హనుమకొండ, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశ రాజకీయాలను సమూలంగా మార్చనున్న నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. లోక్‌సభలో, అసెంబ్లీలో పెరుగనున్న స్థానాలెన్ని? ఉమ్మడి జిల్లాల్లో మార్పులు, చేర్పులు! నియోజకవర్గాల వారీగా మారనున్న మండలాలు! నియోజకవర్గాల రిజర్వేషన్లు ఏమిటి? మహిళలకు కేటాయించే సీట్లేవి? ఇలా ప్రతి అంశంపై అందరిలో కుతూహలం నెలకొన్నది. ఎన్డీఏ ప్రభుత్వం గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులతో చాలా అంశాలపై స్పష్టత రానున్నది.
నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటుతో ఈ ప్రక్రియ వేగవంతం కానున్నది. దేశంలో 1952, 1963, 1973, 2007, 2002లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగింది. ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రపాలిత ప్రాంతాలకు, కొన్ని రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగింది. గతంలో నిర్వహించిన పునర్విభజన ప్రక్రియతో పోల్చితే ప్రస్తుత ప్రక్రియ విస్తృతంగా ఉండనున్నది. గతంలో నియోజకవర్గాల పెంపు లేదా పునర్విభజన వరకే కమిషన్లు పరిమితమయ్యాయి. ఈసారి నియోజకవర్గాల పెంపు, పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు కలిపి నిర్వహించనున్నారు. పునర్విభజనతో ఏర్పాటయ్యే కొత్త నియోజకవర్గాలతోనే 2029 సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి.
2002 నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రక్రియలో లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల స్వరూపాలు, రిజర్వేషన్లు పూర్తిగా మారిపోయాయి. రెవెన్యూ మండలం మొత్తం ఒకే అసెంబ్లీ సెగ్మెంట్లో.. అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం ఒకే జిల్లాలో గత పునర్విభజన జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అంతకుముందు ఉన్న ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నిబంధనను కొనసాగించారు. నియోజకవర్గాల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన చేయాలనే ప్రాథమిక నిబంధన కారణంగా లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీగా మార్పులు జరిగాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత సేవారంగాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు వలసలు పెరిగాయి. అర్బన్ ప్రాంతాల్లో జనాభా బాగా పెరిగింది.
సగటు జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల సంఖ్య తగ్గి ఆ మేరకు హైదరాబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలోనే కొత్తగా 8 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుత పునర్విభజనలోనూ అధిక జనాభా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోనే అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా పెరుగనున్నాయి. గత పునర్విభజన కమిషన్ అనంతరం ఏర్పడిన లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు 2009లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల రాజకీయాల్లో వినూత్న మార్పులకు ఈ ఎన్నికలు కేంద్రంగా మారాయి.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీగా మార్పులొచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 సీట్లు రిజర్వ్ అయ్యాయి. పునర్విజన ప్రక్రియలో అత్యధిక జనాభా ప్రాతిపదికతోపాటు ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ ప్రాతినిధ్యం ఉండేలా ఎస్సీ, ఎస్టీ సీట్లను కేటాయించారు. నియోజకవర్గాల పునర్విభజనలో గతంలో ఉన్నవి రద్దయ్యాయి. కొత్త పేర్లతో ఏర్పాటయ్యాయి.
