2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్లోని పేరాగ్రాఫ్-5లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారో స్పష్టంగా ఉన్నది. దాన్ని రేవంత్ రెడ్డి చదవలేదు. తెలంగాణతో సంప్రదించకుండా.. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీటిని మళ్లించడం పట్ల, ఆ కమిటీలో సభ్యుల తీరు పట్ల కేసీఆర్ నిరసన వ్యక్తంచేసిండ్రు. -హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై2 (నమస్తే తెలంగాణ) : ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హకులకు మరణశాసనం రాసింది రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని, అసలు 299 టీఎంసీల వాటా అనే రాచపుండును పుట్టించిందే ఆ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్‌రావు కుండబద్దలు కొట్టారు. 2024, జూలై 6న రెండు రాష్ర్టాల జల సమస్యలు పరిష్కరించుకుందామని నాడు ప్రజాభవన్‌కు చంద్రబాబును రేవంత్ పిలిపించుకున్నారని, విభజన హామీల ముసుగులో ప్రజాభవన్ వేదికగా రేవంత్‌రెడ్డి, చంద్రబాబు మధ్య గోదావరి-బనకచర్లపై చీకటి ఒప్పందం జరిగిందని ధ్వజమెత్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 13న ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీసమేతంగా బెజవాడకు వెళ్లి చంద్రబాబును కలిసి బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు ఇచ్చి వచ్చారని, ప్రజాభవన్ వేదికగా రేవంత్‌రెడ్డి, బెజవాడ వేదికగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బనకచర్లకు పచ్చజెండా ఊపారని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బనకచర్లకు పచ్చజెండా ఊపారని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో నవంబర్ 15న బనకచర్ల లింకుకు సహకరించాలని నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు లేఖ రాశారని, ఆ తర్వాత వెంటనే డిసెంబర్ 31న నిర్మలకు బాబు మరో లేఖ రాశారని తెలిపారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు కోసం ఆర్థికసాయం అందించాలని చంద్రబాబు లేఖలో కోరినట్టు చెప్పారు. గోదావరి నీళ్ల తరలింపు కుట్రలు ఇంత జరుగుతుంటే తనకేం తెలియనట్టుగా రేవంత్‌రెడ్డి మౌనంగా ఉంటున్నారని, తెలంగాణ ప్రభుత్వానికి ఏమీ తెలియదన్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నటిస్తున్నారని మండిపడ్డారు. ‘ఈ చీకటి అధ్యాయం బయటపడదు అనుకున్నరో ఏమో’ అని ఎద్దేవాచేశారు.
చిల్లర రాజకీయాలు బంద్ చెయ్
‘రేవంత్‌రెడ్డీ.. చిల్లర రాజకీయాలు, చిచోర రాజకీయాలు బంద్ చెయ్. ముఖ్యమంత్రి పదవి ఉంటది పోతది. కానీ తెలంగాణకు ద్రోహం చెయ్యకు’ అని హరీశ్ నిప్పులు చెరిగారు. బనకచర్ల ప్రాజెక్టు ముమ్మాటికీ తెలంగాణకు ముప్పేనని నాడే కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. గోదావరి జలాలనే కాకుండా కృష్ణా జలాలను సైతం కొల్లగొట్టేందుకు ఏపీ ప్రాజెక్టును చేపడుతున్నదని వివరించారు.
మీడియా క్రాస్‌చెక్ చేయాలి
‘మన ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నడు. కుక్క తోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా అబద్ధాలే.. వ్యక్తులు ముఖ్యం కాదు.. రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, రాష్ట్ర హక్కులు ముఖ్యం. ప్రజలే కేంద్రంగా, రాష్ట్ర హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పనిచేస్తున్నది. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి రాజకీయాలు కేంద్రంగా, బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నడు. మీడియాకు నా విజ్ఞప్తి ఏమిటంటే.. మేము మాట్లాడినా, ముఖ్యమంత్రి మాట్లాడినా, ఇంకెవరకు మాట్లాడినా.. క్రాస్ చెక్ చేస్తూ పాఠకులకు, ప్రజలకు నిజాలను మాత్రమే చేరవేయాలి’ అని హరీశ్ తెలిపారు.
