హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah)గుండెపోటుతో కన్నుమూశారు. ప్రకృతి ప్రేమికుడి మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ వనజీవి రామయ్య మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. వృక్షో రక్షతి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకుని, కోటికి పైగా మొక్కలను నాటి, ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన వనజీవి రామయ్య లక్ష్యం మహోన్నతమైనదని అన్నారు. మొక్కల పెంపకం కోసం వనజీవిగా మారిన దర్పల్లి రామయ్య జీవితం రేపటి తరాలకు ఆదర్శనీయమని కొనియాడారు. ప్రపంచ పర్యావరణం కోసం సాగిన మానవ కృషిలో వనజీవిగా ఆయన చేసిన త్యాగం అసమాన్యమైనదని కేసీఆర్ అన్నారు.
అడవులు, పచ్చదనం అభివృద్ధి దిశగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన.. తెలంగాణకు హరితహారం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దర్పల్లి రామయ్య అందించిన సహకారం గొప్పదని గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తు తరాలకు మనం అందించే సంపద హరిత సంపదే కావాలని, భౌతిక ఆస్తులు కావని పునరుద్ఘాటించారు. పచ్చని అడవులను ధ్వంసం చేస్తూ, వన్యప్రాణులకు నిలువనీడ లేకుండా ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్న పర్యావరణ వ్యతిరేక ధోరణులను నిలువరించడానికి, వర్తమాన పరిస్థితుల్లో వేలాది వనజీవి రామయ్యల అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. వనజీవి మరణంతో తెలంగాణ ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేసారు. శోకంలో మునిగిన వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు పర్యావరణ పరిరక్షకులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోటి మొక్కలు నాటి వనజీవినే తన ఇంటిపేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితుడు రామయ్య. ప్రకృతి లేనిదే మనుగడ లేదని బలంగా నమ్మారన్నారు. వ్యక్తిగా మొక్కలు నాటి సమాజాన్నే ప్రభావితం చేశారన్నారు. ఆమర సూచించిన మార్గం నేటి యువతకు ఆదర్శమని చెప్పారు. ఆయన మరణం సమాజానికి తీరని లోటని చెప్పారు. పర్యావరణ రక్షణకు జీవితాన్ని అంకితం చేసిన ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
పద్మశ్రీ వనజీవి రామయ్య గారి మరణం
తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.
కోటి మొక్కలు నాటి వనజీవినే…
తన ఇంటిపేరుగా మార్చుకున్న
గొప్ప పర్యావరణ హితుడు రామయ్య.ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ…
కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/7AoLhdrwEM— Revanth Reddy (@revanth_anumula) April 12, 2025
వనజీవి రామయ్య మృతి రాష్ట్రానికి, దేశానికి తీరని లోటని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వనజీవి మృతిపట్ల సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంతాపం తెలిపారు. ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య మృతి తీరని లోటన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి, మొక్కలను బిడ్డలవలే పెంచారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారు. పర్యావరణ హితమే తన ఊపిరిగా భావించిన ఆయన, ఆరోగ్యం సహకరించకున్నా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదు. వారి జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి. అలాంటి గొప్ప వ్యక్తి వనజీవి రామయ్య నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు.
ప్రకృతి ప్రేమికుడు, హరిత స్వాప్నికుడు,
పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య గారి మృతి తీరని లోటు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించి, మొక్కలను బిడ్డలవలే… pic.twitter.com/EDVTpTkuQr
— Harish Rao Thanneeru (@BRSHarish) April 12, 2025
కోటి మొక్కల ప్రధాత మృతి ప్రకృతి ప్రేమికులకు తీరని లోటని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనజీవి రామయ్య ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పారని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. వనజీవి మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వద్దిరాజు రవిచంద్రం సంతాపం వ్యక్తంచేశారు. పద్మశ్రీ వనజీవి రామయ్యను కోల్పోవడం చాలా బాధాకరమని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేసిన నిజమైన ప్రకృతి యోధుడని చెప్పారు. రామయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Deeply saddened by the loss of Padmasree Vanajeevi Ramaiah garu, a true warrior of nature who dedicated his life to tree planting and environmental conservation. His inspiring legacy will live on for generations. Heartfelt condolences to his family. 🙏 #EcoWarrior… pic.twitter.com/BHkoa5muqZ
— Santosh Kumar J (@SantoshKumarBRS) April 12, 2025