Harish Rao | హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): పీజీ మెడికల్ సీట్లలో 50 శాతం లోకల్ రిజర్వేషన్ చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తెలంగాణతోపాటు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. మెడికల్ కాలేజీల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణలో ఈ తీర్పు వల్ల స్థానిక విద్యార్థులు వైద్య విద్య అభ్యసించే అవకాశం కోల్పోయే ప్రమాదమున్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య విద్య అభివృద్ధికి తొలి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో 5 మెడికల్ కాలేజీలుంటే ఆ సంఖ్యను కేసీఆర్ ప్రభుత్వం 34కు పెంచిందని తెలిపారు. దీంతో ప్రతీ లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, పీజీ సీట్లలో రెండో స్థానానికి చేరిందని చెప్పారు. 2025 నాటికి తెలంగాణలో 2924 పీజీ సీట్లు ఉండగా, 50 శాతం లోకల్ రిజర్వేషన్ ప్రకారం, 1462 పీజీ సీట్లు తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే వచ్చేవని వివరించారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో ఇవి కూడా ఆల్ ఇండియా కోటాలోకి వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణలో ఉంటూ మెడికల్ పీజీ చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఇది శరాఘాతంగా మారుతుందని చెప్పారు.
తెలంగాణతోపాటు, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఏపీ విద్యార్థులు కూడా ఇదే పరిస్థితి ఎదురోవాల్సి వస్తుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు గత 77 ఏండ్లుగా వైద్య విద్యపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల వైద్యవిద్యకు కేరాఫ్‌గా మారాయని చెప్పారు. దేశంలో సగటున ప్రతీ 20,460 మంది జనాభాకు ఒక పీజీ సీటు ఉంటే, తెలంగాణలో 12,799 మందికి ఒక పీజీ సీటు చొప్పున ఉన్నదని వివరించారు. కర్ణాటకలో 10,573 మందికి ఒకటి, ఏపీలో 15,079 మందికి ఒకటి, తమిళనాడులో 15,123 మందికి ఒకటి, కేరళలో 18,662 మందికి ఒక పీజీ సీటు చొప్పున ఉన్నాయని పేర్కొన్నారు. ఉత్తరాది రాష్ర్టాల్లో ఈ సంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుతో ఆయా రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా దెబ్బ తినే ప్రమాదమున్నదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. ముఖ్యంగా తెలంగాణలో ఇన్‌సర్వీస్ కోటా ప్రశ్నార్థకం అవుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక విద్యార్థులకు వైద్య విద్య అందించాలనే ప్రభుత్వాల లక్ష్యాలు నీరుగారుతాయ ని వివరించారు.
2019 జులై 19న లోక్‌సభలో అప్పటి బీజేపీ ఎంపీ మనోజ్ కోఠక్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హ ర్షవర్ధన్ బదులిస్తూ ‘హెల్త్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్’ అని అన్నారని గుర్తుచేశారు. మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడుస్తాయని, పీజీ విద్యార్థులకు ఇచ్చే వేతనం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. లోకల్ రిజర్వేషన్ లేకపోతే ప్రభుత్వాలు ఖర్చు చేసేందు కు వెనుకాడుతాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. అంతిమంగా వైద్య రంగంలో మానవ వనరుల కొరత ఏర్పడి, వైద్య సేవలకు విఘా తం కలుగుతుందని వివరించారు.
సుప్రీంకో ర్టు తీర్పుతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరి గే ప్రమాదమున్నదని చెప్పారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం రాజ్యాం గ ధర్మాసనం వద్ద అప్పీల్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని డిమాం డ్ చేశారు. పీజీ సీట్లలో లోకల్ రిజర్వేషన్ల కో సం అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తి డి తీసుకురావాలని కోరారు. కేంద్ర మం త్రులు, బీజేపీ ఎంపీలు చొరవ తీసుకుని కేం ద్రంపై ఒత్తిడి పెంచాలని, అవసరమైతే దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రాజ్యాంగ సవరణకు పట్టుబట్టాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయ, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని వేదనకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతుంటే సర్కార్ మొద్దు నిద్ర నటిస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు.
30 ఏండ్లపాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా? వారి ఆవేదన అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు. 2024 మార్చి తర్వాత రిటైరైన దాదాపు ఎనిమిది వేల మంది పీఎఫ్, గ్రాట్యుటీ, ఎల్ఐసీ, కమ్యుటేషన్, సరెండర్‌లీవ్ తదితర ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రావలసిన ప్రయోజనాలు సకాలంలో రాకపోవడంతో వారు మానసిక వేదనకు గురవుతూ, అనారోగ్యం పాలవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
పదవీ విరమణ తరువాత కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉండాల్సిన వారికి ప్రభుత్వం ఆ ఆనందాన్ని దూరం చేయడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. హకుగా పొందాల్సిన బెనిఫిట్స్ కోసం ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరిగేలా, పైరవీలు చేసుకోవాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. బిడ్డ పెండ్లి కోసం ఒకరు, కొడుకు ఉన్నతవిద్య కోసం మరొకరు, భార్య అనారోగ్యం పాలైతే మంచి వైద్య చికిత్స అందించడం కోసం కొందరు ఇలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూసున్నారని వివరించారు.