హైదరాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): ‘సాగునీళ్లడిగిన రైతుల చేతులకు బేడీ లు వేస్తరా? అక్రమ కేసులు పెట్టి వేధిస్తరా? ఇది కాంగ్రెస్ సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి జూరాల నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరిన రైతులపై కేసులు నమోదు చేయడం అత్యంత హేయమని ఎక్స్ వేదికగామండిపడ్డారు. ప్రభుత్వం బేషరతుగా కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన మాజీ సీఎం చంద్రబాబుకు పట్టిన గతే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికీ పడుతుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. నాడు చంద్రబాబు పాలనలో కరెంట్ బిల్లుల పేరిట గట్టు మండలంలోనే రైతులపై 3వేల కేసులు మోపారని ధ్వజమెత్తా రు. పొలాలను ఎండబెట్టి, హకుగా నీళ్లడిగిన అన్నదాతలపై పెడుతున్న ఈ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వానికి భస్మాసుర హస్తంలా మారడం ఖాయమని స్పష్టంచేశారు. అన్నదాతలపై కేసు లు నమోదు చేయడాన్ని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
రక్తం ధారపోసి పండించిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే తట్టుకోలేక రోడ్డెకిన రైతులను నేరస్తుల్లా చూడటం ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరిని స్పష్టం చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని కోరిన రైతులపై కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని ఒక ప్రకటనలో మండిపడ్డారు. సీఎం రేవంత్ పాలనలో అన్నదాతల చేతులకు బేడీలు వేయడం, తప్పుడు కేసులు పెట్టడం నిత్యకృత్యంగా మారిందని మండిపడ్డారు. సాగునీరు అందిం చి ఆదుకోవాల్సిన పాలకులే వారిపై కేసులు పెట్టడం శోచనీయమని పేర్కొన్నారు. రైతులపై మోపిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.