రద్దయినవి: లక్సెట్టిపేట, డిచ్పల్లి, నిజామాబాద్, బుగ్గారం, ఇందుర్తి, మేడారం(ఎస్సీ), మెట్పల్లి, నేరెళ్ల(ఎస్సీ), కమలాపూర్, రామాయంపేట, దొమ్మాట, హిమాయత్‌నగర్, ఆసిఫ్‌నగర్, మహరాజ్‌గంజ్, అమరచింత, చలకుర్తి, రామన్నపేట, చెన్నూరు, హనుమకొండ, వరంగల్, శాయంపేట, చేర్యాల, బూర్గంపాడు(ఎస్టీ), సుజాతనగర్,
కొత్తగా ఏర్పడినవి: బెల్లంపల్లి(ఎస్సీ), నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, కోరుట్ల, ధర్మపురి(ఎస్సీ), రామగుండం, వేములవాడ, మానకొండూరు(ఎస్సీ), పటాన్చెరు, దుబ్బాక, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేట, జూబ్లీహిల్స్, నాంపల్లి, గోషామహల్, బహదూర్‌పుర, నారాయణపేట, దేవరకద్ర, నాగార్జునసాగర్, హుజూర్నగర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, భూపాలపల్లి, పినపాక (ఎస్టీ), వైరా (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ),
ఎస్సీలోనే కొనసాగుతున్నవి: చెన్నూరు, జుక్కల్, వికారాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, అచ్చంపేట, స్టేషన్ ఘన్‌ఫూర్. జనరల్ క్యాటగిరీ నుంచి ఎస్సీకి మారినవి: చొప్పదండి, జహీరాబాద్, చేవెళ్ల, అలంపూర్, తుంగతుర్తి, నకిరేకల్, వర్ధన్నపేట, మధిర, సత్తుపల్లి.
ఎస్టీలోనే కొనసాగుతున్నవి: ఖానాపూర్, బోథ్, దేవరకొండ, ములుగు, ఇల్లెందు, భద్రాచలం.
జనరల్ నుంచి ఎస్టీకి మారినవి: డోర్నకల్, మహబూబాబాద్.
ఎస్సీ రిజర్వు నుంచి జనరల్: గజ్వేల్, ఇబ్రహీంపట్నం, సూర్యాపేట, ఆలేరు, పరకాల, పాలేరు.
ఎస్సీ నుంచి ఎస్టీకి: ఆసిఫాబాద్.
1973 నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన పునర్విభజన ప్రక్రియలో ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా నుంచి మొదలు పెట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో ముగించారు. 2001 జనాభా లెక్కల ఆధారంగా 2002లో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ 2007లో కేంద్ర ప్రభుత్వానికి తన ప్రతిపాదనలు సమర్పించింది. 2008 ఫిబ్రవరిలో రాష్ట్రపతి వీటిని ఆమోదించారు. ఉప ఎన్నికలు మినహా అప్పటి నుంచి అన్ని సాధారణ ఎన్నికలు కొత్త నియోజకవర్గాల ప్రకారమే జరిగాయి. 1973 నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన పునర్విభజనలో ఉమ్మడి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొదలై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ స్థానంతో ముగిసింది.
2002 నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రక్రియ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంతో మొదలై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాని ఇచ్చాపురంతో ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సిర్పూర్లో మొదలై భద్రాచలంతో ముగిసింది. ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ భద్రాచలంలో మొదలై సిర్పూర్లో ముగియనున్నది. ఇదే విధానం ప్రకారం ప్రస్తుత పునర్విభజన ప్రక్రియ జరుగనున్నది.
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో వరంగల్, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ ఎస్సీ క్యాటగిరీకి, ఆదిలాబాద్, మహబూబాబాద్ ఎస్టీ క్యాటగిరీకి రిజర్వ్ అయ్యాయి. 2009 ఎన్నికల ముందు జనరల్ క్యాటగిరీలో ఉన్న వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ ఎస్సీ క్యాటగిరీకి మారింది. జనరల్ క్యాటగిరీలో ఉన్న ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఎస్టీకి మారింది. పెద్దపల్లి, నాగర్‌కర్నూల్ పునర్విభజనకు ముందు, తర్వాత ఎస్సీ క్యాటగిరీలోనే కొనసాగాయి. 2009 ఎన్నికలకు ముం దు ఉన్న హనుమకొండ, సిద్దిపేట (ఎస్సీ), మిర్యాలగూడ, భద్రాచలం (ఎస్టీ) స్థానాలు రద్దయ్యాయి. వీటి స్థానంలో మల్కాజిగిరి, చేవెళ్ల, జహీరాబాద్, భువనగిరి, మహబూబాబాద్
(ఎస్టీ) కొత్తగా ఏర్పాటయ్యాయి.