హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, హత్యాయత్నం కేసు పెట్టాలని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ మెట్లు ఎక్కిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. గుంపులుగా చుట్టుముట్టి ఒక్కొక్కరిని ఈడ్చిపడేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. ఇష్టారీతిన ఈడ్చిపడేయంతో ఆయన చేతికి తీవ్రగాయమైనట్టు తెలిసింది.
గురువారం సాయంత్రం 6:55 గంటలకు అరెస్టు చేసిన పోలీసులు.. కొన్ని గంటలపాటు మూడు బస్సుల్లో, పోలీసు వాహనాల్లో తిప్పారు. సాక్షాత్తూ సైబరాబాద్ కమిషనరేట్ ఆఫీసులోనే బాధితులు గా వచ్చినా తమకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేతలు గొంతెత్తి నినదించారు.
కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిచేసిన కాంగ్రెస్ గూండాలపై, ఎమ్మెల్యే గాంధీపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు మధ్యా హ్నం సైబరాబాద్ సీపీ ఆఫీసుకు వెళ్లగా.. పోలీసులు వారిని గేటు దగ్గర నుంచే నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని సైతం పోలీసు లు సీపీ ఆఫీసులోకి వెళ్లకుండా అడ్డుకున్నారు.
ఎంట్రన్స్ గేటు వద్ద అడ్డగింతలు దాటుకొని సైబరాబాద్ కమిషనర్ అవినాశ్ మొహంతికి ఫిర్యాదు చేసేందుకు కమిషనరేట్లోకి వెళ్తుండగా బీఆర్ఎస్ నేతలను వందలాదిగా మోహరించిన పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. అక్కడున్న ఓ పోలీసు అధికారి బీఆర్ఎస్ నేతలతో అనుచితంగా ప్రవర్తించారు. హరీశ్‌రావుపై చేయివేసి, బయటికి నెట్టే ప్రయత్నం చేశారు. ఆగ్రహం వ్యక్తంచేసిన హరీశ్‌రావు.. ‘మరో నాలుగేండ్లలో మా ప్రభుత్వం వస్తుం ది.. అంతా తిరిగి ఇచ్చేస్తాం’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
బాధితుడైన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని సైతం అదే పోలీసు అధికారి అడ్డుకున్నా రు. చేతులతో నెట్టే ప్రయత్నం చేయగా, ఇద్దరి మధ్య మళ్లీ తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. హరీశ్‌రావును సైతం పోలీసులు వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంటే.. ‘సీపీ ఆఫీసుకు ప్రజలు రావొద్దా? ఫిర్యాదు చెయొద్దా?’ అం టూ ప్రశ్నించారు.
‘ఇది పబ్లిక్ ప్రాపర్టీ’ అంటూ గట్టిగా అరిచి చెప్పారు హరీశ్‌రావు. వెనక్కి తగ్గిన పోలీసులు వారిద్దరిని లోపలికి అనుమతించారు. తీవ్ర వాగ్వాదాల అనంతరం మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, అనిల్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రజని వంటి వారిని సీపీ ఆఫీసు లోపలికి అనుమతించారు.
జాయింట్ సీపీకి ఫిర్యాదు
ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, అతని అనుచరులు, కాంగ్రెస్ గూండాలపై తక్షణం చర్యలు తీసుకోవడంతో, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సైబరాబాద్ జాయింట్ సీపీ జోయెల్ డెవిస్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యా దు చేశారు. తాను అనారోగ్యంతో ఉన్నానం టూ సీపీ అవినాశ్ మొహంతి రాకపోవడం తో.. జాయింట్ సీపీకి ఫిర్యాదు అందజేశారు. కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి జరుగుతున్న క్రమం లో ఆ పరిసరాల్లో లేకుండా పోయిన స్థానిక డీసీపీ, ఏసీపీ, సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దాడికి సహకరించిన ఇతర పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుపై స్పందించిన జాయింట్ సీపీ.. తక్షణం కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. కేసు నమోదు కాకపోవడంతోపాటు అదుపులోకి తీసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలకు నార్సింగి పీఎస్‌లో సాక్షాత్తూ పోలీసులే రాచమర్యాదలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని తక్షణం అదుపులోకి తీసుకొని, హత్యాయత్నం కేసు న మోదు చేసేవరకూ కదిలేదిలేదని భీష్మించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మళ్లీ వాగ్వాదం.. తోపులాటకు దారితీసింది.
కమిషనరేట్‌లోనే బీఆర్ఎస్ బైఠాయింపు
కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ పోలీసులు వెనకడుగు వేయడంతో.. బీఆర్ఎస్ నేతలు కమిషనరేట్‌లోనే బైఠాయించారు. ఈ క్రమంలో మళ్లీ తోపులాట జరిగింది. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 7వరకు బీఆర్ఎస్ నేతలు న్యాయం కోసం నినదించారు.
వంటావార్పుకు హరీశ్‌రావు పిలుపు
దాడి చేసినవారిపై పోలీసులు ఏ కేసులు పెట్టారో సాయంత్రం వరకూ కూడా బీఆర్ఎస్ నేతలకు స్పష్టత ఇవ్వకపోవడంతో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు వేలాదిగా సైబరాబాద్ కమిషనరేట్‌కు తరలి రావాలని, న్యాయం జరిగేంత వరకూ వంటా-వార్పు చేపట్టాలని పిలుపునిచ్చారు. అంతర్మథనంలో పడిన పోలీసులు.. ఉన్నతాధికారుల సూచనల మేరకు బీఆర్ఎస్ నేతల అరెస్టుకు రంగం సిద్ధంచేశారు.
అప్పటికే కమిషనరేట్ బయట వందలాదిగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి వస్తే.. వారికి వేలాది కార్యకర్తలు తోడైతే పరిస్థితి చేయిదాటి పోతుందని గమనించి మీడియాతో మాట్లాడటం అయిపోయిన వెంటనే బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. చేతికి తగిలిన గాయంతో బాధపడుతున్న హరీశ్‌రావును దవాఖానకు తరలించకుండా పోలీసు వాహనాల్లో తిప్పడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.