హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): విద్యార్థులను రేపటి వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా మలిచేందుకు ఇంటర్ ఫస్టియర్‌లోనే ప్రోత్సహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వారిలోని వ్యాపార ఆలోచనలను అంకురాలుగా తీర్చిదిద్దేందుకు రూ.2 వేల చిన్న పెట్టుబడిని అందజేయనున్నట్టు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి జెడ్పీ హైస్కూల్లో బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి అంకురం, చెలిమి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో మంత్రి మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల ఆలోచనలను ఆవిష్కరణలుగా, స్టార్టప్‌లుగా తీర్చిదిద్దేందుకు ‘అంకురం’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. బడుల్లో హ్యాపీనెస్ కరికులా న్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ బడు లను ప్రైవేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్న ట్టు వినోద్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మె ల్యే టీ ప్రకాశ్‌గౌడ్, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, విద్యా,సంక్షేమ మౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, డీఈవో సుశీందర్‌రావు పాల్గొన్నారు.
35 బడుల్లో బిజినెస్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రాం (అంకురం)
హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 35 ప్రభుత్వ బడులు ‘అంకురం బిజినెస్ ఇన్నోవేటర్’ ప్రోగ్రాంకు ఎంపికయ్యాయి. వీటిలో 28 తెలంగాణ మాడల్స్కూళ్లు, 4 కేజీబీవీలు, 3 తెలంగాణ గురుకుల విద్యాలయాలున్నాయి. విద్యార్థుల్లోని అంత్రప్రెన్యూర్ ఆలోచనల వెలికితీత లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ ఈ ప్రోగ్రాంను చేపట్టింది. ఇందులో 11వ తరగతి విద్యార్థులకు భాగస్వామ్యం కల్పిస్తారు. ఈ ప్రోగ్రాంకు ప్రభుత్వం రూ.27.30 కోట్లు వెచ్చించనున్నది. ఈ ప్రోగ్రాం లో విద్యార్థులు తమ ఆలోచనల ఆధారంగా ప్రాజెక్ట్‌లను రూపొందించి, అంకురాలుగా అభివృద్ధి చేస్తారు.
8 జిల్లాల్లో అమలు
రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో బిజినెస్ ఇన్నోవేటర్స్ ప్రోగ్రాంను అమలు చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో 8, ఖమ్మం 3, మహబూబ్‌నగర్ 1, నల్లగొండ 3, రాజన్న సిరిసిల్ల 3, రంగారెడ్డి 8, సిద్దిపేట 5, వరంగల్ 4 పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలుకానున్నది.
33 పాఠశాలల్లో ‘చెలిమి’
పాఠశాల విద్యాశాఖ.. రాష్ట్రంలోని 33 పాఠశాలలను ‘చెలిమి’ కార్యక్రమానికి ఎంపిక చేసింది. పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాకొక పాఠశాలను ఎంపిక చేశారు. ఈ చెలిమిలో 6, 7 తరగతుల విద్యార్థులకు సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను నేర్పిస్తారు. సురక్షిత, ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తారు. తమను తాము సంరక్షించుకోవడం, ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకుండా విద్యార్థులను అదుపు చేస్తారు.