బనకచర్లను ఆపే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నదా?
‘బనకచర్లను ఆపాలనే చిత్తశుద్ధి రేవంత్ ప్రభుత్వానికి గనుక ఉంటే మీరు చూపాల్సిందేమిటి? ఏపీ ప్రభుత్వం, చంద్రబాబునాయుడు కేంద్రానికి రాసిన లేఖలు, జలవనరుల శాఖకు రాసిన లేఖలను చూపించాలి. బనకచర్లను ఆయన ఏవిధంగా ముందుకు తీసుకెళ్తున్నడో చూపించాలి. అది చూపించారా మీరు? వాటి ప్రస్తావనే లేదు. చంద్రబాబు రాసిన లేఖలు గాని, ఆయన మాట్లాడిన మాటలు గాని ఎక్కడా చూపలేదు. దానికి పీపీటీలో స్థానం కల్పించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును, పాలమూరు, తుమ్మిళ్ల, డిండి, భక్తరామదాసు ఇలా ఎన్నో ఎత్తిపోతల పథకాలను, ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నరు. వాటిని ఎందుకు నీ పీపీటీలో చూపించలేదు? ఏపీ ప్రభుత్వం మన ప్రాజెక్టులను ఎట్ల దెబ్బకొట్టిందో ఒక్క ముక్కయినా చూపించినవా? అంటే.. బనకచర్ల ప్రాజెక్టు కట్టే బాబు ఏమో నీకు బంగారం లెక కనిపిస్తున్నడు.. బనకచర్లను ఆపాలని పోరాడుతున్న బీఆర్ఎస్ ఏమో సచ్చినపాము లెక్క కనిపిస్తున్నదా’ అని హరీశ్ మండిపడ్డారు.
ప్రజలు నిన్ను అధ:పాతాళానికి తొకుతరు బిడ్డా!
‘బీఆర్ఎస్ సచ్చినపామే అయితే.. బీఆర్ఎస్ను కలలో కూడా ఎందుకు కలవరిస్తున్నవ్? బీఆర్ఎస్ పేరు ఎత్తకుండా, కేసీఆర్ పేరు పలకకుండా ఒక్క ఉపన్యాసమైనా ఇస్తున్నవా? నీకు నిద్రలో లేపినా బీఆర్ఎస్ గుర్తొస్తది.. గులాబీ జెండా కనిపిస్తున్నది. కేంద్రంలో మీ పార్టీ పదకొండున్నర సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉన్నది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. ఈ దేశంలో అనేక శాసనసభల్ల్లో ఒక ఎమ్మెల్యే సీటు, ఒక్క ఎంపీ సీటు గెలువలేదు. అంతమాత్రాన నీ కాంగ్రెస్ సచ్చిన పాము అయ్యిందా? నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు డిపాజిట్ రాలేదు. అప్పుడు మీ పార్టీ సచ్చిన పాము అయిందా? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అధ:పాతాళానికి తొకుతరు బిడ్డా! జాగ్రత్త!’ అని హరీశ్ ఘాటుగా హెచ్చరించారు.
బొంకుమ్యాన్గా మారినవ్!
‘నీకు బేసిన్ల గురించి కనీస అవగాహన లేదు. గోదావరి, బనకచర్ల ఎక్కడ ఉన్నది అంటవ్. కనీస అవగాహన లేకుండా మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నవు. భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టు.. నీ తీరు కూడా అట్లనే ఉన్నది. నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్మ్యాన్గా పేరు తెచ్చుకున్నవ్. నేడు అదే బాబు కోసం బనకచర్లపై బొంకుమ్యాన్గా మారిపోయినవ్. నిజాలు మాట్లాడుతలేవ్. నువ్వే చెప్పినవ్.. ‘నా స్కూల్ బీజేపీ, నా కాలేజీ తెలుగుదేశం.. నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్‌లో’ అంటివి. టెక్నికల్‌గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి కానీ, నీ హృదయం ఇంకా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నది. పోయినసారి కృష్ణా జలాల్లో ఏపీకి 65 శాతం నీళ్లు ఎక్కువ ఇచ్చిన తీరు గానీ, ఇప్పుడు గోదావరిలో బనకచర్ల ప్రాజెక్టుకు నువ్వు తలుపులు తెరిచిన తీరుగానీ చూస్తుంటే చంద్రబాబుతో, టీడీపీతో ఉన్న నీ అనుబంధాలను ఇంకా మర్చిపోలేకపోతున్నవ్’ అని హరీశ్ దెప్పిపొడిచారు.
