కొండగట్టు: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు (Kondagattu) అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పెద్ద హనుమాన్ జయంతి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హనుమాను దీక్ష విరమణ కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మాలదారులు తరలిరావడంతో రద్దీ నెలకొంది. రామనామ స్మరణతో ఆలయ పరసరాలు మారుమోగుతున్నాయి.
ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి భక్తులు దీక్ష విరమణకు తలరివస్తున్నారు. ఇప్పటికే ఆలయానికి చేరుకున్నవారు అంజన్నను దర్శించుకుని, దీక్షను విరమిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం వరకు దీక్షాపరుల రద్దీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కాగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉత్సవాలను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా పరిశీలించారు.