Home Guards | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): జనరల్ డ్యూటీ (జీడీ), అదర్ డిపార్ట్మెంట్స్ (ఓడీ) డ్యూటీల పేరుతో హోంగార్డులను ఉన్నతాధికారులు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డులు ఓడీ, జీడీ విభాగాలుగా నియమించబడ్డారు. వారి సేవలను అధికారులు తమ జిల్లాల పరిధిలో అవసరాలను బట్టి వినియోగించుకుంటున్నారు. దీంతో 20-30 ఏండ్లుగా ఆర్టీసీ, ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసీ, ట్రాన్స్‌కో, రైల్వేస్, ఎండోమెంట్, ఇరిగేషన్, మున్సిపాలిటీల్లాంటి పలు ఇతర డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న నిర్వహిస్తున్న హోంగార్డులు ఆ విభాగాల్లోనే విధులు నిర్వర్తించాలని ఇటీవల కొత్తగా ఆదేశించినట్టు తెలుస్తున్నది.
అయితే, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఓడీలు మూతపడ్డాయి. భవిష్యత్తులో సంస్థలు మనికొన్ని జిల్లాల్లో కూడా ఓడీలు మూతపడే అవకాశం ఉన్నదని హోంగార్డులు చెప్తున్నారు. ఇతర విభాగాల్లో ఉద్యోగాలు కోల్పోయినవారు జనరల్ డ్యూటీ చేయడానికి వీల్లేదని అధికారులు ఆదేశాలివ్వడంతో రిటైర్మెంట్ దశలో ఉన్న ఎంతో మంది హోంగార్డులు ఆందోళన చెందుతున్నారు.
ఇతర విభాగాల్లో పనిచేసే హోంగార్డులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని, డ్యూటీలు లేక ఇప్పటికే దాదాపు 600 మంది హోంగార్డుల కటుంబాలు పస్తులుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 20 ఏండ్లుగా అన్ని డ్యూటీలు చేసిన తమపై ఇప్పుడు ఆంక్షలు విధించడంతో ఏం చేయాలో తోచడం లేదని పేర్కొంటూ.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు సిబ్బంది కొరత కారణంగా ‘ఆర్డర్ టు సర్వ్’ ద్వారా హోంగార్డులను కూడా ఇతర జిల్లాలకు పంపారు. ఇప్పుడు అన్ని స్టేషన్లలో కొత్తగా కానిస్టేబుళ్లను నియమించినప్పటికీ అదే విధానంలో తమను దూర ప్రాంతాలకు పంపుతున్నారని, దీంతో నిత్యం ఎంతో దూరం ప్రయాణించాల్సి వస్తున్నదని హోంగార్డులు వాపోతున్నారు. తమకు టీఏ, డీఏ, హెచ్ఆర్ఏ, హెల్త్‌కార్డులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, లీవ్స్ వంటివి ఏమీ లేకపోయినా.. నిత్యం సొంత డబ్బులు పెట్టుకొని వందల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తున్నదని చెప్తున్నారు. కాంగ్రెస్ హయాంలో తమకు తీరని అన్యాయం చేస్తున్నాని మండిపడుతున్నారు. 90 రోజులలో హోంగార్డుల సమస్యలన్నీ పరిషరించడంతోపాటు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. సీఎం అయ్యాక తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా 15వ తేదీ తర్వాత వేతనాలు వస్తుండటంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.30 వేల వేతనంలో ప్రయాణాలకే రూ.12 వేలు ఖర్చవుతుంటే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి హోంగార్డుల సమస్యలను పరిషరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.