మేము నిలదీసి అడిగితే నిద్ర లేచిండ్రు
‘చంద్రబాబు కేంద్రానికి బహిరంగంగా లేఖలు రాస్తున్నరు. నిధులివ్వాలని కోరుతున్నరు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసిండ్రు. పీపీటీ ప్రజెంటేషన్ అవుతున్నది. డీపీఆర్ తయారవుతున్నది. ఇంత జరుగుతున్నా.. రేవంత్‌రెడ్డి మౌనం వహిస్తడు. నాకేం తెల్వది అన్నట్టు ఉన్నడు. ఈ నేపథ్యంలోనే ఆనాడు ఈ విషయాన్ని బయటకు తెచ్చింది బీఆర్ఎస్. పోరాడింది బీఆర్ఎస్.. మాకు రేవంత్, బాబు కుట్రలు తెలియగానే నిలదీసినం. 2025, జనవరి 24న మొట్టమొదట నేను తెలంగాణభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి అడిగిన. బనకచర్ల కోసం చంద్రబాబు లేఖలు రాస్తున్నరు. నిధులు తెచ్చుకుంటున్నరు. మీరు ఏం చేస్తున్నరు? అని ప్రశ్నించిన. అప్పుడు నిద్రలేచి జనవరి 22వ తేదీతో కేంద్రానికి లేఖ రాసినట్టు లేఖ సృష్టించి మీడియాకు విడుదల చేసిండ్రు. 24న మధ్యాహ్నం నేను ప్రెస్‌మీట్ పెట్టి నిలదీస్తే అదే రోజు రాత్రి ఎనిమిది గంటలకు ఉత్తమ్ ప్రెస్‌మీట్ పెట్టిండ్రు. బ్యాక్ డేట్ వేసి కేంద్రానికి లేఖ రాసినట్టు చెప్పిండ్రు. మూడు రోజుల ముందే రాసి ఉంటే అంతకు ముందే లేఖ విడుదల చేయవచ్చు కాదా? నేను మధ్యాహ్నం 4 గంటలకు ప్రెస్‌మీట్ పెడితే.. అదే రాత్రి 8 గంటలకు బనకచర్ల ఆపాలని కేంద్రానికి లేఖ రాసినట్టు ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? నువ్వు అడ్డంగా దొరికినవ్?’ అని ఉత్తమ్‌ను హరీశ్ నిలదీశారు.
ఆ పీపీటీ బాబు తయారు చేసిండా?
‘నిన్న రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌లో, అధికారిక హోదాలో, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే పిలిచిండ్రు.. అది అధికారిక ప్రజెంటేషన్ అయితే ఎందుకు అందరు ఎమ్మెల్యేలను పిలువలేదు? గాంధీభవన్‌లో పెట్టుకోలేదు కదా? ఇరిగేషన్, సచివాలయం అధికారులు కదా? అందరినీ పిలిస్తే ఇంకా వాస్తవాలు బయటకు వస్తయి కదా? నిన్న ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ హైదరాబాద్‌లో ఇచ్చినట్టు లేదు. అమరావతిలో ఇచ్చినట్టుగా ఉన్నది. ఆ పీపీటీ చూసినోళ్లకు ఏమనిపిస్తదంటే.. ఇది తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా? లేక చంద్రబాబునాయుడు తయారు చేసి అమరావతి నుంచి గిట్ల పంపిండా? అన్న అనుమానం ఎవరికైనా కలుగుతది’ అని హరీశ్ ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో 2016లో బనకచర్లను నాటి సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్‌కు రాసిచ్చినట్టు మాట్లాడిండ్రు. ప్రజెంటేషన్ హెడ్డింగ్‌లోనే 2016లో గోదావరి- పెన్నా నదుల అనుసంధానం అని పెట్టిండ్రు. అసలు 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో ఎక్కడైనా పెన్నా గురించి ఉన్నదా? మినిట్స్‌లో ఎక్కడైనా పెన్నా అన్న మాట ఉన్నదా? గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు రాసిచ్చినట్టు ఉన్నదా? ఇంత చిల్లర, ఇంత నీచపు.. దిగజారుడు అబద్ధాలను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చెప్తరా?
