మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటానని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి నాడు ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరాహారదీక్ష చేపట్టిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున నిర్వాసితుల సమస్యలు పరిషరించాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డిపై ఉన్నది.
– లేఖలో హరీశ్‌రావు
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం రేవంత్‌రెడ్డిపై ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన శ్రీకొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటానని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి నిరాహారదీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 90 శాతం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణం, ఇంటి స్థలాలు, మౌలిక సౌకర్యాలు కల్పించామని తేల్చిచెప్పారు. మిగిలిన 10శాతం సమస్యలు ఏడాది నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. నాడు నిరాహారదీక్ష చేసిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశలు పెట్టుకున్నారని ఉదహరించారు. పెండింగ్ సమస్యల పరిషారంతోపాటు మరింత మెరుగైన సౌకర్యాలు, మెరుగైన పరిహారం అందిస్తారని ఎదురుచూస్తున్నారని తెలిపారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2013 భూసేకరణ చట్టంతో నిర్వాసితులకు 121 గజాల ఇంటి స్థలం, రూ. లక్షా 25 వేలు మాత్రమే ఇవ్వాలనే నిబంధన ఉన్నదని, లక్షలాది మంది రైతుల కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చేందుకు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని విధంగా మెరుగైన ప్యాకేజీని మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం నాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ అమల్లోకి తెచ్చారని చెప్పారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ప్రతీ నిర్వాసితుడికి గజ్వేల్ పట్టణ సమీపంలోనే 250 గజాల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి రూ. 5.04 లక్షలు, రూ.7.50 లక్షల పరిహారం అందించామని వివరించారు. 18 ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒకరికీ రూ.5 లక్షల పరిహారం, 250 గజాల ఇంటి స్థలం కేటాయించామని తెలిపారు. వీటితోపాటు పాత ఇండ్ల నిర్మాణ స్ట్రక్చర్‌కు కూడా సరైన లెక కట్టించి పరిహారం ఇచ్చామని గుర్తుచేశారు. ఆ ప్యాకేజీతోపాటు నిర్వాసితులకు వారి గ్రామాల పేరిట ఆర్అండ్ఆర్ కాలనీలు నిర్మించి బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగేవరకు అన్ని వసతులను దశలవారీగా సమకూర్చామని తెలిపారు. అందుకోసం రూ.1260 కోట్లు ఖర్చు చేసి నిర్వాసితులకు అత్యంత ప్రాధాన్యత కల్పించామని పేర్కొన్నారు. ఈ నిధులతో 90 శాతం పనులను చకచకా పూర్తిచేశామని పేర్కొన్నారు. మిగతా 10 శాతం పనులతో పాటు కోర్టు కేసుల్లో తీర్పు వచ్చినవారికి, అకడకడ ప్యాకేజీ మిస్సయినవారికి పరిహారం అందించాల్సి ఉన్నదని తెలిపారు.
మల్లన్నసాగర్ కింద 90 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పూర్తి చేయాల్సిన బాధ్యత రేవంత్సర్కార్పై ఉన్నదని హరీశ్ స్పష్టంచేశారు. ప్రభుత్వం మారిన క్రమంలో మిగతా పనులను పూర్తి చేయలేకపోయామని, ముంపు గ్రామాలకు చెందిన వితంతువులను కూడా కుటుంబంగా పరిగణించి వారికి ప్యాకేజీ ఇవ్వాలని ఇటీవల హైకోర్టు తీర్పు వెల్లడించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో వెంటనే వితంతువులకు పరిహారం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లక్షలాది ఎకరాలకు సాగునీటితోపాటు హైదరాబాద్ సహా అనేక ప్రాంతాలకు తాగునీటి కష్టాలను తీరుస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వెనుక నిర్వాసితుల త్యాగాలు ఉన్నాయని గుర్తుచేశారు. రేవంత్ సర్కార్ వచ్చాక ఆ రిజర్వాయర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నదని తెలిపారు. హైదారాబాద్ తాగునీటి అవసరాలతో పాటు మూసీ నదిలోకి గోదావరి జలాలను తరలించేందుకు మల్లన్నసాగర్‌పై ఆధారపడ్డారని, అకడి నుంచే 20 టీఎంసీల నీటిని హైదరాబాద్ తరలించేందుకు టెండర్ల ప్రక్రియ కూడా చేపడుతున్నట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కాళేశ్వరంతో ప్రయోజనం లేదని విమర్శించిన రేవంత్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నీళ్ల కోసం ఎందుకు తాపత్రయపడుతున్నరు? నాడు మేము తకువ పరిహారం ఇచ్చామని ఆరోపణలు చేసిండ్రు. ఇప్పుడు సీఎం హోదాలో ఎకువ పరిహారం ఇచ్చి నిర్వాసితుల దగ్గర మీ మాట నిలబెట్టుకోవాలె.
– లేఖలో హరీశ్‌రావు
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కాళేశ్వరంతో ప్రయోజనం లేదని విమర్శించిన రేవంత్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నీటి కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారని హరీశ్ ప్రశ్నించారు. నాడు నిరాహారదీక్ష చేపట్టిన సమయంలో రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి, నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘మేము తకువ పరిహారం ఇచ్చామని మీరు ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీఎం హోదాలో ఎకువ పరిహారం ఇచ్చి నిర్వాసితుల వద్ద మీ మాట నిలబెట్టుకోవాలి. నిరాహారదీక్ష పేరిట ఆనాడు మీరు చేసింది రాజకీయమా? న్యాయ పోరాటమా ? అనేది మీ నిర్ణయాన్ని బట్టి తేలిపోతుంది’ అని లేఖలో పేర్కొన్నారు. మల్లన్నసాగర్ విషయంలో ప్రతిపక్షంలో మాట్లాడిన మాటలను అధికారంలోకి రాగానే విస్మరించారని విమర్శించారు. మల్లన్నసాగర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న రేవంత్‌రెడ్డి అదే మల్లన్నసాగర్ నిర్వాసితుల పరిస్థితిని మానవతాదృక్పథంతో అర్థం చేసుకొని ఒక ముఖ్యమంత్రిగా వారిని ఆదుకోవాలని లేఖలో స్పష్టం చేశారు.