు.. మా హకుల సంగతి మాట్లాడుతున్నం. ఇప్పుడు బుల్డోజింగ్ విధానాలు కాదు. తెలంగాణ ప్రజల అభిప్రాయాలను గౌరవించండి. తెలంగాణ హకులకు లోబడి మా వాటా మాకు ఇస్తూ, మీరు ఏదైనా చేస్తామంటే మాకు అభ్యంతరం ఉండదు. కానీ బుల్డోజ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోం’ అని తీవ్రంగా హెచ్చరించారు.
లోకేశ్.. ఇవాళ మీరేదో తెలుగు
రాష్ర్టాల ప్రయోజనాలని మాట్లాడుతున్నరు. కానీ, కేసీఆర్ ముందుచూపుతో మీ తండ్రి చంద్రబాబును కలిశారు.తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కూడా కలిశారు. ఇద్దరికీ చెప్పిండ్రు. గోదావరిలో ఎక్సెస్ వాటర్ ఉన్నదా? ఉంటే ఆ నీళ్లలో తెలంగాణ వాటా, ఆంధ్ర వాటా నిర్ణయించి ఉభయ రాష్ర్టాలకు ఉపయోగపడేలా వాడుకుందాం. కానీ ఇవాళ మీరు చేస్తున్నది ఏందంటే బుల్డోజ్ రాజకీయం.
-హరీశ్‌రావు
ఉమ్మడి ఏపీలో తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల.. తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల మీరు ఆడిందే ఆట పాడిందే పాట అయింది. పోతిరెడ్డిపాడుకు పొకగొట్టి మీ ఇష్టం ఉన్నట్టు నీళ్లు తీసుకుపోయినా కాంగ్రెస్ నాయకుల మౌనం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది. కానీ, ఇప్పుడికడున్నది బీఆర్ఎస్. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచర్లను అడ్డుకొని తీరుతం.
-హరీశ్‌రావు
కేసీఆర్ కాళేశ్వరం కట్టినప్పుడు మహారాష్ట్రకు చాలాసార్లు వెళ్లారు. నేను ఓ పదిసార్లు పోయిన. నాగపూర్ పోయిన. ముంబయి పోయిన. ఢిల్లీకి పోయిన. వాళ్లు ఎకడుంటే అకడికి పోయి బతిలాడి నచ్చజెప్పి మా హకుల గురించి, మా కష్టాల గురించి చెప్పి, ముఖ్యమంత్రి, గవర్నర్‌ను, అధికారులను కలిసి ఒప్పించి, మెప్పించి కాళేశ్వరం కట్టినం. మీరేమో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఢిల్లీ మా చేతుల్లో ఉన్నది.. అడిగేదేంది? బుల్డోజ్ చేస్తం.. కట్టి పారేస్తం అంటే ఎట్లా నడుస్తది? -హరీశ్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టుకు పొకకొట్టి తీసుకుపోతున్నామా? అంటున్నడు..పొకగొట్టేందుకు ఇదేమన్న శ్రీశైలం ప్రాజెక్టా? పోతిరెడ్డిపాడు ప్రాజెక్టా? ఉమ్మడి ఆంధ్రప్రదేశా? ఇది లిఫ్ట్ ఇరిగేషన్..పొకగొట్టే ప్రాజెక్టు కాదు.. పొకగొట్టుడో,చిల్లుగొట్టుడో ఉండదు.
-హరీశ్‌రావు