-హరీశ్‌రావు
2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్లోని పేరాగ్రాఫ్ 5లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నారో ఉన్నది. దాన్ని రేవంత్ రెడ్డి చదవలేదు. తెలంగాణతో సంప్రదించకుండా.. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి నీటిని మళ్లించడం పట్ల, ఆ కమిటీలో సభ్యుల తీరు పట్ల కేసీఆర్ నిరసన వ్యక్తం చేసిండ్రు.
-హరీశ్‌రావు
అసలు 299 టీఎంసీల వాటా అనే రాచపుండును పుట్టించి.. తెలంగాణకు మరణశాసనం రాసిందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ. చిల్లర రాజకీయాలు, చిచోరా రాజకీయాలు బంద్ చెయ్యి రేవంత్.. ముఖ్యమంత్రి పదవి ఉంటది పోతది. కానీ తెలంగాణకు ద్రోహం చెయ్యకు.
-హరీశ్‌రావు
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత కేంద్ర జలవనరుల శాఖకు కేసీఆర్ రెండో లెటర్ రాసిండ్రు. 2020, అక్టోబర్ 2న నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు గోదావరి నీటి వినియోగం గురించి లేఖ పంపిండ్రు. 53 ఏండ్ల గేజ్ రిపోర్టుల ప్రకారం ఏటా 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నయి. దీంట్లో తెలంగాణకు ప్రొరేటా ప్రకారం వాటా ఉంటుంది.. ఇప్పటికే కేటాయించిన 968 టీఎంసీలే కాకుండా సముద్రంలోకి వెళ్లే నీటిలో 1950 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా వస్తయి.. మొత్తం 2918 టీఎంసీలను తెలంగాణ హక్కుగా వాడుకునే వెసులుబాటు ఉండాలని లేఖ ద్వారా కోరిండ్రు. ఆ లేఖలను తెప్పించుకొని చదువుకో రేవంత్..
-హరీశ్‌రావు
నీటి సంబంధ విషయాల్లో రేవంత్‌కు అవగాహన లేదు. గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలు ఇస్తే చాలని మాట్లాడిండు. మిగిలిన నీళ్లను చంద్రబాబు ఎన్నయినా తీసుకోనీ, ఎన్నయినా వాడుకోనీ, మాకేం అభ్యంతరం లేదు అన్నడు. తెలంగాణ ప్రయోజనాలను చంద్రబాబుకు పణంగా పెట్టే చర్యలను ఒప్పుకోబోమని మేము తేల్చిచెప్పితే రేవంత్‌కు జ్ఞానోదయమైంది. అప్పుడు వరద, మిగులు జలాల్లో కూడా తెలంగాణకు వాటా ఉంటుందని మాట్లాడిండు. బీఆర్ఎస్ గనక నిలదీసి ఉండకపోతే రేవంత్ అజ్ఞానం వల్ల తెలంగాణకు గోదావరి జలాల విషయంలో తరతరాల నష్టం జరిగి ఉండేది.
-హరీశ్
2020 అక్టోబర్2న కేంద్ర జలశక్తిశాఖ మంత్రి షెకావత్‌కు తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాసిన లేఖ. సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం గోదావరిలో తెలంగాణ, ఏపీ ఇరు రాష్ర్టాలు వినియోగించుకున్న తరువాత కూడా ఏటా 3000టీఎంసీలు సముద్రంలో కలుస్తన్నాయి. ప్రస్తుతం గోదావరిలో ఉన్న 967.15టీఎంసీల వాటాతోపాటు అదనంగా 1950టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలి. హైదరాబాద్ విస్తరణతోపాటు పెరుగుతున్న తాగునీటి, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి.